Andhra Pradesh weather G ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారింది. మేఘావృత్తమై చల్లటి గాలులు వీస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. అయితే ఈరోజు పిడుగులతో కూడిన వాన పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. వాతావరణంలో అకస్మాత్తుగా సంభవిస్తున్న ఈ మార్పుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల యంత్రాంగాలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తేమశాతం పెరిగి ఉష్ణోగ్రతలు తగ్గాయి. కొన్నిచోట్ల భారీగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రకు ఈరోజు భారీ వర్ష సూచన ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన కూడా జారీచేసింది ప్రత్యేకంగా..
* ఈ జిల్లాల్లో వర్షాలు..
ఈరోజు ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం,, మార్కాపురం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. పొలాల్లో పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద కానీ.. ఒంటరిగా ఉండే విద్యుత్ స్తంభాల కింద కానీ ఆశ్రయం పొందకూడదని సూచించింది.
* ఉష్ణోగ్రతలు తగ్గుముఖం..
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడ్డాయి. తేమ శాతం పెరగడం కారణం. ఈ ఏడాది వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమ ప్రాంతం వేడితో ఉడికిపోయింది. దాదాపు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. రుతుపవనాలు కూడా ఆలస్యంగా ప్రవేశించాయి. జూన్ రెండో వారంలోకి ప్రవేశించిన తర్వాత వర్షాలు పడ్డాయి. అయితే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈ నెల చివర్లో ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం విదర్భతో పాటు దక్షిణ చత్తీస్గడ్ మీదుగా ఏపీ కోస్తా వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈరోజు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
