Anantapur: ఏపీలో పోలీసుల తీరు మరి వివాదాస్పదమవుతోంది. తమ ఆత్మ అభిమానాన్ని, గౌరవాన్ని పోలీసులు వైసీపీ నేతల కాళ్ళ కింద పెడుతున్నారు. పదోన్నతులు, బదిలీల కోసం రాజీ పడుతున్నారు. మరింత దిగజారి వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్ వద్దో.. సకల శాఖ మంత్రి సజ్జల వద్దో రాజీ పడితే పర్వాలేదు. కానీ ఓ చిన్న కార్పొరేటర్, వార్డు వాలంటీర్ల ముందు కూడా సాగిలాపడుతున్నారు. చివరికి మహిళా కానిస్టేబుల్ పై అనుచితంగా ప్రవర్తించినా బెయిలబుల్ కేసులు పెట్టి విడిచి పెడుతున్నారు.
అనంతపురం జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బందిపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఏకంగా స్టేషన్కు వెళ్లి ఎస్సై పై చేయి చేసుకున్నారు. మహిళా కానిస్టేబుల్ పై అనుచితంగా ప్రవర్తించారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇక్కడ ఎమ్మెల్యే అనుచరులు దొంగ మద్యం వ్యాపారం చేస్తుంటారు. వీరిలో ఒకరు గుజ్జల సురేష్. సురేష్ అక్రమంగా మద్యం విక్రయిస్తుండడంతో సెబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా ఆయన నుంచి 96 మద్యం బాటిళ్ల ను స్వాధీనం చేసుకున్నారు.ఇక అంతే వైసీపీ నేతలు బుధవారం రాత్రి సెబ్ పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. 32 వ డివిజన్ కార్పొరేటర్ సాకే చంద్రశేఖర్, మరో కార్పొరేటర్ కమల్ భూషణ్, సుమారు పాతిక మందితో కలిసి గుల్జర్పేట లోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు.
కార్పొరేటర్ చంద్రశేఖర్ అయితే ఏకంగా ఎస్సై కుర్చీలో కూర్చున్నారు. ప్రశ్నించిన మహిళా కానిస్టేబుల్ పై దాడి చేశారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఎస్ఐ మునిస్వామి పై వైసీపీ వర్గీయులు చేయి చేసుకున్నారు. ఆయనను కిందకు తోసేశారు. నిందితుడు సురేష్ తండ్రి అయితే మహిళా కానిస్టేబుల్ డ్రెస్ నే లాగేశారు. ఆమె తలపై బలమైన గాయం తగలగా.. హెడ్ కానిస్టేబుల్ శేఖర్ పై సైతం దాడి చేశారు.
అయితే ఈ ఘటన సీరియస్ అవుతుందని అంతా భావించారు. కానీ ఉన్నతాధికారులు కేసును నీరు గార్చారు. బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీసు వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. తప్పుడు కేసులతో పలుచనవుతున్న పోలీస్ శాఖ.. చివరకు తమపై దాడులు చేస్తున్నా ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది. రక్షక భటులే.. బాధితులుగా మిగులుతుండడం ఏపీలో పరిస్థితికి అద్దం పడుతోంది.