జనసేన పార్టీకి జవసత్వాలు నిండాయి. పరిషత్ ఎన్నికలు ప్రాణం పోశాయి. పార్టీ పరువు పోతుందని భావిస్తున్న తరుణంలో పార్టీని గట్టెక్కించే పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జరిగిన పరిషత్ ఎన్నికల్లో పార్టీ పట్టు నిలుపుకుంది. పోటీ చేసిన 1200 స్థానాల్లో 177 చోట్ల విజయం సాధించి తన ఉనికి చాటుకుంది. ఇన్నాళ్లు విజయాలు లేక బోసిపోయిన పార్టీకి ఇప్పుడు ఓ ఆధారం దొరకినట్లయింది. దీంతో అధినేత పవన్ కల్యాణ్ జనసేన ఇక ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పడం గమనార్హం.

పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీకి 25.2 శాతం ఓట్లు పోలైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పార్టీ ఇంత శాతం ఓట్లు సాధించడం పార్టీ నేతలకు సంతోషం కలిగిస్తోంది. ఇకపై ప్రజల పక్షాన నిలిచి పోరాడతామని పవన్ ప్రకటించారు. దీంతో ఆయనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోందని తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలైన పవన్ కల్యాణ్ భవిష్యత్ పై కంగారు పడ్డారు కానీ ప్రస్తుతం అందివచ్చిన విజయంతో ఆయనలో ధైర్యం పెరిగింది. ఇకపై ఒంటరిగానైనా ఎదురొడ్డి నిలవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిషత్ ఎన్నికలు ఆయనలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లు తెలుస్తోంది.
ఈనెల 27,28 తేదీల్లో విజయవాడలో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో కూడా సంబంధాలు తెంచుకుంటారేమోననే సందేహాలు వస్తున్నాయి. మరోవైపు టీడీపీతో పొత్తు పెట్టుకుంటారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా పరిషత్ ఎన్నికలు జనసేన పార్టీకి కొండంత ధైర్యం నింపిందనే చెప్పాలి.