YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం జగన్ తనకు రెండు కళ్లు అని పేర్కొన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి లు ఆయన కూతురు వైఎస్ సునీత సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు కోర్టులో ఆమె చేసిన వాదనలు చర్చనీయాంశమయ్యాయి. సునీత గతంలో డీజీపీని కలిశారు. ఆ సమయంలో సీఎం జగన్ తనకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి లు రెండు కళ్లు అని చెప్పినట్లు సునీత 164 స్టేట్ మెంట్లో డీజీపీతో అన్నారు. అయితే దేవిరెడ్డికి వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్ట్ అయ్యి మొదటి బెయిల్ కొట్టివేసిన తరువాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పులేదన్నారు. ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం అంత మంచిది కాదని వైఎస్ వివేకానంద హత్య కేసులో సునీత తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ వివేకానంద హత్య కేసుపై సీరియస్ గా విచారణ సాగుతోంది. తాజాగా ఆయన కుమార్తె వేసిన పిటిషన్ పై సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ కేసులో దేవిరెడ్డి శివశంకర్ కీలకంగా ఉన్నారని, అతనికి బెయిల్ ఇవ్వొద్దని కోరారు. అతనికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. అయితే దేవిరెడ్డి తరుపున న్యాయవాది మాట్లాడుతూ ఆరున్నర నెలలుగా దేవిరెడ్డి జ్యూడిషియల్ కస్టడీలోనే ఉన్నారని, ఈ నేపథ్యంలో అతడు బెయిల్ కు అర్హుడన్నారు. అయితే మరికొన్ని వాదనలు వినేందుకు కోర్టు నేటికి వాయిదా వేసింది. అంటే ఈ కేసుపై నేడు విచారణ సాగనుంది.
ఈ కేసు మొత్తంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కీలకంగా ఉన్నారని సునీత తరుఫున న్యాయవాది అన్నారు. వివేకానంద చనిపోయిన రోజు ఆ సంఘటనను గుండెపోటుగా చిత్రీకరించేందుకు తీవ్రంగా ప్రయత్నించారన్నారు. అలాగే వివేకా మృతదేహానికి పోస్టుమార్టం జరగకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఆ ఏడాది మే 26న బెయిల్ పై బయటకు రావడంతో పాటు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి సాక్షులను ప్రభావితం చేశారని అన్నారు. కొందరు రాజకీయ నాయకులు తనను కలిశారని, ఈ సమయంలో సీబీఐ తనను వేధిస్తుందంటూ ఉదయ్ కుమార్ రెడ్డి కేసు పెట్టారన్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి మంచి మిత్రులని న్యాయవాది వెంకటేశ్వర్లు కోర్టుకు తెలిపారు.
ఈ వాదనలపై దేవిరెడ్డి తరుపున న్యాయవాది స్పందించారు. దేవిరెడ్డికి బెయిల్ పొందేందుకు అర్హుడని తెలిపారు. ఎందుకంటే గత ఆరు నెలలుగా ఆయన జ్యూడిషియల్ కస్టడీలోనే ఉన్నారన్నారు. ఆయనపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో బెయిల్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి దేవిరెడ్డిపై 5 కేసులు పెండింగులో ఉన్నాయన్నారు. అయితే మిగిలిన వారి వాదనలు వినేందుకు కోర్టు నేటికి వాయిదా వేసింది. అయితే నేటి వాదనలతో కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.