Chittoor District Bandh: దొంగే దొంగ అన్నట్టుంది వైసిపి వ్యవహార శైలి. చిత్తూరు జిల్లా బంద్ కు ఆ పార్టీ పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. సహజంగా అధికారంలో ఉన్న పార్టీ ఇలా బంద్ లకు పిలుపునివ్వడం ప్రత్యేక సందర్భాల్లోనే సాధ్యం. కానీ పుంగనూరు ఘటనకు నిరసిస్తూ వైసిపి బంద్ కు పిలుపునివ్వడం విస్మయ పరుస్తోంది. సాధారణంగా పుంగనూరు అంటేనే ఒక ప్రత్యేక రాజ్యంగా భావిస్తారు. అటువంటి చోట విపక్షాలు దౌర్జన్యానికి దిగడం అసాధారణం. కానీ టిడిపి నేతలు అరాచకాలు సృష్టించారంటూ ఏకంగా చిత్తూరు జిల్లా బంద్ కి పిలుపునివ్వడం అసలు, సిసలు రాజకీయాన్ని తెలియజేస్తోంది.
పుంగనూరులో వైసీపీ శ్రేణులకు మైండ్ బ్లాక్ అయింది. ఇన్నాళ్ళు తాము ఏది చేసినా తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు టిడిపి శ్రేణులు ప్రతిఘటించేసరికి తత్వం బోధపడింది. తాము ఏదో ఒక సీరియస్ యాక్షన్ ప్లాన్ తీసుకోకుంటే.. పుంగనూరులో చులకన అయిపోతామని భావించి.. ఏకంగా చిత్తూరు జిల్లా బంద్ కు వైసీపీ నేతలు పిలుపునిచ్చారు.
సీఎం జగన్ కంటే.. పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు పైన అందరి ఫోకస్ ఉంది. పులివెందుల కంటే పుంగనూరే పవర్ ఫుల్ అని అందరూ భావిస్తున్నారు. పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారి ఇంటి పై అల్లరి మూకలను పంపి దాడి చేయించడం ఆయన నైజం. చివరికి ఏ పార్టీలో లేని రామచంద్రయాదవ్ లాంటి నేత నియోజకవర్గం లో తిరిగినా తట్టుకోలేకపోయారు. అందుకే ఆయన ఏకంగా సొంత పార్టీని పెట్టి పెద్దిరెడ్డితో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. అటు ఎప్పుడు పెద్దిరెడ్డి అనుచరుల చేతిలో దాడులకు, కేసులకు గురవుతున్న టిడిపి శ్రేణుల్లో కూడా ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఏకంగా తిరుగుబాటే చేశారు. చంద్రబాబు కూడా తరమమని సిగ్నల్ ఇవ్వడంతో పెద్దిరెడ్డి అనుచరులు తోక ముడిచారు. పుంగనూరులో పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నామన్న స్పృహను మరిచి మరి చిత్తూరు జిల్లా బంద్ నకు పిలుపునిస్తున్నారు. అయితే సహజంగా అధికారంలో ఉన్నారు కాబట్టి.. వారే పిలుపునిచ్చారు కాబట్టి.. బంద్ సక్సెస్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఒక్క లాజిక్ మిస్ అవుతున్నారు. అధికారం దూరమవుతుందన్న భయంతోనే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. అది అంతిమంగా పెద్దిరెడ్డికే నష్టం చేకూర్తుంది. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.