Gautam Gambhir Ajit Agarkar : వన్డే, టీ 20 ఫార్మాట్లలో భారత జట్టు అదరగొడుతున్నప్పటికీ.. టెస్ట్ ఫార్మాట్లో టీమిండియా మాత్రం దారుణంగా విఫలమవుతోంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ప్రక్షాళన చేపట్టాలని డిమాండ్లు వస్తున్నాయి. ముఖ్యంగా గౌతమ్ గంభీర్, అగార్కర్ పై వేటు వేస్తారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఒక యుద్ధమే సాగింది. భారత జట్టు టి20 వరల్డ్ కప్ సాధించినప్పుడు, ఛాంపియన్స్ ట్రోఫీ అందుకున్నప్పుడు కూడా ఈ స్థాయిలో సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువ సాగలేదు. దీనిని బట్టి అభిమానుల్లో ఏ స్థాయిలో ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు.
టీమిండియా టాప్ ఆర్డర్ మొత్తం విఫలమవుతున్న నేపథ్యంలో.. విరాట్ కోహ్లీని తిరిగి జట్టులోకి తీసుకొస్తున్నారనే చర్చ కూడా మొదలైంది. బిసిసిఐ సంప్రదింపులు కూడా జరుపుతోందనే వార్తలు కూడా వినిపించాయి. అయితే దీనిపై మొత్తానికి బీసీసీఐ మౌనాన్ని వీడింది. సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించింది. “అవన్నీ రూమర్లు. అందులో ఎటువంటి వాస్తవం లేదు. విరాట్ కోహ్లీ గురించి జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదు. అనవసరమైన వాటి గురించి ప్రచారం చేయకూడదు. ఆ చర్చ కూడా జరగలేదని” బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.
గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కార్ విషయంలో కూడా బీసీసీఐ స్పందించింది. కొన్ని విషయాల గురించి అనవసరమైన చర్చ చేయకూడదని సూచించింది. ఇటువంటి చర్చల వల్ల ఊహాగానం మాత్రమే మాత్రమే వ్యాప్తిలోకి వస్తుందని బిసిసిఐ సెక్రటరీ సైకియా పేర్కొన్నారు. “సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ వాస్తవం కాదు. కొంతమంది అలాంటి వాటిని నమ్ముతుంటారు. సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ ఎటువంటి నిర్ణయాలు తీసుకోదు. అధికారికంగా తీసుకున్న నిర్ణయాలను అధికారికంగానే భారత క్రికెట్ మేనేజ్మెంట్ ప్రకటిస్తుంది. ఇటువంటి విషయాలలో ఊహగానాలకు ఆస్కారం లేదు. అనవసరమైన విషయాలను నమ్మకూడదని” సైకియా పేర్కొన్నారు.
మరోవైపు బీసీసీఐ ఇటీవల ఒక ప్రకటన కూడా చేసింది. కోచ్ విషయంలో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టత ఇచ్చింది. గంభీర్ పదవీకాలం పూర్తయ్యేంతవరకు ఎటువంటి సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని బోర్డు పెద్దలు అంతర్గతంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పదవి కాలం పూర్తయ్యే వరకు గంభీర్ పోస్ట్ కు ఎటువంటి డోకా లేదని తెలుస్తోంది.