Homeక్రీడలుక్రికెట్‌Gautam Gambhir : గౌతం గంభీర్.. దుకాణం మూసుకుంటే మంచిది!

Gautam Gambhir : గౌతం గంభీర్.. దుకాణం మూసుకుంటే మంచిది!

Gautam Gambhir : కోపం ఉండాలి.. కానీ అది అహంకారంగా మారకూడదు. మొండిపట్టుదల ఉండాలి. కానీ తాను పట్టిన కుందేలు మూడేళ్లు కాళ్లు అని అనకూడదు. అలా అన్నాడు కాబట్టే గౌతమ్ గంభీర్ టీమిండియాను సంకనాకించేస్తున్నాడు. అంతకుముందు కోచ్ లు సామరస్యంగా స్ఫూర్తినింపి పనిచేసుకుంటూ పోతుంటే.. ముక్కుసూటి గంభీర్ తన మాటే నెగ్గాలంటే పంతానికి పోయి పరువు తీసేస్తున్నాడు..

టీమిండియాలో ఇటీవల నెలకొన్న పరాభవాల పరంపర క్రికెట్ అభిమానులలో తీవ్రమైన ఆందోళన, ఆగ్రహం రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సొంతగడ్డపై వరుసగా రెండు టెస్ట్ వైట్‌వాష్‌లు, వన్డేల్లో కనిపిస్తున్న బలహీనత, సెలక్షన్ వివాదాలు.. ఈ వైఫల్యాలన్నిటికీ బాధ్యుడిగా కోచ్ గౌతమ్ గంభీర్ వైపు వేళ్లన్నీ చూపిస్తున్నాయి. గంభీర్ హయాంలో జట్టు ప్రదర్శన అత్యంత దారుణంగా పడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

* 15 నెలల్లోనే టీమిండియా పతనమా?

గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం 15 నెలల్లోనే టీమిండియా చరిత్రలో ఎన్నడూ లేని హీనమైన కాలాన్ని చూసింది.
న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ వైట్‌వాష్.. దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ వైట్‌వాష్.. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఓటమి.. శ్రీలంక చేతిలో వన్డే పరాభవం (27 ఏళ్ల తర్వాత), ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్ ఓటమి చవిచూసింది. గత టీమిండియా కోచ్ లు కిర్‌స్టన్, రవిశాస్త్రి, ద్రవిడ్ వంటి కోచ్‌ల హయాంలో కూడా ఓటములు వచ్చాయి గాని, ఇంతటి పరాభవం, అంత వరుసగా ఓటముల పరంపర మాత్రం రాలేదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

* సమస్య ఎక్కడ? గంభీర్ నిర్ణయాలే కారణమా?

జట్టు వైఫల్యానికి కేవలం ఆటగాళ్ల ఆటతీరు మాత్రమే కాదు, కోచ్‌గా గంభీర్ తీసుకున్న నిర్ణయాలే కీలక కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సెలక్షన్‌లో అస్పష్టత

గంభీర్ కాలంలో తీసుకున్న నిర్ణయాలు పెద్ద వివాదాలకే దారి తీశాయి. ఫామ్‌లో ఉన్నవారిని పక్కన పెట్టడం, అనుభవజ్ఞులైన ఆటగాళ్లను సరిగ్గా వినియోగించకపోవడం, యంగ్‌స్టర్స్‌ను తప్పు స్థానాల్లో ప్రయోగించడం వంటివి జట్టులో స్థిరత్వం లేకపోవడానికి స్పష్టమైన నిదర్శనాలు.

జట్టు వాతావరణంలో ఉద్రిక్తత

ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లైన అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి వారితో గంభీర్ సంబంధాలు ఆశించిన స్థాయిలో లేవని అనేక రూమర్స్, అభియోగాలు వినిపిస్తున్నాయి. డ్రెస్సింగ్ రూమ్ హార్మనీ తగ్గితే, మైదానంలో ప్రతిభ ఎంత ఉన్నా ఫలితాలు రావడం కష్టం.

* పిచ్‌లపై జోక్యం?

కోచ్ గంభీర్ నచ్చిన విధంగా టెస్ట్ పిచ్‌లు రెడీ చేయించుకునే ప్రయత్నాలు జరిగాయనే భావన బలంగా ఉంది. బౌన్సింగ్ పిచ్ కావాలా? టర్నింగ్ ట్రాక్ కావాలా? అనే విషయంలో కోచ్ జోక్యం పెరిగి, అది ఆటగాళ్ల సహజ శైలికి వ్యతిరేకంగా పనిచేసిన సందర్భాలు కనిపించాయి.

* వ్యూహరహిత ఆటతీరు

ధోని – కిర్‌స్టన్ లేదా రవిశాస్త్రి – కోహ్లి లాంటి స్ట్రాంగ్ కాంబినేషన్‌లు టీమిండియాకు గతంలో విజయాలను అందించాయి. కానీ గంభీర్ హయాంలో ప్లానింగ్ లోపం, ప్రత్యర్థుల వ్యూహాన్ని చదువుకోలేకపోవడం, డీసెంట్ ప్లేయింగ్ XIను సెట్ చేయలేకపోవడం వంటి లోపాలు ఎక్కువయ్యాయి.

* బాధ్యత ఎవరిది?

వైఫల్యాలకు కోచ్‌గా గంభీర్‌పై ప్రశ్నలు రావడం సహజమే. అయితే, తప్పిన ప్లేయర్లు, సెలక్షన్ కమిటీ, చివరికి BCCI కూడా నిర్ణయాల్లో భాగస్వాములే. అయినా, ఫ్రంట్ ఫేస్ కోచ్ కాబట్టి విమర్శలన్నీ ఆయనకే చేరుతున్నాయి.

* గంభీర్ భవిష్యత్ ఏం కానుంది?

ఇప్పటి పరిస్థితుల్లో బోర్డు ఆయనపై కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని, స్థానంలో మార్పు రావచ్చని బీసీసీఐ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జట్టు పునర్నిర్మాణం అవసరమని నిపుణులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

అభిమానుల భావన సూటిగా చెప్పాలంటే “ఇలాగే కొనసాగితే దుకాణం మూసుకోవడమే మంచిది” అనే స్థాయిలో గంభీర్ పనితీరుపై నిరాశ నెలకొంది.

గౌతం గంభీర్ హయాంలో టీమిండియా ప్రదర్శన నిజంగా దారుణంగా పడిపోయింది. మ్యానేజ్‌మెంట్–ప్లేయర్లు–కోచ్ మధ్య మిస్అండర్‌స్టాండింగ్‌లు, తప్పుడు సెలక్షన్‌లు, అనవసర అహంకారం.. ఈ అంశాలన్నీ కలసి జట్టు పతనానికి దారి తీశాయి. ఇప్పుడు బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే టీమిండియాకు మరిన్ని పరాభవాలు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular