CM Jagan: ఏపీ సీఎం జగన్ కు తత్వం బోధపడిందా? క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏమంతా ఆశాజనంగా లేదా? ఇదే విషయాన్ని వ్యూహాకర్త రుషిరాజ్ సింగ్ సర్వేల్లో తేలిందా? అటు నిఘా సంస్థలు కూడా ఇదే విషయాన్ని చేరవేశాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జగన్ ఇటీవల చేపడుతున్న విరుగుడు చర్యలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ కనీవినీ ఎరుగని విజయం సొంతం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. అయితే విజయాన్ని తలకెక్కించుకున్నారో ఏమో? గత మూడేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ బయటకు రాలేదు. ప్రజలను కలుసుకునేందుకు ఇష్టపడలేదు. బటన్ నొక్కుడు ద్వారా ప్రజలకు ఇష్టుడుగా మారిపోయానని ఆయన భావించినట్టున్నారు. దీనికితోడు స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు ఆయనలో మరింత నమ్మకాన్ని, ధీమాను పెంచేశాయి. తనకు తిరుగులేదనుకొని భావిస్తూ వచ్చారు. అందుకే సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు సైతం దర్శనమివ్వనంతగా ఆయన దీమా పెరిగిపోయింది. అటు పార్టీలో కూడా ఎక్కడా విభేదాలు కనిపించలేదు. అధినేత మాటే ఫైనల్ అన్నట్టుగా గత మూడేళ్లలో వైసీపీలో క్రమశిక్షణ కనిపించింది. ఇంకేముంది తనకు తిరుగులేదని భావించిన జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచే రాష్ట్ర పాలన సాగించగలిగారు. మూడేళ్ల పాలన తరువాత అంతా సీన్ రివర్ష్ అయ్యింది. ధీమా సడలిపోయింది. కలవరపాటు ప్రారంభమైంది. ప్రజా వ్యతిరేకత ఒక వైపు.. పార్టీలో అంతర్గత విభేదాలు మరోవైపు అధినేతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల మధ్య ఉండాలని జగన్ నిర్ణయం వెనుక గట్టి హెచ్చరికలైతే వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక నుంచి ప్రజల్లో ఉండి.. ప్రజల్లో తిరిగి.. ప్రజల సమస్యలు తెలుసుకొని.. వాటికి పరిష్కార మార్గం చూపి.. వారి అభిమానాన్ని పొందాలని జగన్ ప్రయత్నాలు ప్రారంభించడంతో ఏదో జరుగుతోందన్న అనుమానం సొంత పార్టీలో సైతం కనిపిస్తోంది. అధినేత మారిన విషయాన్ని పార్టీ శ్రేణులు కూడా అనుమానంతో చూస్తున్నాయి. జగన్ పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాలోపల మాత్రం ఏదో తెలియని అంతర్మథనం కనిపిస్తోందని పార్టీలో సీనియర్లు, ఆయన వ్యవహార శైలి తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.
బలవంతంగా జనాల్లోకి ఎమ్మెల్యేలు..
జనాల్లో నా గ్రాఫ్ బాగుంది.. మీదే బాగాలేదు.. పెంచుకోకుంటే మార్చేస్తాను అంటూ ఎమ్మెల్యేలకు జగన్ గట్టి సంకేతాలిచ్చారు. గత మార్చిలో ప్రత్యేకంగా సమావేశమై ఆరు నెలల పాటు పరీక్ష కాలంగా పేర్కొన్నారు. అప్పటికీ మీ గ్రాఫ్ పెంచుకోకుంటే మార్చేందుకు వెనుకాడనని కూడా తేల్చేశారు.తరువాత మరోసారి వర్కుషాపు నిర్వహించారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ముఖం చాటేయ్యడంపై గట్టి క్లాసే తీసుకున్నారు. బలవంతంగా వారిని జనాల్లోకి పంపించారు. అయితే కార్యక్రమం ఆసాంతం నిలదీతలు, నిరసనలతో ఎమ్మెల్యేలు, మంత్రుల పరువు పోయినంత పని అయ్యింది. అటు తరువాత ప్లీనరీ ఏర్పాటుచేశారు. భారీగా జన సమీకరణ చేశారు. ఇందుకు ఎమ్మెల్యేల వారీగా టార్గెట్లు విధించారు.
