Graduate MLC Elections: ఏపీలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ గట్టి నిర్ణయంతో ఉన్నారు. 2024 ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో గత మూడేళ్లుగా లేని విధంగా పార్టీ ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 175 సీట్లు సాధించాలన్న కసితో ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఎప్పుడూ లేని విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై జగన్ గురి పెట్టారు. ఇంకా ఎన్నికలకు చాలాకాలం ఉన్నా అభ్యర్థలను ప్రకటించారు. సాధారణంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోవు. బయట నుంచే సరైన అభ్యర్థికి మద్దతు ఇస్తుంటాయి. కానీ జగన్ ఎందుకో రాష్ట్రంలో ఖాళీ అవుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు మూడింటిపై దృష్టిపెట్టారు. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల గడువు ఉండగా అభ్యర్థులను ప్రకటించారు. వారిని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలకే అప్పగించారు. ఇటీవల జరిగిన వర్కుషాపులో ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. గ్రాడ్యుయేట్స్ ఓట్ల నమోదు, వారికి మద్దతుగా ప్రచార బాధ్యతలను చూసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది వేసవిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను జగన్ సెమీ ఫైనల్ గా చూస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నారుట. అయితే పార్టీ శ్రేణుల్లో మాత్రం ఈ ఎన్నికలపై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీపై ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఎన్నికల బాధ్యతలు తమకు అప్పగించడం ఏమిటని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. పైగా నియోజకవర్గాల వారీగా గ్రాడ్యుయేట్స్ జాబితా పెట్టి వారిని ఓటర్లుగా చేర్పించి.. వారితో ఓటువేయించే పని శక్తికి మించిన భారంగా పరిగణిస్తున్నారు. అయితే అధినేత జగన్ ఆలోచన మాత్రం వేరేలా ఉంది.
బ్రాహ్మణులకు దరి చేరేందుకు..
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పేరును ప్రకటించారు. అయితే ఈయన బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతను ఆకర్షించవచ్చన్నది జగన్ భావన. పైగా ఉత్తరాంధ్రలో బ్రాహ్మణ ప్రాతినిధ్యం లేదు. దీనికితోడు బీజేపీతో పాటు వామపక్ష పార్టీలు బ్రాహ్మణ అభ్యర్థులను బరిలో దించుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉన్నతాధికారుల్లో బ్రాహ్మణ సామాజికవర్గం వారే అధికం. కానీ ఇప్పటివరకూ బ్రాహ్మణులు టీడీపీ, బీజేపీ వైపే ఉన్నారు. ముందుగా అభ్యర్థిని ప్రకటించి, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా వారిపై ఒత్తిడి పెంచినట్టవుతుంది. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలలు ఉండడంతో వారంతా వైసీపీ టర్న్ తీసుకొని విధంగా కృషి చేయాలని ఉత్తరాంధ్ర కీలక నాయకులు, మంత్రులకు సైతం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే నిరుద్యోగ యువత, ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్న టాక్ అయితే నడుస్తోంది. దీనిని చెక్ చెప్పేందుకు ఇదో మంచి అవకాశంగా జగన్ భావిస్తున్నారు.
Also Read: Harappa and Vedic People History: హరప్పా, వేదకాలం ప్రజలు ఒక్కరేనా? చరిత్రలో దాగిన నిజాలు
అక్కడ విభేదాల దృష్ట్యా…
మరోవైపు సీతంరాజు సుధాకర్ ఎంపిక వెనుక మరో అంశం ఉంది. ఈయన విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. దక్షిణ నియోజకవర్గం సీటును ఆశిస్తున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడంతో స్వతంత్రంగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కానీ ఇంతలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి జంప్ అయ్యారు. ఇది సీతంరాజుకు మింగుడు పడడం లేదు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. దీంతో పలుమార్లు గణేష్ కుమార్ సీతంరాజుపై అధిష్టానానికి ఫిర్యాదుచేశారు. విభేదాలు తారస్థాయికి చేరుకోవడంతో ఒకానొక దశలో గణేష్ కుమార్ తిరిగి టీడీపీ గూటికి చేరుతారని టాక్ నడిచింది. అయితే అధిష్టానం దీనిని చెక్ చెప్పేందుకు సీతంరాజును పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెరపైకి తెచ్చింది. తద్వారా విశాఖ దక్షిణనియోజకవర్గంలో విభేదాలకు పరిష్కార మార్గం చూపినట్టేనని భావిస్తోంది. సహజంగా తనకు లైన్ క్లీయర్ అవుతుందని భావించి లోకల్ ఎమ్మెల్యే గణేష్ కూడా సహకరిస్తారని భావిస్తోంది.
బీజేపీ సిట్టింగ్ స్థానం…
అయితే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ సీనియర్ నాయకుడు మాధవ్ ఉన్నారు. మరోసారి ఆయనే బరిలో దిగే చాన్స్ కనిపిస్తోంది. అటు ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల్లో వైసీపీపై వ్యతిరేకత ఉంది. నిరుద్యోగ యువత సైతం వైసీపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యేక హోదాతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ రాకపోవడంతో ఆగ్రహంగా ఉన్నారు.ఈ నేపథ్యంలో ఎన్నికలకు దిగడం చేతులు కాల్చుకున్నట్టేనని వైసీపీ సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఎన్నికల ముందు రిస్క్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.