Viral Video : తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలానికి చెందిన ఓ మహిళ 20 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. చిన్నప్పుడు వెళ్లిపోయిన ఆమె ఇప్పుడు అఘోరి అవతారంలో హైదరాబాద్‌లో దసరా పండుగ తర్వాత ప్రత్యక్షమైంది. స్థానిక ఆలయాల సమీపంలో పుర్రెల బొమ్మలతో ఉన్న ఓ కారు కనిపిస్తుండడంతో అందరూ ఆసక్తిగా చూశారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల ప్రతినిధులు దానినిఫాలో చేశారు. ఈ క్రమంలో అందులో మహిళా అఘోరి పర్యటిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అఘోరితో మాట్లాడారు. ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఎలా మారారు.. ఎందుకు మారారు.. ఎలాంటి ఆహారం తీసుకుంటారు. ఐఫోన్ వాడడం, కారు నడపడం ఏంటి అని ఇలా అనేక సమాచారం రాబట్టారు. అయితే అఘోరి కొన్ని సందర్భాల్లో హల్‌చల్ చేయడంతో పోలీసులు పట్టుకుని అక్కడి నుంచి పంపిచి వేస్తున్నారు. కార్తిక పౌర్ణమి రోజు శ్రీశైలంలో ఈ మహిళా అఘోరి హల్‌చల్ చేసింది. నవంబర్ 18న హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై హల్‌చల్ చేసింది. తనను ఫొటోలు, వీడియోలు తీయడానికి వచ్చిన స్థానికులపై త్రిశూలంతో దాడిచేసేందుకు యత్నించింది. దీంతో పోలీసులు కష్టంగా అమెను అక్కడి నుంచి పంపించివేశారు.
వరంగల్‌లో న్యూసెన్స్..
సాధారణంగా అఘోరీలు ఎక్కువగా జనాల్లో కనిపించరు. ఈ మహిళా అఘోరి మాత్రం నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తోంది. న్యూసెన్స్ చేస్తోంది. కుంభ మేళాలు.. పుష్కరాల సమయంలో మాత్రమే అఘోరాలు కనిపిస్తారు. తర్వాత మిమాలయాల్లోనే ఎక్కువగా గడుపుతారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన అఘోరి మాత్రం తాంత్రిక పూజలతో జనాలను భయపెడుతోంది. రోడ్లపై ఆమె చేష్టలకు పోలీసులకు చికాకు తెప్పిస్తున్నాయి. రెండు రోజుల క్రితం గుంటూరు వెళ్లిన అఘోరి.. మళ్లీ తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ప్రత్యక్షమైంది.
శ్మశానంలో పూజలు..
సినిమాల్లో తరహాలో అఘోరి వరంగల్ జిల్లాలోని ఓ శ్మశానంలో మంగళవారం(నవంబర్ 19న) రాత్రి పూజలు చేసింది. శవాన్ని కాల్చిన బూడిదలో కూర్చుని చుట్టూ త్రిశూలాలు నాటుకుని.. పూజలు చేయడాన్ని చూసి స్థానికులు ఆందోళన చెందారు. మొదట పద్మాక్షి ఆలయం మీదుగా వరంగల్ శివారులోని బెస్తన్ చెరువు సమీపంలోని శ్మశాన వాటికకు చేరుకుంది. మొదట శవాన్ని కాల్చే ప్రదేశంలో కాసేపు పడుకుంది. శవాన్ని దహనం చేసిన బూడిదను తన ఒంటికి రాసుకుని హంగామా చేసింది. అంతటితో ఆగకుండా హర్రర్ సినిమాలో తరహాలో తాంత్రిక పూజలు చేసింది. తన వెంట తెచ్చుకున్న కోడిని బలి ఇచ్చి రక్త తర్పణం చేసింది. గుమ్మడికాయ కోసి గంటకుపైగా పూజలు చేసింది.
ఆందోళనలో స్థానికులు..
శ్మశానంలో అఘోరి చేసిన పూజలను చూసిన స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అసలు అక్కడ ఎందుకు పూజలు చేసింది.. ఏం జరగబోతుంది అని చర్చించుకుంటున్నారు. ఇక పూజల సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను పంపించారు.