Also Read: Draupadi Murmu- BJP: ద్రౌపది ముర్ముతో బిజెపికి ఎంత లాభం అంటే
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకూ… చిత్తూరు నుంచి అనంతపురం వరకూ బస్సులు, వాహనాలు ఏర్పాటుచేసి మరీ తరలించేశారు. ప్లీనరీ విజయవంతం కావడంతో కాస్తా ఊపిరిపీల్చుకున్నారు. అయినా మనసులో ఏదో తెలియని వెలితి అయితే కనిపిస్తోంది. అందుకే మరోసారి ఎమ్మెల్యేలకు వర్కుషాపు నిర్వహించారు. వచ్చే ఎన్నికలకు దిశా నిర్దేశం చేశారు. కానీ ఎమ్మెల్యేల నుంచి నీరసమే కనిపించింది. దీంతో జగన్ మరింత కలవరపాటుకు గురయ్యారు. ఇంతలో సూచనలిస్తున్నా.. నిపుణులతో సలహా ఇస్తున్నా ఎందుకీ నైరాశ్యమంటూ ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేశారు. నేను మీట నొక్కడం అవసరమని.. నేను గానీ నొక్కకపోతే ప్రజలు ఊరుకోరని.. నా పని నేను చేస్తాను.. మీ పని మీరు చేసుకోండి అంటూ పేలవమైన మాటలు చెప్పి వర్కుషాపు ముగించేశారు. అటు తరువాత ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సమావేశమయ్యారు. మీరు గట్టిగా పనిచేయండంటూ ఆదేశాలివ్వకుండా సుతిమెత్తనైన మాటలతో వారిని బుజ్జగించారు. పదవుల్లో కొనసాగేందుకు ఇష్టం లేని వారు బయటకుపోండి అంటూ తన సహజ శైలిని వ్యక్తపరచకుండా.. ఇష్టంలేని వారు చేతులెత్తండంటూ నవ్వుతూ కోరారు. కానీ పదవులు ఇష్టం లేకున్నా చాలా మంది అయిష్టతగానే ఉండిపోయారు. అయితే జగన్ వ్యవహార శైలి తెలిసిన వారు అధినేతలో ఇంత మార్పా అంటూ చర్చించుకుంటున్నారు.
జెండా మోసిన వారికి న్యాయమేదీ?
మరోవైపు పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన కార్యకర్తలు, నాయకులు ఇన్నాళ్లకు గుర్తొచ్చినట్టున్నారు. స్థానిక సంస్థలో ఏకపక్ష విజయాలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఆలయ కమిటీలు, నామినేటెడ్ పోస్టులు ఇలా అన్నింటినీ పార్టీ క్రియాశీల కార్యకర్తలు, నేతలకు కేటాయించాం కదా.. మన పార్టీలో అసలు విభేదాలు అవకాశమే లేదన్నట్టు జగన్ భావించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్తితి అలా లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు, కార్యకర్తలను పక్కనపడేశారు. కొత్తగా వచ్చిన వారికే ఎంపీపీ, జడ్పీటీసీలు వంటి పదవులను అప్పగించారు. ఎక్కడికక్కడే ఎమ్మెల్యేలు పార్టీని చూడకుండా తమ వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకునేందుకే ప్రయత్నించారు. మరోవైపు జిల్లా నాయకత్వాలు కూడా అచేతనంగా ఉండిపోయాయి. ఒకరి నియోజకవర్గంలో ఇంకొకరు వేలు పెట్టకూడదన్న నిబంధనతో మంత్రులు సైతం కలుగజేసుకునే ప్రయత్నాలు చేయలేదు. దీంతో ఆవిర్భావం నుంచి జెండా మోసిన వారికి అన్యాయం జరిగింది. వారి వేదన అరణ్య రోదనగా మిగిలిపోయింది. దీంతో క్రియాశీలక నాయకులు సైతం చాలామంది నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. అదును చూసి పార్టీ నుంచి జంప్ చేయాలని అటు టీడీపీ, జనసేనలో కర్చీప్ వేసుకున్నారు. అయితే మూడేళ్ల తరువాత సర్వేలు, నిఘా సంస్థల హెచ్చరికలు అధినేత జగన్ చెవిలో ఈ విషయాన్ని పడేశాయి. దీంతో సీఎం అప్రమత్తమయ్యారు. ఆగస్టు 4 నుంచి నియోజకవర్గానికి 50 మంది చొప్పున నాయకులు, కార్యకర్తలతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పటికే సరిదిద్దుకోలేని విధంగా తప్పు జరిగిపోయింది. ఇప్పుడు పిలిచి చేసిందేమిటి లేదని నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు.
మారిన మనిషి…
‘నామాటే శాసనం.. నేనే ఫైనల్’గత ఎన్నికల్లో అంతులేని విజయం దక్కిన తరువాత సీఎం జగన్ వ్యవహార శైలి ఇది. కానీ ఇప్పుడు మారిన మనిషిగా ఆయన కనిపిస్తున్నాడు. ఎక్కడా అహంకారపూరిత మాటలు కానీ.. ఆదేశాలు కానీ కనిపించడం లేదు. అయినా పరిస్థితి చేయి దాటిన తరువాత మారితేం..మారకపోతేనేం అని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మూడేళ్లుగా ప్రజలను, సొంత పార్టీ నాయకులను కలవని సీఎంగా జగన్ అపవాదును మూటగట్టుకున్నారు. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏదో రూపంలో ప్రజలను, పార్టీనేతలను కలుసుకునేవారు. ఎమ్మెల్యేలను పలకరించేవారు. వారి వినతులను స్వీకరించి వీలైనంతవరకూ పరిష్కార మార్గం చూపేవారు. కానీ ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. మొన్నటి మొన్న సీఎం జగన్ ను నిత్యం ఆకాశానికెత్తే మాజీ మంత్రి పేర్ని నాని సీఎం మమ్మల్ని గౌరవిస్తే.. నాయకులు, కార్యకర్తలను మేము గౌరవించగలమని వ్యాఖ్యానించారు. తద్వారా పార్టీలో కొత్త చర్చకు దారితీశారు. అయితే మొత్తానికైతే సీఎం జగన్ కు ఇప్పుడిప్పుడే తత్వం బోధపడినట్టు పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. చూద్దాం వీటన్నింటినీ ఎలా సరిదిద్ధుకొని ముందుకు వెళతారో…