Australia cricket : జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. కీలకమైన మ్యాచ్ లో శ్రీలంక చేతిలో కూడా ఓడిపోయింది. తద్వారా సూపర్ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది ఆస్ట్రేలియా జట్టు. ఈ నేపథ్యంలో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఆ జట్టుకు ఏర్పడింది.
మంగళవారం ఐర్లాండ్, జింబాబ్వే మధ్య కీలకమైన మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ నిర్వహణకు వర్షం అడ్డంకి కలిగించింది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. గ్రూప్ దశలో వర్షాలు అడ్డంకి కలిగిస్తే ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారు. ఎందుకంటే గ్రూప్ దశలో మ్యాచ్ లకు రిజర్వ్ డే అనేది లేదు. అందువల్లే జింబాబ్వే, ఐర్లాండ్ జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు.
మ్యాచ్ రద్దు కావడం.. ఒక పాయింట్ లభించడంతో జింబాబ్వే జట్టు మొత్తంగా సూపర్ 8 దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు విజయాలతో శ్రీలంక కూడా సూపర్ 8 దశకు వెళ్ళింది. ఆడిన 3 మ్యాచ్లలో రెండు ఓడిపోవడంతో ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే ఇంటి బాట పట్టింది. మరొక మ్యాచ్ ఆస్ట్రేలియా జట్టు ఆడాల్సి ఉంది. ఒకవేళ ఆ మ్యాచ్లో గెలిచినా ఆస్ట్రేలియా జట్టుకు పెద్దగా ఉపయోగం ఉండదు.
ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. ఆ జట్టులో బలమైన ప్లేయర్లు ఉన్నారు. వారంతా కూడా అద్భుతంగా ఆడే వారే. కానీ, కీలకమైన మ్యాచులలో ఓడిపోయారు. జింబాబ్వే చేతిలో ఓటమి ఎదుర్కొన్న తర్వాత కూడా ఆస్ట్రేలియా జట్టు ఆట తీరు మారలేదు. శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ లోపం కారణంగా ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఓపెనర్లు భారీగా పరుగులు చేసినప్పటికీ .. మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో ఆస్ట్రేలియా జట్టు మూల్యం చెల్లించుకుంది.
ఆస్ట్రేలియా జట్టు గ్రూప్ దశలోనే ఇంటి బాట పట్టడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఇలాంటి దారుణమైన స్థితి తమ జట్టుకు రావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. టైటిల్ గెలుస్తుంది అనుకుంటే.. చివరికి గ్రూప్ దశలో ఇంటికి వచ్చిందని.. జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓడిపోయి పరువు తీసుకుందని ఆస్ట్రేలియా అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.