ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పల్లె ప్రజలు పూర్తిస్థాయిలో వైసీపీకి పట్టం కట్టారు. తాము జగన్ వెంటనే నడుస్తామని గ్రామాలు తీర్మానించాయి! రాష్ట్రంలో జరిగిన మూడు దశల ఎన్నికలను పరిశీలిస్తే.. ఈ విషయం స్పష్టమవుతోంది. దీనికి కారణమేంటీ..? రాష్ట్రం మొత్తం జగన్ మోహన్ రెడ్డికి ఎందుకు అండగా నిలిచింది? అనే విశ్లేషణలు జరుగుతున్నాయి. అదే సమయంలో తాము ఎక్కడ లోపాలు చేశామని టీడీపీ నేతలు పోస్టు మార్టం చేసుకుంటున్నారు.
వైసీపీ ప్రభంజనం..
ఎన్నో పరిణామాల తర్వాత రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిపితీరాల్సిందేనని పట్టుబట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్.. తాను అనుకున్నది సాధించారు. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలకు ప్లాన్ చేయగా.. ఇప్పటి వరకు మూడు దశల్లో పోలింగ్ ముగిసింది. ఈ మూడు దశలలో మొత్తం 9,798 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో అధికార పార్టీ ఏకంగా 7,720 స్థానాలను గెలుచుకుంది. ఎవరూ ఊహించిన ఈ ప్రభంజనంతో జనం జగన్ వెంటనే ఉన్నారనే విషయం మరోసారి నిరూపితమైందని అంటున్నారు వైసీపీ నేతలు.
ప్రధాన కారణం వాళ్లే!
వైసీపీ సాధించిన ఈ విషయంలో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ, టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాన పాత్ర ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా తొలినాళ్లలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైంది ప్రభుత్వం. కానీ.. కరోనా విజృంభిస్తోందని చెప్పిన ఎస్ఈసీ నిమ్మగడ్డ ససేమిరా అన్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్నికల నిర్వహణ కుదరదన్నారు. ప్రజల ఆరోగ్యం ఫణంగా పెట్టలేమన్నారు.
నిర్వహించాల్సిందేనని పట్టు..
ముందుగా కరోనా పేరు చెప్పి ఎన్నికలు అవసరం లేదన్న నిమ్మగడ్డ.. ఆ తర్వాత కరోనా తగ్గిపోయిందని ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. కరోనా ఇంకా తగ్గలేదని, వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగాల్సి ఉందని, ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేమని చెప్పింది సర్కారు. అయినా సరే.. నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారు నిమ్మగడ్డ. ఈ క్రమంలో ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు మధ్య లేఖల వార్ కొనసాగింది. చివరకు ఈ పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో.. సుప్రీం ఆదేశాల ప్రకారం ఎన్నికల ప్రక్రియ మొదలైంది. సీన్ కట్ చేస్తే.. మూడు దశల్లో వైసీపీ విజయ దుందుభి మోగించింది.
టీడీపీ కుట్రగా నమ్మారా?
ప్రజలు ఈ స్థాయిలో జగన్ వెంట ఎందుకు నిలిచారు? అనే ప్రశ్నకు ఒక బలమైన సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ టీడీపీకి సన్నిహితుడని, ఆయనను ఉపయోగించుకోవడం ద్వారా జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బాబు ప్రయత్నించాడనే ప్రచారం విస్తృతంగా సాగించారు వైసీపీ నేతలు. ఈ విషయాన్ని ప్రజలు విశ్వసించారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబు ప్రోద్బలంతోనే పట్టుబట్టి ఎన్నికలు నిర్వహించారని వైసీపీ మంత్రులు, నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రజలు నమ్మారని, అందుకే పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి ఫలితం వచ్చిందని అంటున్నారు.
అందరికీ దక్కిన సంక్షేమం..
ఇక, మరో కారణం.. పల్లెల్లో ప్రతీ ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని అంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ పార్టీ నేతలకే ముందుగా ఫలితాలు అందేవమని, అది కూడా అంతంత మాత్రమే అన్న విమర్శ ఉంది. కానీ.. జగన్ హయాంలో విప్లవాత్మకమైన పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా.. పార్టీలకు అతీతంగా క్షేత్రస్థాయిలో అందరికీ అందాయని, ఆ ఫలితమే ఈ ఎన్నికల రిజల్ట్ కు కారణమని అంటున్నారు. ఈ విధంగా ఈ రెండు బలమైన కారణాలతో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెపలాడిందంటున్నా విశ్లేషకులు.