https://oktelugu.com/

Liver Diseases : కాలేయానికి కొవ్వు పట్టింది.. నిజమే మద్యం తాగడం పెరిగిపోయింది.. పనిచేయడమూ తగ్గిపోయింది..

"సరిగ్గా ఒక దశాబ్దంన్నర లేదా అంతకు వెనక్కి వెళితే.. ఫోన్ల వినియోగం ఈ స్థాయిలో లేదు. మద్యం తాగడం ఇంత పెరిగిపోలేదు. అందువల్లే ఫ్యాటీ లివర్ కేసులో ఈ స్థాయిలో నమోదు కాలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే మాకే భయం కలుగుతోంది".. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రఖ్యాత ఆసుపత్రి లో పనిచేస్తున్న వైద్యుడు చెప్పిన మాటలు ఇవి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 10, 2024 / 01:52 PM IST

    Fatty Liver

    Follow us on

    Liver Diseases :  ఆ వైద్యుడు గ్యాస్ట్రో నిపుణుడు. అతడి ఆసుపత్రి మియాపూర్ ప్రాంతంలో ఉంటుంది. గతంలో ఆయన వద్దకు రోజుకు 20 నుంచి 30 వరకు పేషెంట్లు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ సంఖ్య 150 దాటిపోతుంది. ఉదయం 9 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి పొద్దుపోయేదాకా ఆయనకు పేషంట్లను చూడడంతోనే సరిపోతుంది. అయితే ఇందులో 30 నుంచి 60 వరకు ఫ్యాటీ లివర్ కేసులు వస్తున్నాయట. ఈ ప్రకారం చూసుకుంటే హైదరాబాదులో ఎన్ని కేసులు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమస్యపై ఆంధ్రజ్యోతి ఈరోజు ఒక విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది. అభినందనలు. కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా దేశంలో 30 నుంచి 40 కోట్ల మంది ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. మద్యం తాగడం పెరిగిపోవడం, శారీరక శ్రమ లేకపోవడం.. వంటివి ఫ్యాటీ లివర్ కు కారణం అవుతున్నాయట. దీనికి తోడు పి.ఎన్.పి.ఎల్.ఎ -3 జన్యువు వల్ల ఫ్యాటీ లివర్ కేసులు పెరిగిపోతున్నాయని వైద్యులు అంటున్నారు. వచ్చే రెండు మూడు సంవత్సరాలలో ఇదే ప్రధాన జబ్బు అవుతుందని వారు వివరిస్తున్నారు.

    ఎందుకిలా

    సాధారణంగా మన దేహంలో ఏ అవయవం పనిచేయకపోయినా దాని ప్రభావం వెంటనే బయటపడుతుంది. కానీ లివర్ అలా కాదు. అది ఎంతటి వ్యాధినైనా తట్టుకుంటుంది. లివర్ లోకి విపరీతంగా కొవ్వు చేరితే.. తప్ప అది పనిచేయడం మారదు. అయితే అది అనేక అవయవాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత మరణం సంభవిస్తుంది. ఫ్యాటీ లివర్ ఇబ్బంది పెట్టడానికి ప్రధాన కారణం మద్యం అధికంగా తాగడం, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారడం. ఫ్యాటీ లివర్ అనేక దశలను దాటి చివరికి లివర్ సిర్రోసిస్ కు దారితీస్తోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మద్యం తాగే వారు పెరిగిపోవడంతో.. ఆల్కహాల్ సంబంధిత లివర్ సమస్యల కేసులు పెరిగిపోతున్నాయి. అన్ని ఆసుపత్రులలో 50 శాతం కేసులు ఇవే ఉంటున్నాయి. చాలామంది ఫ్యాటీ లివర్ ను తేలిగ్గా తీసుకుంటున్నారు. అయితే చివరికి దాని గురించి పట్టించుకునే లోగానే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. బాగా లావు ఉన్నవారు, మధుమేహం వంటి రోగాలు ఉన్న వారిలో 90% ఫ్యాటీ లివర్ ఉంటున్నది. ఇది క్రమంగా లివర్ సిర్రోసిస్ కు దారితీస్తోందని వైద్యులు చెబుతున్నారు. మద్యం అలవాటును మానుకోవడం, శారీరక వ్యాయామం చేయడం, సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం వల్లే ఈ సమస్య రాకుండా చూడవచ్చని వైద్యులు చెబుతున్నారు.