Reporter Extortion Case: ఆయన ఓ పత్రికాధిపతి. పూర్వాశ్రమంలో ఆయన పాత్రికేయుడు కూడా. పత్రిక ద్వారా భారీగానే సంపాదించాడు. ఆ సంపాదనతోనే ఒక ఛానల్ కూడా పెట్టాడు. డిజిటల్ మీడియాలోకి కూడా అడుగు పెట్టాడు. తెలుగు రాష్ట్రాలలో ప్రధాన మీడియా కేంద్రాన్ని నడుపుతున్నాడు. ఆయన నడుపుతున్న మీడియా కేంద్రాలలో దాదాపు 1500 మంది దాకా పనిచేస్తున్నారు. పరోక్షంగా అంతకంటే ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు.. ఈయన నడుపుతున్న మీడియా సంస్థలలో పత్రికకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ పత్రికలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది ఇటీవల వసూళ్లకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది..
ఆ పత్రికాధిపతి సొంత జిల్లాలో ఎడిషన్ ఇన్ ఛార్జ్, బ్యూరో చీఫ్ వసూళ్లకు పాల్పడినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఓ విలేఖరి నుంచి డబ్బులు దండుకున్నట్టు సమాచారం అందింది. దీనికి సంబంధించి పక్కా ఆధారాలు లభించాయి. డబ్బులు తీసుకున్నప్పటికీ.. ఆ విలేఖరికి న్యాయం చేయడంలో బ్యూరో చీఫ్, ఎడిషన్ ఇన్ ఛార్జ్ నిర్లక్ష్యం వహించారు. దీంతో అతడు కడుపు మండి ఓ సెల్ఫీ వీడియో తీశాడు. అందులో తనను డబ్బుల కోసం వేధిస్తున్న వారి పేర్లను వెల్లడించాడు. ఈ వీడియో కాస్త ఆ పత్రికకు వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థలకు చేరిపోయింది. దీంతో ఆ మీడియా సంస్థలు ఆ రిపోర్టర్ సెల్ఫీ వీడియోను ప్రముఖంగా ప్రసారం చేశారు. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఇది ఆ పత్రికాధిపతికి కోపం తెప్పించింది. అంతేకాదు దీని వెనక ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆ పత్రికలో ఉన్న పెద్ద తలకాయలను ఆదేశించారు. వారు ఇన్ సైడ్ ఎంక్వయిరీ చేశారు.
Also Read: అతనికి 79.. ఆమెకు 75.. వీరిద్దరు చేసిన పని పెను సంచలనం
ఇన్సైడ్ ఎంక్వయిరీ లో బ్యూరో చీఫ్, ఎడిషన్ ఇన్చార్జి అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడినట్లు తెలిసింది. దీంతో మరో మాటకు తావు లేకుండా ఎడిషన్ ఇంచార్జి ని బదిలీ చేశారు. బ్యూరో చీఫ్ ను కూడా బదిలీ చేశారు. ఓ జిల్లాకు స్టాఫ్ రిపోర్టర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తిపై విచారణ కొనసాగిస్తున్నారు. అంతేకాదు ఆ ఎడిషన్ ఇన్చార్జి స్థానంలో కొత్త వ్యక్తిని పంపిస్తున్నారు. బ్యూరో స్థానంలో ఆ పత్రికలో టౌన్ రిపోర్టర్ గా పనిచేస్తున్న వ్యక్తిని నియమించడానికి కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా పత్రికాధిపతి జిల్లా కావడంతో చర్చ మొదలైంది.. రిపోర్టర్ దగ్గరనుంచి బ్యూరో చీఫ్, ఎడిషన్ ఇన్చార్జి డబ్బులు వసూలు చేసిన వ్యవహారం కలకలం రేపింది. వాస్తవానికి ఇటీవల ఆ పత్రిక అధిపతి జిల్లాలలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత వేతనాల పెంపు చేపట్టారు. అయితే ప్రస్తుత కాలంలో ఆ వేతనాలు సిబ్బందికి సరిపోవడం లేదు. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఆ పత్రికలో సిబ్బందికి పని ఒత్తిడి కూడా విపరీతంగా పెరిగిపోయింది. అటు మేనేజ్మెంట్ కరుణ చూపించలేకపోవడంతో సిబ్బంది ఇలాంటి చేయి తడుపుతున్న వ్యవహారాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.
డబ్బు వసూలు చేసిన సిబ్బందిపై వేటు సమంజసమే ఆయనప్పటికీ.. నేటి ఖర్చులకు తగ్గట్టుగా వేతనాలు ఇవ్వకపోవడం ముమ్మాటికి ఆ మేనేజ్మెంట్ చేస్తున్న తప్పు. పైగా సంవత్సరాలకు సంవత్సరాలు చాకిరీ చేయించుకుని ఉద్యోగులకు అంతంతమాత్రంగా వేతనాలు ఇవ్వడం ఆ పత్రిక అధిపతికి చెల్లింది. పైగా ఆయన నీతులు చెబుతారు. గొప్ప గొప్ప సూక్తులు వల్లిస్తుంటారు. ఆయన పత్రికలో మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి యాడ్స్ టారిఫ్ సవరిస్తుంటారు. సర్కులేషన్ తో సంబంధం లేకుండా ప్రకటనలు తీసుకురావాలని సిబ్బందిపై ఒత్తిడి తీసుకొస్తుంటారు. మేనేజ్మెంట్ తీసుకొస్తున్న ఒత్తిడి వల్ల సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ.. వేతనాలు సక్రమంగా అమలు చేయడంలో ఆ యాజమాన్యం దారుణంగా విఫలమవుతోంది. అలాంటప్పుడు ఇలాంటి ఘటనలు జరగడంలో తప్పులేదు కదా.. సిబ్బందిని విలువలతో బతకాలని చెప్పే ఆ మేనేజ్మెంట్.. ఆ విలువలను వారి విషయంలో పాటించకపోవడం గమనించాల్సిన విషయం.