Homeజాతీయ వార్తలుYS Sharmila: తెలంగాణకు కాబోయే సీఎం నేనే.. షర్మిల ఓవర్‌ కాన్ఫిడెన్స్‌!

YS Sharmila: తెలంగాణకు కాబోయే సీఎం నేనే.. షర్మిల ఓవర్‌ కాన్ఫిడెన్స్‌!

YS Sharmila: వైఎస్‌.షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌లో అన్నతో విభేదించి రెండేళ్ల క్రితం తెలంగాణలో అడుగుపెట్టింది. తాను తెలంగాణ బిడ్డను అని.. రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన తీసుకురావడమే లక్ష్యం అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పెట్టారు. మూడే వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. అధికార బీఆర్‌ఎస్‌ లక్ష్యంగా విమర్శలు చేశారు. చివరకు వ్యక్తిగత ధూషణలకు కూడా దిగి.. బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తల దాడులు ఎదుర్కొన్నారు. ఎప్పుడూ మీడియాలో ఉండేందుకు సంచలన ఆరోపణలు, విమర్శలు, కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంత చేసినా ఆపార్టీకి ఎలాంటి మైలేజీ రాలేదు. అయినా షర్మిల మాత్రం దూకుడు తగ్గించడం లేదు. ఇక తాజాగా తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి తానేనని ప్రకటించింది. వైఎస్‌.షర్మిలారెడ్డి ముఖ్యమంత్రి అవుతుందని జోష్యం చెప్పింది.

అందుకూ ఓ లెక్కుంది..
ఇటీవలే పోలీసులపై చేయి చేసుకున్న కేసులు షర్మిల ఒకరోజు జైల్లో ఉన్నారు. మరుసటి రోజు కోర్టు బెయిల్‌ ఇవ్వడంతో బయటకు వచ్చారు. ఆ తర్వాత ఓ యూట్యూబ్‌ చానెల్‌కు షర్మిల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణకు తర్వాత కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌.షర్మిలారెడ్డి మాత్రమే అని ఘంటాపథంగా చెప్పారు. అదెలా అని యాంకర్‌ ప్రశ్నించగా… అందుకూ ఓ లెక్క చెప్పారు షర్మిల. తెలంగాణలో ఇప్పటి వరకు రెండ సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయన్నారు. ఈ రెండ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పోటీ చేశాయని తెలిపారు. కానీ ప్రజలు ఈ రెండింటిని తిరస్కరించి బీఆర్‌ఎస్‌కే ఓటేశారన్నారు. అందుకు కారణం బీఆర్‌ఎస్‌కు బీజేపీ, కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయం కాదని తిరస్కరించారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ టీపీ పోటీ చేస్తుందని, ప్రజలు ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు తాను ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించుకున్నారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఒక్కటే..
ఇక కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అని షర్మిల తెలిపారు. అందుకే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేనే బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కలిసి పనిచేస్తాయని ప్రకటించారని గుర్తు చేశారు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిండం లేదని పేర్కొన్నారు.

ఎన్నికల వేళ వైరం నటిస్తున్నారు..
ఇక బీఆర్‌ఎస్, బీజేపీ 2014 నుంచి 2019 వరకు మిత్రులుగా ఉన్నారని, 2019 ఎన్నికల తర్వాత నుంచి ఇరుపార్టీలు వైరం ఉన్నట్లు నటిస్తున్నాయని ఆరోపించారు. నిజంగా వైరం ఉంటే.. కాళేశ్వరం అవినీతి, లిక్కర్‌స్కాంలో కేసీఆర్‌ కుటుంబం పాత్రపై విచారణ జరిపి ఇప్పటికే జైల్లో పెట్టేవారన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ పైకి మాత్రమే వైరం నటిస్తున్నాయని ఆరోపించారు.

ప్రత్యామ్నాయం వైఎస్సార్‌ టీపీనే..
కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో అధికార పార్టీని ప్రశ్నించడం లేదని, వైఫల్యాలను ఎత్తి చూడం లేదని, ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదని షర్మిల ఆరోపించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రత్యామ్నాంయ వైఎస్సార్‌ టీపీనే అని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ ఎక్కడిదమ్మా..
ఇదిలా ఉంటే.. అసల వైఎస్సార్‌ టీపీ ఎక్కడ ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షర్మిల మినహా ఆ పార్టీలో పేరున్న నాయకులెవరూ లేదు. అదలా ఉంటే.. అసలు పార్టీకి సంస్థాగత నిర్మాణమే లేదు. షర్మిల పోరాటం మినహా జిల్లాల్లో ఆ పార్టీ తరఫున పోరాటం చేసేవాళ్లు కూడా లేరు. మరి ఇలాంటి పరిస్థితిలో షర్మిల నెక్ట్స్‌ సీఎం నేనే అని ప్రకటించడాన్ని కాన్ఫిడెన్స్‌ అనాలా.. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అనాలా అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version