
అధికారంలోకి వచ్చే వరకూ ఒక మాట.. అధికారంలోకి వచ్చాక ఇంకో మాట.. రాజకీయాల్లో ఇలాంటి ఎన్నో సందర్భాల్లో చూసుంటాం. ఇంకా చూస్తూనే ఉన్నాం కూడా. గ్రామ వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకూ ఇదే ధోరణి కనిపిస్తుంటుంది. అధికారంలోకి రావడానికి అమలు సాధ్యం కాని హామీలను సైతం ఇస్తుంటారు. అమాయక ప్రజలు వాటిని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తుంటారు. తదుపరి మోసపోతుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ కూడా అదే చేస్తున్నట్లుగా అర్థమవుతోంది.
తాము అధికారంలోకి వస్తే రైతులకు సున్నా వడ్డీ పథకం అమలు చేస్తామని జగన్ ఎంతో ఆర్భాటంగా ప్రకటించేశారు. ఈ స్కీమ్ ఆల్‌రెడీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాం నుంచే అమలవుతున్నా.. జగన్ ఎంతో కొంత పెంచుతారని అందరూ ఆశపడ్డారు. కానీ.. రైతుల ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో లక్ష రూపాయల వరకు ఈ పథకాన్ని అమలు చేయగా.. చంద్రబాబు దానిని రూ.మూడు లక్షలకు పెంచారు. ఇక జగన్ ఇప్పుడు ఆ మూడు లక్షలను కూడా కొనసాగించలేకపోతున్నారు.
మాటిమాటికి తమది రైతు ప్రభుత్వమని చెప్పుకునే జగన్.. రైతులకు మాత్రం పెద్ద గుండు సున్నా పెట్టినట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. సున్నా వడ్డీ రుణాలంటూ అందరినీ మోసం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. లిమిట్‌ను పెంచకుండా.. కనీసం అమలవుతున్న దానినీ అమలు చేయలేకపోతున్నారని దుయ్యబడుతున్నారు.
మరోవైపు.. జగన్ సర్కార్ రైతులకు సున్నా వడ్డీ పథకం కింద తాజాగా రూ.128 కోట్లను విడుదల చేశారు. వీటిని దాదాపు ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. సగటున ఒక్కో రైతుకు దక్కేది ఎంతంటే కేవలం రూ.2 వేలు మాత్రమే. అదికూడా లక్షలోపు రుణాలు తీసుకొని ఏడాదిలోపు చెల్లించిన రైతులకే ఇది వర్తించనుంది. ఇలా ఈ పైసలు కూడా ఇవ్వడానికి జగన్ రకరకాల నిబంధనలు పెడుతున్నారు. ఏడాదిలోపు లక్ష రుణాలు చెల్లించడం ఏ రైతుకు అయినా సాధ్యమయ్యే పనేనా..? అనే ప్రశ్నలే వస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఈ సున్నా వడ్డీ రుణాలను అమలు చేయడం ఎందుకని రైతులు బాహాటంగానే అంటున్నారు. జగన్ లెక్కల ప్రకారం.. ఏ రైతుకు కూడా ఈ వడ్డీ రుణం కింద లాభం దక్కింది లేదు.
తమది పూర్తి రైతు ప్రభుత్వం అని చెప్పుకునే జగన్.. మూడు లక్షల వరకూ ఈ పథకాన్ని కొనసాగిస్తారని రైతులు అనుకున్నారు. కానీ.. ఇప్పుడు జగన్ కూడా లక్షకే పరిమితం చేయడం వారిలో అసంతృప్తి కనిపిస్తోంది. ఈ సున్నా వడ్డీ రుణాలకు ఏడాదికి రూ.2 వేల కోట్లకుపైగా అవుతాయని జగనే స్వయంగా అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కానీ.. నిధుల విడుదలలో మాత్రం జాప్యం చేస్తున్నారు. వంద కోట్లకు అటు ఇటుగా అన్నట్లు ఇస్తున్నారు. జగన్ సర్కార్ సున్నా వడ్డీ పేరుతో మాయ చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.