
YS Sharmila: తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి ముందుకు సాగుతున్న వైఎస్ షర్మిల నిత్యం ఏదోరకంగా వార్తల్లో నిలుస్తున్నారు. రాజకీయంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా షర్మిల జగన్ పై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటికే అన్నకు వ్యతిరేకమని చెబుతూనే వస్తున్న షర్మిల అన్న పార్టీలో సభ్యురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మతో మాత్రం కలిసిమెలిసి ఉంటోంది. నిరుద్యోగుల పక్షాన నిలబడుతామని అంటున్న షర్మిల తాజాగా జగన్ పై , ఆయన సొంత మీడియాపై చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి.
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ‘వైఎస్సార్సీపీ తెలంగాణ’ పార్టీని స్థాపించారు వైఎస్ షర్మిల. అప్పటి నుంచి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే మొదట్లో కొంతమంది షర్మిల పార్టీకి ఆకర్షితులైనా రాను రాను ఆ పార్టీలోకి వెళ్లడానికి ఎవరూ సాహసించడం లేదు. ఇప్పటి వరకు పార్టీలో బలమైన నాయకులు ఒక్కరూ లేకపోవడం గమనార్హం. అయినా షర్మిల నిరుద్యోగుల ఆత్మహత్యలు కలిచివేస్తున్నాయంటూ బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ తెలంగాణలో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు.
తాజాగా షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలను విమర్శిస్తున్న క్రమంలో షర్మిల ‘గతంలో కౌగిలింతలు చేసుకున్న సీఎంలు ఇప్పుడు కూర్చొని ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకోవచ్చుగా అని అన్నారు. సమస్యల పరిష్కారానికి వారు సిద్ధమైతే తెలంగాణ సీఎంకు బిర్యానీ, ఏపీ సీఎంకు రాగి సంకటి పెడుతానన్నారు. ఈ వంటకాలు తాను వండి వారికి పెడతానని ’ సెటైర్ వేశారు.
తెలంగాణ రాజకీయంలో తనకు సహకరించని సొంత మీడియా సాక్షి విషయంలో షర్మిల వ్యతిరేకంగా ఉన్నారు. గతంలో తనకు సంబంధించిన న్యూస్ సాక్షిమీడియా కవర్ చేయడం లేదని..? ఆమె ప్రశ్నించారు. అయతే పక్కనే ఉన్న విజయమ్మ వారించారు. ప్రస్తుతం సాక్షికి ఓనర్ తానేనని షర్మిల అనడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఏపీలో జగన్ ఓనర్ కాగా తెలంగాణలో షర్మిల టేకోవర్ చేస్తుందా..? అన్న చర్చ సాగుతోంది.
ఇక ప్రశాంత్ కిశోర్ సేవలు వైఎస్సార్సీపీటీ కి ఉంటాయని షర్మిల అనడం విశేషం. గత కొంత కాలంగా అనధికారికంగా పీకే టీం షర్మిల పార్టీకి పనిచేస్తోందని ప్రచారం జరగగా.. ఇప్పుడు ఆ విషయంపై షర్మిల క్లారిటీ ఇచ్చారు. గత ఎన్నికల్లో జగన్ పార్టీకి పనిచేసిన పీకే టీం ఇప్పుడు షర్మిల పార్టీకి పనిచేస్తారని అంటున్నారు. మరోవైపు ఇటీవల ఏపీలో జరిగిన కేబినేట్ మీటింగ్లోనూ మరోసారి పార్టీ కోసం పీకే టీం పనిచేస్తుందని జగన్ చెప్పారు. అంటే ఏపీలో జగన్ కోసం, తెలంగాణలో షర్మిల కోసం ప్రశాంత్ కిశోర్ పనిచేయనున్నారని తెలుస్తోంది.
అయితే జగన్ పై వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న షర్మిల.. తన పార్టీ కోసం పీకే టీం పనిచేస్తుందనడంతో ఆసక్తిగా మారింది. దీనికి జగన్ ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదా..? అని చర్చించుకుంటున్నారు. ఓ వైపు షర్మిల తెలంగాణలో వైసీపీటీని బలోపేతం చేస్తామని అంటున్నా.. జగన్ మాత్రం ఆమె పార్టీకి ఏ విధమైన సపోర్టు చేయడం లేదు. అయితే అటు జగన్ కు, ఇటు షర్మిలకు పీకే టీం ఏకకాలంలో పనిచేయడం వల్ల ఎవరి పార్టీ విన్నవుతుందో చూడాలంటున్నారు. మరోవైపు తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమాతో ఉన్న షర్మిల సక్సెస్ అవుతారా..? అని చర్చించుకుంటున్నారు.
వైఎస్ విజయలక్ష్మి విషయంలోనూ షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఇంతకాలం వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతున్న విజయలక్ష్మి తనతోనే ఉంటారని షర్మిల అంటున్నారు. ఇటీవల వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనానికి ఏపీ నుంచి ఎవరూ రాకపోయినా తెలంగాణ నుంచి కొందరు అప్పటి వైఎస్ అనుయాయులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశాన్ని ముందుండి విజయమ్మ నడిపించారు. దీంతో తల్లి విజయమ్మ తనతోనే ఉంటారని క్లారిటీ ఇచ్చారు.