https://oktelugu.com/

TRAI: మొబైల్‌ యూజర్లకు అలర్ట్.. ట్రాయ్ హెచ్చరిక

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం ఆపరేటర్లు తమ సిమ్ కార్డ్ వినియోగదారుల డేటాను భద్రపరచడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తోంది.

Written By:
  • Rocky
  • , Updated On : November 10, 2024 / 09:22 PM IST

    TRAI

    Follow us on

    TRAI: దేశంలో సైబర్ మోసాల కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త టెక్నిక్ లను అవలంభిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ మోసాలను అరికట్టేందుకు అనేక కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తూ వాటి నుంచి బయటపడేందుకు నిరంతరం ప్రయత్నిస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం ఆపరేటర్లు తమ సిమ్ కార్డ్ వినియోగదారుల డేటాను భద్రపరచడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో టెలికాం కంపెనీల కస్టమర్లు మోసగాళ్ల నుండి తప్పించుకోవడం సులభం కానుంది. నవంబర్ 1 నుంచి సిమ్ కార్డులకు సంబంధించిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఫేక్ కాల్స్, మెసేజ్‌ల నివారణకు నిబంధనలు మార్చిన ప్రభుత్వం.. ఫేక్ కాల్స్ నియంత్రించాలని టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలను సైతం జారీ చేసింది. సైబర్ కేటుగాళ్లు ఫేక్ కాల్స్, మెసేజ్ ల ద్వారా ప్రజలను మోసం చేసి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఫోన్‌కి వచ్చే కాల్స్, మెసేజ్‌లను టెలికాం ఆపరేటర్లు ముందే స్క్రీనింగ్ చేస్తారు. ఈ నంబర్లలోని కొన్ని కీలకపదాలను గుర్తించడం ద్వారా, ఆ సందేశాలు, కాల్‌లు వెంటనే బ్లాక్ చేయబడతాయి. సిమ్ కార్డ్ వినియోగదారులు ఫిర్యాదు చేసినా ఆ మెసేజులు, కాల్ నంబర్లు బ్లాక్ చేయబడతాయి. మోసాన్ని నిరోధించడంలో ఈ దశలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

    అంతే కాకుండా మొబైల్ యూజర్లకు ట్రాయ్ మరో హెచ్చరికను కూడా జారీ చేసింది. ప్రస్తుతం పెద్ద సమస్యగా తయారైన సైబర్ క్రైమ్స్ విషయంలో మొబైల్ యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా’ (TRAI) హెచ్చిరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు బాధితులను మోసం చేయడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ నిలిపేస్తామని బెదిరిస్తారు. బాధితుడు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ పేర్కొంటారు. దీంతో కొందరు అమాయకులు కొందరు భయపడి నేరగాళ్లు చెప్పినట్లు వింటారు, భారీగా డబ్బు ముట్టజెప్పుతుంటారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్).. షేర్ చేసిన ఒక వీడియోలో ఇలాంటి స్కామ్‌కు సంబంధించిన సంఘటనను చూడవచ్చు. ప్రతి ఒక్క మొబైల్ యూజర్ తెలియని నంబర్స్ నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని.. సంచార్ సాథీ పోర్టల్‌ని ఉపయోగించి ఏవైనా అనుమానాస్పద కాల్‌లను నివేదించాలని ట్రాయ్ పేర్కొంది.

    2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిజిటల్ అరెస్ట్ స్కామ్ కారణంగా బాధితులు సుమారు రూ. 120.3 కోట్లు నష్టపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 27న మన్ కీ బాత్ 115వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని మోదీ ఈ సమాచారాన్ని ప్రజలతో పంచుకున్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) 2024 మొదటి మూడు నెలల్లో దాదాపు 7.4 లక్షల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు అందుకున్నట్లు ప్రకటించింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు లేదా సైబర్ నేరగాళ్లు బాధితులకు ఫోన్ చేసి డ్రగ్స్ కు సంబంధించిన నేరంలో మీ ప్రమేయం ఉందని భయపెడతారు. టెక్నాలజీను ఉపయోగించి వీడియో కాల్స్ ద్వారా నకిలీ కోర్టులను, న్యాయమూర్తులను ఏర్పాటు చేస్తున్నారు. అరెస్టు లేదా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండాలంటే డబ్బు చెల్లించాలని.. భారీ మొత్తంలో దండుకుంటున్నారు. కాబట్టి ఇలా మోసం చేసేవారు మీకు ఎప్పుడైనా ఫోన్ చేసి బెదిరిస్తే.. తప్పకుండా సమీపంలోని పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సంచార్ సాథీ పోర్టల్‌ని సందర్శించాలని ట్రాయ్ పేర్కొంది.