Lady Aghori : అఘోరీ మాత.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయస్థాయిలో సైతం మార్మోగిపోతోంది ఈ పేరు. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ ఒక్కసారిగా సోషల్ మీడియాతో ఫేమస్ అయిపోయింది. ముందుగా తెలంగాణ ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల కనిపించింది అఘోరీ మాత. ఆ సమయంలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. గత కొద్దిరోజులుగా ఏపీలో హల్చల్ చేస్తున్నారు. సాధారణంగా అఘోరీ అంటే ఎలాంటి హంగులు ఉండవు. కానీ ఈ అఘోరి మాత కారులో రావడం, ఐఫోన్ వాడుతుండడంతో ఆమె వ్యవహారం మరింత హాట్ టాపిక్ అవుతోంది. నిన్ననే శ్రీకాళహస్తిలో హల్చల్ చేశారు. దిగంబరిగా దర్శనం చేసుకునేందుకు ఆలయంలోకి వెళ్తుండగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆత్మార్పణ చేసుకుంటానని హెచ్చరిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. అక్కడున్న వారు వద్దని వారించడంతో కాషాయ దుస్తుల్లో దేవుడిని దర్శనం చేసుకున్నారు. అయితే శ్రీకాళహస్తి నుంచి కారులో వెళ్తుండగాభారీ ప్రమాదానికి గురయ్యారు. కారుకు లైట్లులేకపోవడంతో డివైడర్ను ఢీ కొట్టినట్లు సమాచారం. ప్రమాదంలో కారు ఎడమ భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది.
* ఆత్మార్పణ చేసుకుంటానని హెచ్చరిక
తెలంగాణలోని ముత్యాలమ్మ గుడి వద్ద ఆత్మార్పణ చేసుకుంటానని ఈ నెల ఒకటిన ప్రకటించారు అఘోరీ మాత. దీంతో అక్కడి పోలీసులు స్పందించారు. మంచిర్యాలలోని ఆమె నివాసానికి తీసుకువెళ్లి గృహనిర్బంధం చేశారు. అటు తరువాత ఆత్మార్పణ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళతానని చెప్పడంతో పోలీసులు మహారాష్ట్ర వైపుకు తీసుకువెళ్లి వదిలిపెట్టారు. కానీ ఆ మరుసటి రోజు ఏపీలో ప్రత్యక్షమయ్యారు అఘోరీ మాత. కార్తీక మాసం కావడంతో ఏపీలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ సెలబ్రిటీగా మారారు.
* పోలీసుల తీరుతోనే అంటున్న బాధితురాలు
శ్రీకాళహస్తిలో ఆత్మార్పణకు ప్రయత్నించారు అఘోరీ మాత. ఈ క్రమంలో పోలీసులు స్పందించారు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అఘోరీ మాత కారులో బయలుదేరారు. ఆందోళనతో ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. కేవలం పోలీసుల తప్పిదం వల్లే తన కారుకు ప్రమాదం జరిగినట్లు అఘోరీ మాత చెబుతున్నారు. మొత్తానికైతే అఘోరీ మాతకు భారీ ప్రమాదం తప్పిందని మీడియాలో పతాక స్థాయిలో ప్రచారం సాగుతోంది.