Sharmila: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపటి నుంచి మహా ప్రస్థానం పాదయాత్ర చేసేందుకు రెడీ అయ్యారు. అంతకంటే ముందు తన తండ్రి ఆశీస్సులు తీసుకునేందుకు మంగళవారం ఇడుపుల పాయకు వెళుతున్నారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రతో తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామని ప్రజలకు భరోసా కల్పించేందుకు పాదయాత్ర చేపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. తన తండ్రి చేపట్టిన విధంగానే కూతురు కూడా సెంటిమెంట్ గా చేవెళ్లను ఎంచుకోవడం గమనార్హం.

2023లో నిర్వహించే ఎన్నికలే లక్ష్యంగా షర్మిల తన ప్రస్థానం మొదలు పెడుతున్నారు. తెలంగాణల ప్రత్యామ్నాయ శక్తిగా రూపుదిద్దే క్రమంలో ముందుకు కదులుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో పాదయాత్ర రూపకల్పన చేశారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నం చేయనున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఢీకొనేందుకే ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
షర్మిల పాదయాత్రను 400 రోజుల పాటు కొనసాగించేందుకు నిర్ణయించుకున్నారు. 90 నియోజకవర్గాల మీదుగా నాలుగు వేల కిలోమీటర్లు కొనసాగనుంది. ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగిస్తారు. మధ్యాహ్నం భోజనం తరువాత విరామం తీసుకుని మళ్లీ సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
పాదయాత్ర అనంతరం ప్రజల నుంచి వచ్చిన వినతులను గురించి చర్చించి వాటితో ఒక నోటు తయారు చేసుకుని వాటిని అధ్యయనం చేస్తారు. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు షర్మిల ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు సిద్ధమనట్లు సమాచారం.