
గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాల వల్ల ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అరవింద్ కుమార్ ను కేటీఆర్ ఆదేశించారు. ఇప్పటికే నిర్మల్ వంటి చోట్ల భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో జరుగుతున్న సహాయక చర్యలపై జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.