https://oktelugu.com/

IT Employees: ఐటీ ఉద్యోగులకు ఎందుకు అంత త్వరగా పెళ్లిళ్ళు కావడం లేదు?

అతడు రోడ్లు భవనాల శాఖలో ఏఈగా పనిచేస్తున్నాడు. ఆ యువతి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువకుడు భర్తగా రావాలని ఆ యువతి అతడిని పెళ్లి చేసుకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 31, 2024 / 11:13 AM IST

    IT Employees

    Follow us on

    IT Employees: గుంటూరుకు చెందిన ఓ యువకుడు ఐటీ ఉద్యోగిగా ఓ బహుళ జాతి సంస్థలో పనిచేస్తున్నాడు. నెలకు రెండు లక్షల పైగానే వేతనం సంపాదిస్తున్నాడు. వయసు 30 ఏళ్లకు రావడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఓ మ్యారేజ్ బ్యూరో సంప్రదించాడు. ఇటీవల ఒక సంబంధం వచ్చింది. అన్ని విషయాలు దాదాపు ఓకే అయ్యాయి. అయితే ఆ యువకుడికి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోవడంతో అమ్మాయి వారు వద్దని చెప్పారు.

    ఆ యువతి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. తనకు తగ్గట్టుగానే డాక్టర్ సంబంధం కావాలని కోరుకుంది. కుమార్తె కోరికను కాదనలేక ఆమె తండ్రి అలాంటి సంబంధాన్ని చూశాడు. ఆ యువకుడు ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేశాడు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఇద్దరికీ ఈడు జోడు కుదిరింది. ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. తీరా అబ్బాయి తరఫున తండ్రి గొంతెమ్మ కోరికలు కోరాడు. మా కుమారుడి కోసం ఒక నర్సింగ్ హోమ్ కట్టిస్తారా అంటూ అమ్మాయి తండ్రిని అడిగాడు. దీంతో ఆ సంబంధం క్యాన్సిల్ అయింది.

    అతడు రోడ్లు భవనాల శాఖలో ఏఈగా పనిచేస్తున్నాడు. ఆ యువతి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువకుడు భర్తగా రావాలని ఆ యువతి అతడిని పెళ్లి చేసుకుంది. అయితే అతడికి నగరాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాలకు బదిలీ అవుతోంది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. చినికు చినికి గాలివానలాగా మారింది. దీంతో ఆ యువతి తన భర్తకు విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది.

    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదంతాలు.. ఉన్నత చదువులు, సామాజికపరంగా ఏర్పడిన మార్పులు, ఆర్థిక స్థిరత్వం, హోదా వంటివి పెళ్లిళ్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. కట్న కానుకలు, కులాలు, అందం, ఎత్తు, విద్యార్హత, వేతనం వంటి విషయాలు పెళ్లిళ్ళ జాప్యానికి కారణమవుతున్నాయి.

    తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా యువత ఐటీ సంబంధిత చదువులు చదువుతోంది. అలాంటి చదువులు చదివిన వారిని తమ జీవిత భాగస్వాములుగా కోరుకుంటున్నది. ఓ సర్వే ప్రకారం తెలుగు రాష్ట్రాలలో ఐటీ సంబంధిత చదువులు చదివి, ఉద్యోగాలు చేస్తున్న వారిలో 5 లక్షల మంది పురుషులు ఉండగా.. మూడు లక్షల పైచిలుకు మంది స్త్రీలు ఉన్నారు. అయితే వీరిలో చాలామందికి భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన ఉండటం, ఏ విషయంలోనూ రాజీ పడకపోవడం, ఆర్థిక స్థిరత్వం వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని కోరుకోవడం, వంటి కారణాలతో చాలామంది పెళ్ళికి దూరంగా ఉంటున్నారు. కొంతమందికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పెళ్లి కావడం లేదు. 30 దాటిన తర్వాతే చాలామంది పెళ్ళికి మొగ్గు చూపుతుండడంతో నానాటికి జటిలంగా మారుతున్నది. నగరాలలో ఇలా ఉంటే.. గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి మరో విధంగా ఉంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో తక్కువ వయసులోనే పెళ్లిళ్లు జరిగేవి. కానీ ఇప్పుడు చదువు, కెరియర్, ఉద్యోగం వంటి వాటికి యువత అమితమైన ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో.. ఈ ప్రాంతాలలోనూ పెళ్లిళ్లలో జాప్యం ఏర్పడుతోంది.

    ఇక కొంతమంది అమ్మాయిలు పెళ్లికి ముందే అన్ని హంగులు కోరుకుంటున్నారు. చేసుకోబోయే భర్త భారీగా సంపాదించాలని ఆశిస్తున్నారు. అటువంటి సంబంధాలు వచ్చినప్పటికీ ఎత్తు, రంగు, వయసు, ఆస్తిపాస్తుల విషయంలోనూ రాజీ పడడం లేదు. “గుంటూరుకు చెందిన ఓ యువతి ఆమె తల్లిదండ్రులు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అయితే ఆమె బీటెక్ పూర్తి చేసింది. తనకు కాబోయే భర్త ఎంటెక్ చేసి ఉండాలని.. నెలకు రెండు లక్షల సంపాదించాలని కండిషన్ పెట్టింది. అలాంటి సంబంధం ఒకటి వచ్చినప్పటికీ కలర్ విషయంలో ఆమెకు నచ్చకపోవడంతో సంబంధం క్యాన్సల్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో
    ఉదంతాలున్నాయి. ఈ తరం పిల్లల్లో ఎవరూ రాజీపడటం లేదు. అలాంటప్పుడు పెళ్లిళ్లు ఎలా జరుగుతాయని” పేరు రాయడానికి ఇష్టపడని ఓ మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడు తెలిపారు.

    ఆలస్యంగా పెళ్లిళ్లు జరగడంతో.. అది చాలా విషయాల మీద ప్రభావం చూపిస్తుంది. పెళ్లిళ్లు ఆలస్యంగా జరగడం వల్ల.. పిల్లలు లేటు వయసులో పుడతారు. కొంతమంది మహిళలకు అవకాశం కూడా ఉండడం లేదు. అలాంటప్పుడు అది దేశ జనాభా మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. జనాభాలో వ్యత్యాసాలు ఏర్పడితే అంతిమంగా ఆ దేశం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

    Tags