Vangaveeti Radha: ఏపీలో రాజ్యాధికారాన్ని శాసించేలా ఉన్న కాపుల మద్దతు కోసం ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ వేయని కుప్పిగంతులు లేవు. ఈక్రమంలోనే కాపుల్లో బలమైన నాయకులుగా ఉన్న వారిని రంగంలోకి దించి చేస్తున్న రాజకీయం హీట్ పుట్టిస్తోంది. తాజాగా వంగవీటి రాధా వ్యవహారం రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టింది.
విజయవాడ రాజకీయాల్లో రాణించలేకపోతున్నా.. కుల సమీకరణాల్లో కీలకంగా వంగవీటి రాధా ఉన్నారు. ఆయనను తమ వైపుకు తిప్పుకునేందుకు పార్టీలు గత దశాబ్ధకాలంగా చేయని ప్రయత్నాలు లేవు. తాజాగా టీడీపీలో ఉన్న రాధాను వైసీపీలోకి తెచ్చే ప్రయత్నాలు చర్చనీయాంశమవుతున్నాయి. తనపై రెక్కీ చేశారని ఆరోపించిన రాధాను మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమైనట్టు తెలిసింది.
కృష్ణా జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గం జనాభా ప్రభావం చూపగల స్థాయిలో ఉంది. విజయవాడ తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లోనూ కాపుల ఓట్లు కీలకంగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొనే తన పాతమిత్రుడైన రాధాను వైసీపీలోకి తీసుకు వచ్చేందుకు కొడాలి నాని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే తన నియోజకవర్గంలో వంగవీటి రంగా విగ్రహం ఏర్పాటు చేసి దాని ఆవిష్కరణకు రాధాను కొడాలి నాని ఆహ్వానించారు. రాధా వెళ్లి ఆ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం షాక్ ఇచ్చాడు. టీడీపీ, కాపు నేతలతో భేటి అయ్యి.. తర్వాత చంద్రబాబుతోనూ మీటింగ్ లో పాల్గొన్నారు. దీంతో తాను వైసీపీలోకి వెళ్లేది లేదని చాటిచెప్పారు.
చంద్రబాబుతో వంగవీటి రాధా భేటి తర్వాత వైసీపీ కూడా స్టాండ్ మార్చేసింది. రాధాపై ఎదురుదాడికి దిగింది. రాధాపై రెక్కి నిర్వహించింది అవాస్తవమని.. ఆయన తండ్రిని చంపిన పార్టీలో రాధా ఎలా కొనసాగుారని మంత్రి వెల్లంపల్లి తీవ్ర విమర్శలు చేశారు. రాధా ఇంటి ఎదుట కారు తిరిగితే అది రెక్కీనా అని నిలదీశారు.
రాధాను వైసీపీలో తీసుకురావాలని ప్రయత్నించినా అది విఫలం కావడంతో ఇక రాధాను వదిలేది లేదని వైసీపీ ఎదురుదాడికి దిగినట్టు తెలుస్తోంది. రెక్కీ నిజమైతే పోలీసులకు రాధా ఎందుకు ఫిర్యాదు చేయలేదని.. ఇదంతా సానుభూతి డ్రామా? అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాధాపై ఒక్కరొక్కరుగా నేతలు బయటకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారు.