
తెలంగాణలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందా అని ఎదురు చూస్తున్న ఆశావహులకు నిరాశే మిగిలింది. తెలంగాణలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించేందుకు ఇది అనువైన సమయం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3వ తేదీతో ముగిసింది. గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, మహమ్మద్ ఫరిదుద్దీన్, ఆకుల లలిత పదవీకాలం పూర్తయిన వారిలో ఉన్నారు. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన తెలంగాణ భవన్ ఇంచార్జి ఎం. శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ పదవీ కాలం జూన్ 16 నాటికి ముగిసింది.