
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటన్నది అందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఘోరమైన దెబ్బ మొదలు.. ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. పంచాయతీ, మునిసిపల్ పోరులో ఏకపక్షంగా వైసీపీ విజయం సాధించడంలో తెలుగు తమ్ముళ్లు మరింతగా డీలాపడిపోయారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితంతో మరోమారు నిరుత్సాహానికి గురయ్యారు. ఇక, పార్టీని దేవుడే బతికించాలని వేడుకుంటున్నారు. అయితే.. దేవుడు కాదు జగనే బతికిస్తాడని చెబుతున్నారు కొందరు టీడీపీ సీనియర్లు. దానికి ప్రూఫులు కూడా చూపిస్తున్నారు.
ఇప్పుడు అధికార పార్టీతో.. పోటాపోటీగా ఢీకొట్టే పరిస్థితుల్లోనైతే టీడీపీ లేదు. అందుకే సింపతీ వర్కవుట్ చేసే పనిలో పడ్డారు నేతలు. వాళ్లు తప్పుచేశారా? లేదా? అన్నది న్యాయస్థానాలు తేలుస్తాయిగానీ.. వరుసగా టీడీపీ నేతలను ప్రభుత్వం అరెస్టు చేస్తుండడంతో ఒకరకమైన వాతావరణమైతే రాష్ట్రంలో క్రియేట్ అయ్యిందని అంటున్నారు. అచ్చెన్న, ధూళిపాల నరేంద్ర, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ వంటి వారి విషయంలో జగన్ సర్కారు వ్యవహరించిన తీరుతో.. ప్రభుత్వానిది ఇదేం పద్ధతి అనే ఆలోచన జనాల్లో వచ్చిందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
ఇప్పుడు రఘురామ విషయంలో వ్యవహరించిన తీరు కూడా తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారట. ప్రభుత్వ ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తోందనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారట. ఈ రాజకీయం వల్ల జగన్ కు ఏం ఒరిగిందో తెలియదుగానీ.. తమకు మాత్రం సానుభూతి బిల్డప్ అవుతోందని అనుకుంటున్నారట. ఈ రాజకీయం ఖచ్చితంగా తమకు ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారట. అంతేకాదు.. ఇదే తమను మరోసారి కుర్చీమీద కూర్చోబెడుతుందని కూడా లెక్కలు వేసుకుంటున్నారట.
గతంలో జగన్ కు సైతం ఇదే సింపతీ వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జగన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో పెట్టిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించిందని చెబుతున్నారు. ఇటు వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు తమ పార్టీలో చేర్చుకున్న వైనం జగన్ కు కలిసి వచ్చిందని పేరు చెప్పడానికి ఇష్టపడని నేత ఒకరు వ్యాఖ్యానించారు. కాబట్టి.. రేపు ఇదే ఫార్ములా తమకు కూడా వర్తిస్తుందని చెబుతున్నారు. మరి, దీనికి జగన్ ఏమంటారో?