AP police special leave : ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని పోలీస్ సిబ్బంది నుంచి అధికారుల వరకు ఓ రెండు రోజులపాటు ప్రత్యేక సెలవులు ఇవ్వాలని బిజెపి ఆదేశాలు జారీ చేశారు. ఈ సెలవులు అమలులో జాప్యం వద్దని కూడా సూచించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా పోలీస్ శాఖలో సెలవులు ఉండవు.. ప్రత్యేక పండుగ దినాలు ఉండవు.. ఏ సమయంలోనైనా డ్యూటీ చేయాల్సిన అనివార్య పరిస్థితి పోలీస్ సిబ్బందిది. ఇప్పటికే వారికి వారాంతపు సెలవులు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. కానీ అది అమలుకు నోచుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ఓ రెండు ప్రత్యేక దినాల్లో మాత్రం వారికి సెలవులు ఇవ్వాల్సిందేనని సాక్షాత్ రాష్ట్ర డిజిపి ఆదేశాలు ఇవ్వడం విశేషం.
* ఇతర ఉద్యోగులు మాదిరిగా సెలవులు ఉండవు..
పేరుకే పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులు కానీ.. మిగతా ఉద్యోగుల మాదిరిగా వారికి సెలవులు ఉండవు. తమ కోర్కెలను తీర్చుకునేందుకు.. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు యూనియన్లు కూడా ఉండవు. అర్ధరాత్రి అయినా.. అపరాత్రి అయినా శాంతి భద్రతల దృష్ట్యా డ్యూటీ కి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆయా కుటుంబాల్లో మాత్రం అసంతృప్తి ఉంది. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది వారి పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ముఖ్యమైన రోజుల్లో ప్రత్యేక సెలవులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీచేసింది. కానిస్టేబుల్ స్థాయి నుంచి అన్ని ర్యాంకుల పోలీసులకు ఈ సెలవులు వర్తింపజేయాలని కూడా పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలకు, ఇతర పోలీసు విభాగాలుకు ఈ ఉత్తర్వులు అమలు చేయాలని డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. ఏదైనా అత్యవసరం అయితే తప్ప.. పోలీస్ సిబ్బంది కోరినప్పుడు ఈ సెలవులను తప్పనిసరిగా మంజూరు చేయాలని అధికారులను డిజిపి కార్యాలయం ఆదేశించింది. ఈ సెలవులు విషయంలో ఎలాంటి జాప్యం ఉండకూడదు అని.. తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని సూచించారు. నిజంగా ఇది పోలీస్ కుటుంబాలకు గుడ్ న్యూస్.
* పెన్షనర్లకు వెసులుబాటు..
మరోవైపు పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ విషయంలో సైతం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెన్షన్ ప్రతిపాదనలను ఫిజికల్ గా ఈ నెల 30 వరకు ప్రాసెస్ చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మే 1 నుంచి మాత్రం రిటైర్డ్ ఉద్యోగులు తప్పనిసరిగా నిధి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలని సూచించారు. మరోవైపు పుట్టినరోజు, పెళ్లిరోజు నాడు ప్రత్యేక సెలవులు మంజూరు నిర్ణయం పై రాష్ట్ర పోలీస్ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. పోలీస్ కుటుంబాలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
