Homeఉద్యోగాలుEducation Value Crisis : విద్యలో అడుగంటుతున్న విలువలు: ప్రమాదపు అంచులో భారతీయ విద్య

Education Value Crisis : విద్యలో అడుగంటుతున్న విలువలు: ప్రమాదపు అంచులో భారతీయ విద్య

* మార్కుల యంత్రలే కానీ నైపుణ్యాలు కరువు…
* కానరాని మానవత్వం సోషల్ మీడియా లకే ప్రాధాన్యత
* ఇది నేటి విద్య వ్యవస్థ తీరు ప్రమాదపు అంచులో భారతీయ విద్యా
*ప్రముఖ మోటివెటర్ .లైఫ్ స్కిల్స్ ట్రైనర్ అయిలపాక సాగర్

“మొక్కై వంగనిదే మానై వంగునా” అన్న సామెత మనకు బాగా తెలుసు. చెట్టు మొక్కగా ఉన్నప్పుడే సరైన పోషణ, మలుపు ఇస్తే అది మహా వృక్షంగా ఎదిగి తన ఉనికిని చాటుకుంటుంది. సరిగ్గా అలాగే, విద్యార్థి కూడా బాల్య దశలోనే, కౌమార దశలోనే సరైన క్రమశిక్షణ, విలువలు అర్థం చేసుకొని పాటిస్తే వారి భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుంది. కానీ, నేటి విద్యలో విద్యార్థికి నేర్పాల్సిన కనీస విలువలు కానరావడం లేదు.

* మానవత్వాన్ని మర్చిపోతున్న విద్యాలయం

ప్రపంచానికి విలువలు నేర్పిన గొప్ప చరిత్ర గల భారతదేశంలో, విద్యార్థులకు ‘మాతృ దేవోభవ’, ‘పితృ దేవోభవ’, ‘ఆచార్య దేవోభవ’, ‘అతిథి దేవోభవ’ వంటి సంస్కారాలు కేవలం పలకడానికి కూడా నోరు తిరగని పరిస్థితి. నేటి విద్యా వ్యవస్థ పిల్లలను కేవలం మార్కుల యంత్రాలుగా తయారుచేస్తోంది. ర్యాంకర్లను తయారుచేయడానికి అహర్నిశలు కష్టపడుతున్న విద్యాలయాలు, ఉపాధ్యాయులు… మానవత్వాన్ని కలగలిపిన మనుషుల్ని తయారుచేయడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారు.

తల్లిదండ్రులకు విలువ ఇవ్వనివారు రేపు సమాజానికి, దేశానికి ఏమి విలువ ఇస్తారు? సమాజం పట్ల, దేశం పట్ల భక్తిని, వారి బాధ్యతను గుర్తు చేయాల్సిన విద్యా వ్యవస్థ, కేవలం “ఒక ప్రశ్న – దానికి సమాధానం – దానికి మార్కులు” అనే పద్ధతిలో ముందుకు సాగుతోంది. విద్యార్థికి కావాల్సిన కనీస మౌలిక విలువలు, జీవిత నైపుణ్యాలు నేర్పించకపోవడం మనం అందరం ఆలోచించాల్సిన విషయం.

* సోషల్ మీడియాకు బానిస అవుతున్న బాల్యం

దేశ చరిత్ర గొప్పతనం, సంస్కృతి, దాని విలువ గురించి చెప్పాల్సిన విద్యాలయాలు ఆ దిశగా కనీసం ఆలోచించడం లేదు. దానివల్ల మన దేశ గొప్పతనం ఈ తరానికి తెల్వకుండా పోతోంది. పుస్తకాల్లో, లైబ్రరీలో, ఆటస్థలంలో, స్నేహితులతో సరదాగా గడుపుతూ ఎదగాల్సిన బాల్యం నేడు సోషల్ మీడియాకు బానిస అవుతోంది. దీనికి తల్లిదండ్రులు, విద్యాలయాలు కారణం కాదని ఎవరమూ ఒప్పుకోకపోయినా, ఇదే ముమ్మాటికీ నిజం.

విలువలు నేర్చుకోలేని బాల్యం నేడు తల్లికి సరైన విలువ ఇవ్వడం లేదు. తండ్రిని రాక్షసుడిలా చూస్తున్నారు. తోబుట్టువుల పైన కక్ష తీర్చుకునే స్థాయికి ఎదిగిపోయారు. అనుకున్నది దక్కించుకోవడం కోసం తోటి విద్యార్థులను, స్నేహితులను చంపడానికి కూడా వెనుకాడటం లేదు. బాల్యంలోనే ఇంత వికృత చేష్టలకు అలవాటు పడుతున్నారు, ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారు అంటే ఇది ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఒక పెద్ద సమస్యే.

* బట్టీ పట్టే విద్య, జీవన జ్ఞానం శూన్యం

నూటికి తొంభై మార్కులు తెచ్చుకున్న విద్యార్థి నేడు ఇంటర్వ్యూలలో చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా తెల్ల మొహం వేస్తున్నాడు. దీనికి కారణం బట్టీ పట్టించడమే. పుస్తక పాఠాలు ఎంతో అద్భుతంగా చెప్తున్న విద్యాలయాలు, విలువలతో కూడిన జీవిత పాఠాలు నేర్పకపోవడం ఒక పెద్ద తప్పిదం. పుస్తకాల జ్ఞానమే కాదు, జీవిత జ్ఞానం నేర్పాలి. అందులో నేటి విద్యా వ్యవస్థ దారుణంగా విఫలమవుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తగ్గితే బాధపడే విద్యార్థి, మార్కులు తక్కువ వస్తే పట్టించుకోవట్లేదు.

పైగా, ఉపాధ్యాయుడు మందలిస్తే ఉపాధ్యాయులను సైతం శిక్షించడానికి వెనకాడటం లేదు.

‘గురువుల చేతిలో విద్యార్థి భవిష్యత్తు’ అనే దగ్గర నుండి, ‘విద్యార్థి చేతిలో గురువు బతుకు’ అనేదాకా వచ్చింది నేటి వ్యవస్థ. చట్టాలు, నియమాలు అంటూ ఒకవైపు గురువుల చేతులు కట్టేయడమే దీనికి ప్రధాన కారణం.

శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, రాజులు, మహాపురుషుల కంటే నేడు యూట్యూబర్‌లు నేటి విద్యార్థులకు ఆదర్శంగా మారిపోయారు. ఎందుకంటే విద్యాలయాల్లో మహనీయుల జీవిత చరిత్రలు పిల్లలకు చెప్పకపోవడం, పుస్తకాల్లో స్వదేశీ మహనీయులకు సరైన గౌరవం ఇవ్వకపోవడం. గురువును దైవంగా చూసే ఈ దేశంలో నేడు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ అందించే యంత్రాలుగా చూస్తున్నారు.

*పరిష్కారం: సమష్టి బాధ్యత

ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే దేశ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడం చాల దగ్గర్లోనే ఉంది. ఇలాంటి వ్యవస్థను అడ్డుకొని రూపుమాపాల్సిన అవసరం ఉంది. అది కేవలం విద్యాలయాల్లో ఉపాధ్యాయుల చేతిలో ఉంది. దీనికి తల్లిదండ్రులు, ఈ సమాజం తప్పకుండా తోడ్పాటును అందించాలి. మార్కులతో పాటు మానవత్వాన్ని, నైపుణ్యాలను నేర్పించినప్పుడే దేశ భవిష్యత్తు పటిష్టంగా ఉంటుంది.

✍️ అయిలపాక సాగర్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular