Nellimarla Constituency : కూటమి ప్రభుత్వంలో విభేదాలు ఎప్పుడొస్తాయా? అని వైసిపి ఎదురుచూస్తోంది. ఓటమితో బాధపడుతున్న ఆ పార్టీకి కావాల్సింది అదే. టిడిపి, జనసేన, బిజెపి కలిసి ఉంటే ఆ పార్టీకి ప్రమాదకరమే. అయితే కూటమి అధినేతలు మాత్రం పొత్తు మరో దశాబ్ద కాలం పాటు కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల పరిస్థితి మారుతోంది. వైసీపీ కిందిస్థాయి శ్రేణులు జనసేనలోకి చేరుతుండడంతో.. టిడిపి శ్రేణులకు ప్రాధాన్యంతగ్గుతోంది.ఈ తరుణంలో విభేదాలు తెరపైకి వస్తున్నాయి.విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో జరిగింది అదే. దీంతో అక్కడ పోస్టుమార్టం నిర్వహిస్తోంది కూటమి ప్రభుత్వం. స్థానిక జనసేన ఎమ్మెల్యే తో పాటు టిడిపి కీలక నేతలను అమరావతికి రప్పించి.. సలహాలు సూచనలు ఇచ్చింది. సమన్వయంతో ముందుకు సాగాలని సూచించింది. మరోసారి విభేదాలు బయటపడితే కఠిన చర్యలు తప్పవని సంకేతాలు పంపింది. అయితే ఒక్క నెల్లిమర్ల నియోజకవర్గమే కాదు..దాదాపు చాలానియోజకవర్గాల్లో పరిస్థితులు ఇలానే ఉండడంతో ఫోకస్ పెట్టింది కూటమి.ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి ఛాన్స్ ఇవ్వొద్దని హితబోధ చేస్తోంది.
* జనసేన ఎమ్మెల్యే
పొత్తులో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని దక్కించుకుంది జనసేన. అప్పటికే ఇక్కడ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా కర్రోతు బంగార్రాజు ఉన్నారు. ఆయన బలమైన నేత కూడా. టిడిపి గెలుపు బాట లో ఉన్న నియోజకవర్గాల్లో భోగాపురం ఒకటి. అటువంటి నియోజకవర్గం పొత్తులో భాగంగా చేజారి పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు బంగార్రాజు. అయితే చంద్రబాబు ఒప్పించే సరికి సమ్మతించారు. ఎన్నికల్లో జనసేన లోకం మాధవి గెలుపు కోసం కృషి చేశారు. అయితే ఆమె గెలిచిన తర్వాత టిడిపి శ్రేణులను నిర్లక్ష్యం చేస్తున్నారన్నది బంగార్రాజు నుంచి వినిపిస్తున్న మాట. ఇంతలో ఆయనకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి దక్కింది. దీంతో ఆ ఇద్దరు నేతల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. బాహటంగానే విభేదించే పరిస్థితి వచ్చింది. అందుకే కూటమి హై కమాండ్ స్పందించింది.
* అమరావతిలో పంచాయితీ
నిన్ననే అమరావతి వెళ్లారునెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, టిడిపి నేత బంగార్రాజు. ఇద్దరికీ సుతిమెత్తగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రెండు దశాబ్దాల పాటు కూటమి ముందుకు సాగుతుందని.. ఈ తరుణంలో కిందిస్థాయిలో సమన్వయం చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. మరోసారి సమావేశం ఉంటుందని.. రెండు పార్టీల శ్రేణులనుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయితే కఠిన చర్యలకు దిగుతామని కూడా హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఒక్క నెల్లిమర్లే కాదు. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. అక్కడ సమన్వయానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి రెండు పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.