Telangana DSC : తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం 11,062 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 4వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది. నేటితో ఆ గడువు ముగిసింది. అయితే దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. జూలై 17 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది.
-టెట్ కోసం గడువు పెంపు..
తొలుత ప్రకటించిన నోటిఫి కేషన్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 2తో ముగిసింది. అయితే ఇటీవల విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అర్హత సాధించిన వారు కూడా డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించేందుకు డీఎస్సీ దరఖాస్తు గడువును కూడా పొడిగింది. జూన్ 3 నాటికి టెట్ పరీక్ష పూర్తి కానుంది.
కొత్తగా 3 లక్షల మందికి ఛాన్స్..
ప్రభుత‍్వం టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంతో కొత్తగా 3 లక్షల మంది డీఎస్సీ రాసేందుకు అవకాశం దక్కుతుందని అధికారులు తెలిపారు. డీఎస్సీ రాయాలంటే టెట్ అర్హత తప్పనిసరి ఈ నేపథ్యంతో కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారు కూడా డీఎస్సీకి అర్హత సాధించేందుకు టెట్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. టెట్‌లో వచ్చి మార్కుల్లో 20 శాతం డీఎస్సీకి వెయిటేజీ ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు టెట్ నిర్వహించకపోవడంతో దరఖాస్తు చేసుకునే అర్హత కోల్పోతామని డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు చేసిన విజ్ఞప్తి మేరకు టెట్ ప్రకటన విడుదలైంది.