Ashes Series 2025 : వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి.. యాషెస్ సిరీస్ ను సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా జట్టు. సిరీస్ సొంతం చేసుకున్నప్పటికీ ఆస్ట్రేలియా జట్టుకు ఆ ఆనందం ఏమాత్రం లేదు. దీనికి ప్రధాన కారణం ఆస్ట్రేలియా జట్టు ప్రఖ్యాతమైన బాక్సింగ్ డే టెస్ట్ లో ఓడిపోవడమే.
బాక్సింగ్ డే టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు మీద ఇంగ్లాండ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మెల్బోర్న్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ యాజమాన్యానికి దాదాపు 60.22కోట్ల నష్టం వాటిల్లింది. ఈ మ్యాచ్ ను వీక్షించడానికి తొలిరోజు రికార్డు స్థాయిలో 94, 199 మంది ప్రేక్షకులు వచ్చారు. రెండవ రోజు 92, 045 మంది ప్రేక్షకులు వచ్చారు. మూడో రోజు కూడా 90 వేలకు మందికి పైగా ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారు. అయితే ఈ పిచ్ పై బౌలర్లు రెచ్చిపోవడంతో పెళ్లిరోజు 20 వికెట్లు నేల కూలాయి. రెండో రోజు కూడా 16 వికెట్లు పడిపోయాయి. కేవలం ఆరు సెషన్లలోనే ఫలితం వచ్చేసింది.
పెర్త్ టెస్టు రెండు రోజులనే ముగిసింది. మెల్బోర్న్ టెస్ట్ కూడా రెండు రోజుల్లోనే ముగియడంతో క్రికెట్ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆస్ట్రేలియా గడ్డమీద కాకుండా ప్రపంచంలో ఇంకా ఎక్కడైనా ఒక మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిస్తే చర్చ ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఇంగ్లాండ్ సారధి స్టోక్స్ ఆగ్రహ వ్యక్తం చేసాడు. దీనిపై మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో చర్చ సాగిస్తున్నారు. ఈ వేదిక మీద పది మిల్లీమీటర్ల కంటే ఎక్కువ గడ్డిని ఎందుకు పెంచారని మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మైదానంలో మ్యాచ్ ఐదు రోజులపాటు సాగలేదని మండిపడుతున్నారు. అయితే ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూసుకుంటామని ఈ మైదానంలో క్యూరేటర్ గా పనిచేస్తున్న మాథ్యూ పేజ్ వెల్లడించాడు.