IT employees layoff : నాలుగేళ్లు బీటెక్ చదివి.. సంవత్సరం పాటు ఏదో ఒక కోర్స్ నేర్చుకుని.. పెట్టిన పరీక్షల మొత్తం పాస్ అయితేనే ఐటీ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తాయి. వారానికి ఐదు రోజులు మాత్రమే పని అని చెప్పినప్పటికీ.. ఉన్నంతసేపు చమురు తీస్తాయి. భారీగా జీతాలు ఇస్తాయని పేరే తప్ప.. అందులో ఉన్న వత్తిడి అంతా ఇంతా కాదు. అయినప్పటికీ ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారంటే కారణం ప్రభుత్వాలు సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం.. నోటిఫికేషన్లు ఇచ్చినా పేపర్ లీకేజీలతో అవి రద్దుకోవడం వంటి పరిణామాలు.. యువతలో నైరాశాన్ని పెంచుతున్నాయి. అందువల్లే ఏదో ఒకటి అనుకొని చాలామంది ఐటీ ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఇందులో కూడా దండిగా సంపాదిస్తున్న వారు ఉన్నప్పటికీ.. ఎక్కువ శాతం కింది, మధ్యస్థాయి ఉద్యోగాల్లోనే కొనసాగుతున్నారు.. కోవిడ్ సమయంలో వీరికి మంచి డిమాండే ఉన్నప్పటికీ.. కరోనా తర్వాత.. ఐటీ కంపెనీలు ఉద్యోగులకు సినిమా చూపిస్తున్నాయి. ఆర్థిక మాంద్యాన్ని సాకుగా చూపి అడ్డగోలుగా ఉద్యోగులను బయటికి పంపిస్తున్నాయి. గత ఏడాది ప్రారంభం నుంచి మొదలైన ఈ ప్రక్రియ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. తాజాగా రెండు ఐటీ కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను బయటికి పంపించాయి.
ప్రముఖ టెలి కమ్యూనికేషన్ సంస్థ బెల్ (Bell), ఇటాలియన్ – అమెరికన్ ఆటోమేకర్ సంస్థ స్టెల్లాంటిస్ (Stellantis) వేలాదిమంది ఉద్యోగులపై ఒక్క వీడియో కాల్ ద్వారా వేటు వేశాయి. ఈ మేరకు ఫార్చ్యూన్ మ్యాగజైన్ వివరాలు వెల్లడించింది. అమెరికాలో తమకు సంబంధించిన టెక్నాలజీ విభాగంలో పనిచేస్తున్న 400 మంది ఉద్యోగులను బయటికి పంపించామని స్టెల్లాంటిస్ (Stellantis) స్పష్టం చేసింది. ఈనెల 22న ఉద్యోగులకు రిమోట్ కాల్ ద్వారా లే ఆఫ్ ప్రకటించింది. దీంతో ఆ ఉద్యోగులు లబోదిబో అనుకుంటూ బయటికి వెళ్లిపోయారు. స్టెల్లాంటిస్ (Stellantis) సంస్థకు ఇండియా, మెక్సికో, బ్రెజిల్ దేశాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగులు సేవలందిస్తున్నారు. వారు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. పైగా తక్కువ వేతనాలే తీసుకుంటున్నారు. అయినప్పటికీ సంస్థ వారిపట్ల ఉదారత చూపించలేదు. మరోవైపు సంస్థలో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులను తొలగించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అడ్డగోలుగా తొలగించిన ఉద్యోగులను వట్టి చేతులతో పంపించకుండా.. ప్యాకేజీ చెల్లించినట్టు తెలుస్తోంది.
ఇక ప్రముఖ టెలి కమ్యూనికేషన్ సంస్థ బెల్ కూడా వందల మంది ఉద్యోగులను బయటికి పంపించింది. కేవలం పది నిమిషాల వీడియో కాల్ ద్వారా ఉద్యోగులపై వేటువేసింది. ఇటీవల కంపెనీకి సంబంధించి వర్చువల్ గ్రూప్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆ సంస్థ మేనేజర్ లే ఆఫ్ నోటీస్ చదివి వినిపించారు. “కంపెనీ పునర్వ్యవస్థీకరణ కోసం చాలా మార్పులు చేస్తున్నాం. అందువల్ల ఉద్యోగాల్లో కోతలు విధించాలని నిర్ణయించాం. వచ్చే రోజుల్లో దాదాపు 5,000 మందిని తొలగిస్తామని” ఆ కంపెనీ సీఈవో మిర్కో బిబిక్ ప్రకటించారు. ఆ సంస్థ తొలగించిన ఉద్యోగుల్లో ఇది 9 శాతానికి సమానమని తెలుస్తోంది. తమను తొలగించడం పట్ల సంస్థపై ఉద్యోగులు మండిపడుతున్నారు. సిగ్గుమాలిన చర్య అని అభివర్ణిస్తున్నారు.. కేవలం నిమిషాల వ్యవధిలో ఇంత మంది ఉద్యోగులను తొలగిస్తే.. వారి భవితవ్యం ఏమి కావాలని కెనడాకు చెందిన ఉద్యోగుల సంఘం యూనిఫోర్ ఆరోపించింది..
ఇక ప్రముఖ కంప్యూటర్ తయారీ సంస్థ డెల్ కూడా ఉద్యోగుల తొలగింపు బాట పట్టింది. ఖర్చు తగ్గింపులో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించినట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే ఎంతమందిపై వేటు వేసామనేది ఆ సంస్థ చెప్పలేదు. గత ఏడాది ఈ సంస్థ దాదాపు 7వేల మందికి ఉద్వాసన పలికింది. ఏడాది ఫిబ్రవరి నాటికి డెల్ ఉద్యోగుల సంఖ్య 1,20,000 కు పడిపోయింది.