
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి (బుధవారం) కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. అందులో ఒకటి ‘వైఎస్సార్ బీమా’ పథకం. దీని ప్రకారం.. కుటుంబ పెద్ద (సంపాదించే వ్యక్తి) చనిపోతే ప్రభుత్వమే నేరుగా పరిహారం అందిస్తుంది. సహజ మరణం పొందినా.. ప్రమాద వశాత్తూ చనిపోయినా.. ఈ పథకానికి అర్హులు అవుతారు.
గతంలో చంద్రబాబు హయాంలో.. ‘చంద్రన్న బీమా’ పేరుతో ఇదే తరహా పథకం ఉండేది. ఇంటి యజమాని చనిపోతే అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5 వేలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం ద్వారా బీమా సొమ్ము అందేది. ఇప్పుడు ఇదే పథకానికి జగన్ పేరు మార్చారని అంటున్నారు. అదే సమయంలో.. ఇన్సూరెన్స్ తో సంబంధం లేకుండా.. ప్రభుత్వమే నేరుగా బాధిత కుటుంబానికి పరిహారం అందిస్తుందని చెబుతున్నారు.
అయితే.. ఈ విషయంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీమాతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా పరిహారం అందిస్తుందనే మాట వినడానికి బాగానే అనిపిస్తున్నా.. ఆచరణలో తేడా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఇన్సూరెన్స్ అయితే.. ప్రీమియం చెల్లిస్తే.. దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. డబ్బులు రావడానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవు. కానీ.. ప్రభుత్వం చెల్లించాల్సి వస్తే మాత్రం చాలా అవరోధాలు ఉంటాయని అంటున్నారు.
ప్రభుత్వం నేరుగా డబ్బులు అందించాలంటే.. ముందు సర్కారు వద్ద ఉండాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఖజానా పరిస్థితి ఏంటన్నది అందరికీ తెలిసిందే. నెల ముగియగానే ఉద్యోగాల జీతాల కోసమే ఏం చేయాలా అని ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలాంటి కండీషన్లో ఈ బీమా పథకం సజావుగా అమలవుతుందా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. పథకం నిర్వహణ ఎలా ఉంటుందో గానీ.. ప్రభుత్వానికి ప్రచారం మాత్రం భేషుగ్గా లభిస్తోందని అంటున్నారు.