Delhi assembly elections results 2025: 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీ నియోజకవర్గంలో.. 48 స్థానాలలో బిజెపి ముందంజలో ఉంది. 22 స్థానాలలో ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ లో ఉంది. ట్రెండ్ ఇలాగే కొనసాగితే బిజెపి ఢిల్లీలో పీఠాన్ని అధిరోహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫలితాలు ముందుగానే ఊహించినవని.. ఆప్ అవినీతి పరిపాలన భరించలేక ప్రజలు తమకు ఓట్లు వేసి గెలిపించారని బిజెపి నాయకులు అంటున్నారు.. ” వారు మూడు పర్యాయాలు అధికారంలో ఉన్నారు. ఢిల్లీని ఏమాత్రం పట్టించుకోలేదు. కాలుష్యం తారా స్థాయికి చేరింది. అభివృద్ధి కనిపించడం లేదు. మద్యం కుంభకోణం, వాటర్ కుంభకోణం వంటివి ప్రజలకు విసుగు తెప్పించాయి. కాంగ్రెస్ పరిపాలన, ఆప్ పరిపాలనపై ప్రజలకు ఇప్పటికే విపరీతమైన విసుగు వచ్చింది. అందువల్లే మా పార్టీని ఎన్నుకున్నారు. ఇప్పటికి మా అభ్యర్థులు 48 స్థానాలలో లీడ్ లో కొనసాగుతున్నారు. అధికారం మాదే. ఢిల్లీకి సరికొత్త రూపు తీసుకొస్తాం. దిశ, దశ ను పూర్తిగా మార్చేస్తామని” బిజెపి నాయకులు అంటున్నారు..
మాస్టర్ స్ట్రోక్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ ఓడిపోయారు. ఆయనకు న్యూఢిల్లీ స్థానం మొదటి నుంచి కంచుకోట . గతంలో ఈ స్థానంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వరుసగా విజయం సాధించారు. అయితే 2013 ఎన్నికల్లో ఆమెను ఓడించి తొలిసారిగా అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి నుంచి ఇదే స్థానంలో ఆయన గెలుచుకుంటూ వస్తున్నారు. అయితే ఈసారి ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కు టికెట్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ నుంచి పర్వేశ్ వర్మ పోటీ చేశారు. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడిని రంగంలోకి దింపినప్పటికీ.. ఇక్కడ ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్, పర్వేష్ మధ్యే పోటీ నెలకొంది.. చివరికి హోరాహోరీగా సాగిన ప్రచారంలో పర్వేష్ ముందున్నారు. వ్యూహాత్మకమైన ప్రణాళికలతో అరవింద్ కేజ్రీవాల్ కంటే మెరుగ్గా నిలిచారు. చివరికి ఎన్నికల్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిని ఓడించి సంచలనం సృష్టించారు. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతారని ఎవరూ ఊహించలేదు. అయితే ఎవరు ఊహించని ఫలితాన్ని పర్వేష్ అందించారు.. అరవింద్ కేజ్రీవాల్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ ఓటమితో దేశవ్యాప్తంగా సంచలనం నమోదయింది. మీడియా, సోషల్ మీడియాలో ఇదే వార్త ప్రధానంగా కనిపిస్తోంది. అవినీతి, పరిపాలనను పక్కన పెట్టడం.. దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలవడం వంటి పరిణామాలు అరవింద్ కేజ్రీవాల్ కు ప్రతిబంధకంగా నిలిచాయి. చివరికి ఆయన ఓటమికి కారణమయ్యాయి. ఓటమి అనంతరం ఆప్ కార్యాలయంలో ఒక్కసారిగా నిరాశాజనకమైన వాతావరణం నెలకొంది.