
Mareddy Ravindranath Reddy : మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి. ఈ పేరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితం. కొండను ఢీకొట్టడమే అందుకు కారణం. పులివెందుల వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. అటువంటి కోటను ఢీకొట్టి నిలబడగలిగారు బీటెక్ రవి. ఆయన చాలా ఏళ్ల నాటి నుంచి టీడీపీలో ఉన్నా.. గుర్తింపు దక్కింది మాత్రం 2017లోనే. వైఎస్ వివేకానందరెడ్డిపై స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీటెక్ రవి అనూహ్య విజయం దక్కించుకున్నారు. తొలిసారిగా పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురుతిరిగి నాయకుడిగా ఎదిగారు. అందుకే వివేకా హత్య కేసులో ఫస్ట్ గా వినిపించిన పేరు బీటెక్ రవి. ఆది నుంచి ఈయన పాత్రపై అనుమానాలున్నాయి. ఎఫ్ఐఆర్ లో సైతం పేరును పొందుపరిచారు. అయితే ఇదంతా తెర ముందు జరిగిన తతంగం. తెర వెనుక వివేకాతో పాటు ఆయన కుమార్తె, అల్లుడితో బీటెక్ రవికి మంచి సంబంధాలే కొనసాగేవట. ఆ విషయాన్ని బీటెక్ రవే స్వయంగా వెల్లడించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ నిర్వహించే ఓపెన్ హర్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి హాజరైన రవి చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చారు.
వివేకాపై బీటెక్ రవి విజయం..
అది 2017. ఏపీలో చంద్రబాబు సర్కారు అధికారంలో ఉంది. ఆ సమయంలో కడప జిల్లా స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. చంద్రబాబు అభ్యర్థులను వడబోస్తున్నారు. ఆ సమయంలోనే బీటెక్ రవి ప్రస్తావన వచ్చింది. అతడైతే సరైన అభ్యర్థిని అని చంద్రబాబు డిసైడయ్యారు. గెలుపు బాధ్యతలను రాయలసీమ జిల్లా టీడీపీ నేతలకు అప్పగించారు. అయితే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో సంఖ్యాబలంగా ముందంజలో ఉంది. పైగా వివేకానందరెడ్డి అభ్యర్థి కావడంతో అక్కడ గెలుపు అంత ఈజీ కూడా కాదు. అయినా అనూహ్యంగా రవి ఎమ్మెల్సీగా వివేకాపై గెలుపొందారు. సొంత పార్టీ శ్రేణులు వెన్నుపోటు పొడవడం ద్వారానే వివేకా ఓటమి చెందారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఈ అంశాన్ని బేస్ చేసుకొని బీటెక్ రవిని వివేకా హత్య కేసులో ఇరికించాలని చూశారు. నాడు తెర వెనుక సాయమందించి వైసీపీ నేతలతో రవి చేతులు కలిపారని వివేకా హత్య జరిగిన తొలినాళ్లలో ప్రత్యర్థులు ఆరోపణలు చేశారు. అదంతా ఉత్తమాటేనని ఇప్పుడు తేలిపోయింది.

ఎన్నికల తరువాత అనుబంధం..
ఆ ఎన్నికల తరువాత వివేకానందరెడ్డితో మంచి సన్నిహితమే ఉండేదని బీటెక్ రవి చెబుతున్నారు. ఎయిర్ పోర్టులో కానీ, ఇంకెక్కడైనా తారసపడితే వివేకా చాలా ఆప్యాయంగా పలకరించేవారిని రవి గుర్తుచేశారు. తన పక్కన కూర్చున్న వారిని లేపి మరీ తనను కూర్చొనిచ్చే వారని చెబుతున్నారు. కుటుంబ, వ్యక్తిగత యోగక్షేమాలు అడిగే వారన్నారు. నాడు ఎమ్మెల్సీ ఎన్నికల ఎపిసోడ్ ను గుర్తుచేస్తూ మావాళ్లకు ఎవరెవరికీ ఎంతెంత ఇచ్చావో చెప్పాలని కోరేవారని.. అయిపోయినదానికి ఎందుకు అన్న అనేసరికి నవ్వుకునే వారని వివేకాతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేశారు. వివేకా మంచి వ్యక్తి అని.. ఆయన హత్యకేసులో లోతైన విచారణ జరగాలన్నదే తన అభిమతంగా చెప్పుకొచ్చారు.
చంద్రబాబు, టీడీపీ అవసరం అనివార్యం..
టీడీపీ ట్రాప్ లో పడి సునీత వ్యవహరిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆమె టీడీపీ తరుపున పోటీచేస్తారన్న ప్రచారంపై కూడా బీటెక్ రవి స్పందించారు. తనకు సునీతతో అస్సలు సంబంధాలు లేవని చెప్పారు. ఒక్కసారి కూడా ఆమెతో మాట్లాడలేదన్నారు. అయితే ఆమె భర్త రాజశేఖర్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయని చెప్పారు. ఇప్పటికీ మాట్లాడుతుంటామని చెప్పుకొచ్చారు. తన కంటే రాజశేఖర్ రెండేళ్లు సీనియర్ అని చెప్పారు. ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డి పాత్రపై వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సమయంలో బీటెక్ రవి కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాజశేఖర్ రెడ్డిని విచారించిన తరువాత సీబీఐ మరోసారి పులివెందులలో దర్యాప్తు స్టార్ట్ చేసింది. తరచూ మాట్లాడుతుంటానని రవి చెప్పడం ద్వారా రాజశేఖర్ రెడ్డి కి టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేలిపోయింది. అటు సునీత వెనుక సైతం చంద్రబాబు ఉన్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే బలమైన ప్రత్యర్థికి వ్యతిరేకంగా వెళ్లాలంటే రాజకీయ మద్దతు అవసరం కనుక.. సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి టీడీపీ అండ్ కో, చంద్రబాబు సాయం అనివార్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.