Roja Kabaddi: వైసీపీ ఎమ్మెల్యే రోజా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఇక బుల్లితెరపై నవ్వుల బ్రాండ్. జబర్ధస్త్ సహా పలు షోలు చేస్తూ ఇటు ప్రేక్షకులను, అటు రాజకీయవాదులను మెప్పిస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రోజాకు మంత్రి పదవి ఖాయం అనుకున్నారంతా.. ఏకంగా రోజాకు జగన్ హోంమంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది.

కానీ సామాజిక సమీకరణాల్లో రెడ్డి అయిన రోజా కు మంత్రి పదవి దక్కలేదు. రెండో దఫా కూడా ఆమెకు మంత్రిగా చాన్స్ వస్తుందో లేదో తెలియదు. అయితే ప్రస్తుతం రోజా మాత్రం తన సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటూ ఖాళీ సమయంలో తన నియోజకవర్గంలో ప్రజలతో గడుపుతోంది.
ఫైర్ బ్రాండ్ అయిన రోజా ఏం చేసినా వినూత్నంగానే ఉంటుంది. తాజాగా ఆమె తన భర్త సెల్వమణితో కలిసి కబడ్డీ కోర్టులోకి దిగి కూతకూసి హడలుకొట్టారు. ప్రతిపక్ష పార్టీల నేతలను తన మాటలతో చెడుగుడు ఆడేసే రోజా.. తాజాగా కబడ్డీ కోర్టులోనూ అంతే దూకుడుగా అడుగుపెట్టారు. కబడ్డ కబడ్డీ అంటూ ఆటగాళ్లకు సవాల్ విసిరారు. అంతేకాదు భర్త సెల్వమణికి పోటీకి ఆడారు.

రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరి నియోజకవర్గం గ్రామీణ క్రీడా సంబురాలు నిర్వహించారు. సోమవారం నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఈ క్రీడా పోటీలను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి ఎమ్మెల్యే రోజా, ఆమె భర్త సెల్వమణి కబడ్డీ ఆడారు. కూతకు వచ్చిన రోజా తన భర్తకు పాములా పగడవిప్పి చూపించడం చూపరులను ఆకర్షించింది. అనంతరం భర్త సెల్వమణి రోజాను ఔట్ చేయడానికి వచ్చి శతవిధాలా ప్రయత్నించారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
