CUET UG 2024: ఎంబీబీఎస్ నుంచి జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ దాకా జాతీయస్థాయిలో అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంది. పరీక్షలను ఆ సంస్థ పకడ్బందీగా నిర్వహిస్తుంది. దరఖాస్తు ఫారంలో ఏమాత్రం తప్పు దొర్లినా అభ్యర్థులకు పరీక్ష రాసే అవకాశం ఉండదు కాబట్టి.. దరఖాస్తు ఫారంలో మార్పులు, చేర్పులు, తప్పుల సవరణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అవకాశం కల్పించింది. దీని ప్రకారం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్- అండర్ గ్రాడ్యుయేట్ 2024 అప్లికేషన్ లో తప్పులు ఏమైనా దొర్లితే.. వాటిని అభ్యర్థులు సవరించుకోవచ్చు. దీనికి సంబంధించి ఏప్రిల్ 7 రాత్రి 11 గంటల 50 నిమిషాల వరకు అభ్యర్థులకు అవకాశం ఉంది. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు దొర్లితే.. వాటిలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు NTA CUET UG అధికారిక వెబ్ సైట్ cuetug.nta online.in లో లాగ్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయి exams.nta.ac.in ను ఓపెన్ చేయాలి.. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్, సెక్యూరిటీ పిన్ నమోదు చేయాలి. అలా నమోదు చేసిన తర్వాత దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన అనంతరం అందులో ఏమైనా తప్పులు, లేదా ఇతర వివరాలను నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. మార్పులు, చేర్పులు పూర్తయిన తర్వాత submit బటన్ క్లిక్ చేయాలి. అనంతరం ఆ పేజీని పీడీఎఫ్ లేదా జేపీఈజీ ఫార్మాట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షలు ఎప్పుడంటే..
CUET UG 2024 పరీక్షలను మే 16 నుంచి మే 31 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డు మే రెండవ వారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షను హైబ్రిడ్ మోడ్ లో నిర్వహిస్తున్నారు. అంటే విద్యార్థులు పెన్ పేపర్ లేదా ఆన్లైన్ విధానాల్లో రాసుకునే వెసులుబాటు ఉంది. ఈ పరీక్షను ఉర్దూ, హిందీ, తమిళం, పంజాబీ, మరాఠీ, గుజరాతి, బెంగాలీ, అస్సామీ, ఇతర ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు..CUET UG 2024 కి సంబంధించిన సిలబస్, ఇతర ప్రామాణిక సమాచారం కోసం https:// exams.nta.ac.in/CUET-UG/ లో సంప్రదించాలి. సైట్లో పేర్కొన్న సిలబస్ మాత్రమే పరీక్షల్లో ఇస్తారు.. అంతేతప్ప సిలబస్ లో లేని ప్రశ్నలను ఎట్టి పరిస్థితుల్లో పరీక్షల్లో అడగరు.. సైట్ లో ఉన్న సిలబస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బాధ్యుల ద్వారా రూపొందింది. అందువల్లే దానిని అభ్యర్థులు ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రశ్నల స్థాయి, జవాబులు, సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు.. అన్నింటిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందులో పొందుపరిచింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2017 నవంబర్లో ఏర్పాటయింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏజెన్సీకి మొదటి డైరెక్టర్ గా వినీత్ జోషిని నియమించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE mains, advanced) – మెయిన్స్, అడ్వాన్స్డ్, నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్, అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG- MBBS, BDS, BAMS), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ – నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC- NEET), కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (UGC – NET) వంటి పోటీ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఇది మాత్రమే కాకుండా గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GPAT), కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET), ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఎంట్రన్స్ టెస్ట్ (AIAPGET) వంటి పోటీ పరీక్షలను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షలలో జవాబుదారీతనాన్ని పెంచడం కోసం 2017లో కేంద్రం ఈ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ సంస్థకు డైరెక్టర్ జనరల్ గా సుబోధ్ కుమార్ సింగ్ వ్యవహరిస్తున్నారు.