KCR Politics: ‘‘అమ్మకు అన్న పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట..’’ కొన్నాళ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిస్థితి చూస్తే అచ్చం ఇలాగే ఉందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. కేవలం బీజేపీ ఓటమి ఒక్కటే తన లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికోసం ఎందాకైనా పోతానన్నట్లు ప్రవర్తిస్తున్నారు. దీనికి సభలు పెట్టి ప్రజల అభిప్రాయం కోరడం విస్మయం కలిగిస్తోంది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రైతులకు ఇంకా పూర్తి నమ్మకం కలుగలేదు.. మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారు. శనగ పంటకు మద్దతు ధర ఇచ్చే దిక్కు లేదు.. ఉద్యోగులకు వేతనాలు.. రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, వివిధ కుల వృత్తుల వారికి నెలాఖరు వరకు పింఛన్లు చెల్లించడం లేదు. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. డబుల్ బెడ్రూం ఇళ్లు.. స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల హామీ… దళితులందరికీ దళితబంధు అందడం లేదు.. వీటన్నింటినీ గాలికి వదిలేసిన కేసీఆర్ కేవలం కేంద్రంలో నరేంద్రమోదీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి బీజేపీ ఓటమే లక్ష్యంగా దేశంలోని వివిధ పార్టీల నాయకులతో మంత్రాంగం సాగిస్తున్నారు.
-మళ్లీ దూకుడు.. బీజేపీనే టార్గెట్..
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేశారు. మోదీ సర్కార్ వ్యవసాయరంగాన్ని, రైతులను మోసపుచ్చుతోందని ఆరోపించిన టీఆర్ఎస్ అధినేత.. రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగనున్న మహాసంఘటనంలో తన వంతు పాత్రపోషిస్తానని ఇటీవల ప్రకటించారు. ఇందులో భాగంగా మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. 10 రోజులపాటు అక్కడే ఉండనున్నట్లు తెలిసింది. ఈసారి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేసీఆర్.. ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖీరీకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన రైతులను కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిశ్‌మిశ్రా కారుతో తొక్కించి చంపిన ఘటనకు కేంద్రమైన లఖీపూర్ ఖేరీని సందర్శించి, బాధిత రైతు కుటుంబాలను కేసీఆర్ కలవనున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి యూపీ ఎన్నికల సమయంలోనే కేసీఆర్ అక్కడికి వెళ్లాలని భావించినా, చివరి నిమిషంలో ఆగిపోయారు.
-మానుతున్న గాయాన్ని రేపేందుకే..
రైతులు, జర్నలిస్టు, బీజేపీ కార్యకర్తలు అంతా కలిపి 8 మంది మృతి చెందిన లఖీంపూర్ ఖేరీ హింసాకాండ దేశంలో ప్రకంపనలు సృష్టించడం, కేంద్రంలో, ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర నిరసనలు పెల్లుబికిన తర్వాత ప్రధాని మోదీ స్వయంగా రైతులకు క్షమాపణలు చెప్పారు. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులపై హింసాకాండ ప్రభావం ఇంతైనా కనిపించలేదు. రాష్ట్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడంతోపాటు లఖీంపూర్ ఖీరీలోనూ ఆ పార్టీ అభ్యర్థే విజయం సాధించారు. లఖీంపూర్ ఘటనకు ప్రాధాన్యం తగ్గుతోందనుకునేలోపే మానుతున్న గాయాన్నే మళ్లీ రేపాలని కేసీఆర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. మళ్లీ దానిని హైలైట్ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.. లఖీంపూర్ ఖేరీ జిల్లాకు వెళ్లి బాధిత రైతు కుటుంబాలను పరామర్శించనున్నట్లు తెలిసింది. నేడో రేపో కేసీఆర్ ఢిల్లీ టూర్ తేదీలపై స్పష్టత వచ్చే అవకాశముంది.
-ఇటీవల 8 రోజులు ఢిల్లీలోనే..
ఏప్రిల్ 3న ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ 8 రోజులపాటు అక్కడే ఉండి, 11న జరిగిన టీఆర్ఎస్ రైతు దీక్షలో పాల్గొన్నారు. కాగా, గత ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఎక్కువ సమయం వ్యక్తిగతానికే కేటాయించారు. పంటి నొప్పితో బాధపడుతూ అక్కడి ఆస్పత్రిలో చూపించుకున్నారు. ఈసారి మాత్రం పూర్తిగా రాజకీయ కార్యకలాపాలకే పరిమితం కాబోతున్నట్లు తెలుస్తోంది. వరి పోరులో భాగంగా ఢిల్లీలో దీక్ష చేసి వచ్చిన తర్వాత తెలంగాణలో యాసంగి సీజన్ లో పండిన ధాన్యం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం ప్రకటించడం తెలిసిందే.
-పలువురితో మంతనాలు..
ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్ పలువురు ఆర్థికవేత్తలు, రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యే అవకాశముంది. దేశ రైతాంగం కోసం ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చరల్ పాలసీ అవసరమంటూ ఇటీవల ప్రగతి భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అభిప్రాయపడ్డ కేసీఆర్ దీనిని సాధించేందుకు తన సర్వశక్తులను ధారపోసి ప్రయత్నం చేస్తానన్నారు. అన్ని రాష్ట్రాల రైతు ప్రతినిధులను, ఢిల్లీలో ఉద్యమం నిర్వహించిన రైతు సంఘాల నాయకులను హైదరాబాద్‌కు పిలిపించి వర్క్‌షాప్ పెట్టి, ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీని డిక్లేర్ చేస్తామనీ వెల్లడించారు. అందులో భాగంగానే ఢిల్లీలో పలువురితో భేటీ అవుతారని తెలుస్తోంది. వారితో మంతనాలు జరిపి, కేంద్ర వ్యతిరేక పోరాటంపై ప్రణాళికను రచించుకుంటారని సమాచారం. తాజా ఢిల్లీ పర్యటనలో జాతీయ కూటమి అంశంపైనా కేసీఆర్ ఫోకస్ చేయనున్నారు.
-స్వరాష్ట్రంలో ఎవరినీ పరామర్శించిన సీఎం..
తెలంగాణ రాష్ట్రంలో ఎంతపెద్ద ఘటన జరిగినా.. ఎవరు అన్యాయానికి గురైనా.. అఘాయిత్యానికి గురైనా.. సీఎం కేసీఆర్ గడిచిన ఎనిమిదేళ్లలో ఏనాడూ పరామర్శించలేదు. కొండగుట్ట బస్సు ప్రమాదంలో 102 మంది మృత్యువాత పడ్డారు. దేశంలోనే అతిపెద్ద బస్సు ప్రమాదంగా గుర్తించారు. అయినా కేసీఆర్ బాధిత కుటుబాలను పరామర్శించలేదు. తెలంగాణలో 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు మృతిచెందారని జాతీయ క్రైం బ్యూరో నివేదిక ఇచ్చింది. అయినా ఒక్క రైతు కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించిన దాఖలాలు లేవు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరిగినా ఎలాంటి ఓదార్పు ఇవ్వలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో నిరుద్యోగులు కేసీఆర్ పేరుతో లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ఒక్క కుటుంబానికి భరోసా ఇవ్వలేదు. కానీ ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాకు వెళ్లి అక్కడ కేంద్రమంత్రి తనయుడు తన వాహనంతో ఢీకొట్టడంతో చనిపోయిన వారి పరామర్శకు వెళ్లనుండడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Kcr does not care about telangana focus on national politics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com