Bandi Sanjay vs KTR : ఒకప్పుడు రాజకీయాలలో విమర్శలు విధానపరంగా ఉండేవి. కాలం మారుతున్న కొద్ది విమర్శలు వ్యక్తిగత జీవితాలలోకి ప్రవేశించాయి. ముఖ్యంగా తెలంగాణలో గడిచిన 10 సంవత్సరాలుగా రాజకీయాలు వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసే విధంగా మారిపోయాయి. వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంలో నాయకులు పోటీపడ్డారు. దానికి తోడు బజారు భాష ఉపయోగించడంతో మరింత చులకన అయిపోయారు. వాస్తవానికి ఇటువంటి పరిణామాలే రాజకీయాలపై మరింత దారుణమైన అభిప్రాయాన్ని ప్రజలకు కలిగేలా చేశాయి.
తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు బండి సంజయ్ మీద భారత రాష్ట్ర సమితి ఎన్నో కేసులు పెట్టింది. భారత రాష్ట్ర సమితి నాయకులు అడ్డగోలుగా విమర్శలు చేశారు. వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు. అప్పట్లో బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మర్చిపోయి తెలంగాణ పోలీసులు ఆయనను అనేక సందర్భాల్లో అరెస్ట్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. బండి సంజయ్ మీద కేసీఆర్ నుంచి మొదలు పెడితే కేటీఆర్ వరకు అడ్డగోలుగా మాట్లాడారు. కెసిఆర్ అయితే తల ఆరు వక్కలు అవుతుందంటూ హెచ్చరించారు. కేటీఆర్ తంబాకు నములుతాడని బండి సంజయ్ ని ఉద్దేశించి విమర్శించారు. అంతేకాదు సన్నాసిని పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ ప్రజలు ఎన్నుకున్నారని దెప్పి పొడిచారు. ఇటీవల కామారెడ్డి, సిరిసిల్ల ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో కేటీఆర్, బండి సంజయ్ పరస్పరం ఎదురుపడ్డారు. ఇద్దరు ఒకరికి ఒకరు పరస్పరం నమస్కారం పెట్టుకున్నారు. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య వైరం తగ్గిపోయిందని అనుకుంటే.. కేటీఆర్ బండి సంజయ్ పై పది కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఫోన్ టాపింగ్ కేసులో తనను అనవసరంగా విమర్శిస్తున్నారని అందులో కేటీఆర్ పేర్కొన్నారు.
కేటీఆర్ నుంచి లీగల్ నోటీసులు అందుకున్న తర్వాత బండి సంజయ్ స్పందించారు. తను లవంగాలు తింటే కూడా తంబాకు తింటున్నారు అన్నట్టుగా విమర్శించారని.. అడ్డగోలుగా మాట్లాడారని.. అసలు వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేసి విమర్శించారని.. అలాంటి వాటికి తాను ఎన్ని లీగల్ నోటీసులు పంపించాలని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇటువంటి లీగల్ నోటీసులకు తాను భయపడబోనని.. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనమీద ఎన్నో కేసులు పెట్టిందని.. ఆ కేసులకు తాను ఎన్నడూ భయపడలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. అంతేకాదు తాను రాజకీయాల్లోకి స్వతహాగా వచ్చానని.. స్వతహాగానే ఎదిగానని సంజయ్ వెల్లడించారు. కేటీఆర్ మాదిరిగా తండ్రి పేరు చెప్పుకొని తాను రాజకీయాల్లోకి రాలేదని సంజయ్ క్లారిటీ ఇచ్చారు.