
YSRCP Vs Jana Sena: ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల విధానాలు, వైఫల్యాలపై పోరాటం ఒక ఎత్తైతే.. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. గత ఎన్నికలకు ముందు వైసీపీ కొత్తకొత్త స్లోగన్స్ తోనే ప్రజల్లోకి వెళ్లింది. అప్పటి చంద్రబాబు సర్కారుపై వ్యతిరేకతను పెంచడంలోనూ.. జగన్ కు అనుకూలంగా మార్చడంలో స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ సరికొత్త నినాదాలను తెరపైకి తెచ్చారు. వైసీపీ నవరత్నాలపై భారీగా ప్రచారం కల్పించారు. పన్నులు, చార్జీల విషయానికి వచ్చేసరికి అప్పటి విపక్ష నేత నోటి నుంచి వచ్చే మాట ‘బాదుడే బాదుడు’, అలాగే రావాలి జగన్ అన్న లిరిక్ కూడా బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపించేసరికి అటువంటి నినాదాలతో ముందుకెళ్లాలని వైసీపీ యోచిస్తోంది. అయితే దీనికి దీటుగా జనసేన కౌంటర్ అటాక్ ఇస్తుండడంతో పునరాలోచనలో పడుతోంది.

వైసీపీ సర్కారుకు వలంటీరు వ్యవస్థ మానస పుత్రిక. ప్రతీ 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించారు. ఈ మధ్యన గృహసారథులంటూ కొంతమందిని నియమించారు. ఆ 50 కుటుంబాల్లో సంక్షేమ పథకాల అమలు బాధ్యతను వారికి అప్పగించారు. ఎన్నికల నాటికి ప్రజలను వైసీపీ వైపు కన్వర్ట్ చేయడమే వారి ప్రధాన విధి. అందులో భాగంగా ప్రతి ఇంటా జగన్ బొమ్మతో కూడిన స్టిక్కర్ ను అతికించడానికి నిర్ణయించారు. వలంటీర్లను ముందుపెట్టి ఇంటి యజమాని అనుమతితో అతికించాలన్నది కాన్సెప్ట్. జగన్ ఫొటోతో ‘మా నమ్మకం నువ్వే జగన్’ అన్న స్టిక్కర్ ను ప్రతి ఇంటా అతికించాలన్న టాస్క్ ను వైసీపీ సర్కారు పెట్టుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎన్నిక ప్రచారం తరహాలో చేపట్టాలని డిసైడ్ అయ్యింది.
అయితే ఈ స్టిక్కర్ అతికించక ముందే జనసేన కౌంటర్ అటాక్ ఇస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అప్పులపుత్ర అంటూ జగన్ కు ట్విట్టర్ వేదికగా కొత్త పేరు పెట్టారు. ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ కు వ్యతిరేకంగా ‘మాకు నమ్మకం లేదు దొర’ అన్న స్టిక్కర్ ను రూపొందించారు జన సైనికులు. దీంతో వైసీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. జన సైనికులు పెడుతున్న ఈ స్టిక్కర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లను ఆకట్టుకున్నాయి. కామెంట్స్ ట్రోల్ అవుతున్నాయి.
ఊహించని ఈ పరిణామంతో వైసీపీ శ్రేణులు జన సైనికులపై మండిపడుతున్నారు. మేం ఏంచేసినా అడ్డంగా వస్తున్నారని రుసరుసలాడుతున్నారు. ఓ సామాన్యుడు దండం పెడుతూ మాకు నమ్మకం లేదు దొర అంటూ ఉన్న చిత్రం అందర్నీ ఆలోచింపజేస్తోంది. ఒక్క ఫొటోతో మొత్తం వైసీపీ పాలననే గుర్తుచ్చేవిధంగా జనసేన సైనికులు స్టిక్కర్ ను రూపొందించడం అందర్నీ ఆకట్టుకుంటోంది. సర్వత్రా ఆసక్తి రేపుతోంది. టీడీపీ కూడా ఎన్నికల నాటికి మరికొన్ని ప్రచారాస్త్రాలు బయటకు తీసేందుకు సిద్ధపడుతుంది. అటు జనసేన, ఇటు టీడీపీ చర్యలతో వైసీపీ బెంబేలెత్తిపోతోంది. గత ఎన్నికల ముందు వైసీపీ చేసినవే ఇప్పుడు ఆ రెండు పార్టీలు చేస్తుండడంతో విలవిల్లాడిపోతోంది.