యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఆత్మరక్షణలో పడినట్లు కన్పిస్తుంది. వికాస్ దూబే మరణం పెద్ద వివాదాన్నే రేపింది. ఎన్ కౌంటర్ లో రౌడీ షీటర్లు చనిపోవటం యోగీ ప్రభుత్వంలో కొత్తేమీ కాదు. ఒకవిధంగా ఆ ఎన్ కౌంటర్లే ఇప్పటివరకు యోగీ పాపులారిటీ ని పెంచింది. ఉత్తర ప్రదేశ్ లో శాంతి భద్రతలు పెద్ద సమస్య. ఎవరయితే రౌడీలను, సంఘ విద్రోహకర శక్తులను అదుపులో పెడతారో వాళ్ళే సమర్ధ ముఖ్యమంత్రులుగా పేరు తెచ్చుకున్నారు. ఇంతకుముందు ముఖ్యమంత్రుల్లో మాయావతి కి మంచి పరిపాలనాదక్షురాలిగా పేరువచ్చింది. కారణం రౌడీలను సమర్ధవంతంగా అదుపులో పెట్టింది. అదే స్ఫూర్తి ని యోగీ కూడా ప్రదర్శించాడు.
యోగి ఆదిత్యనాథ్ పరిపాలన
యోగీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటం చాలామందికి ఈ వ్యాసకర్తతో సహా ఆశ్చర్యం వేసింది. అంత పెద్ద రాష్ట్రానికి ఏ పరిపాలనా అనుభవంలేని ఓ స్వామీజీ ని ముఖ్యమంత్రిని చేయటం సహజంగానే అనుమానాలకు తావు ఏర్పడుతుంది. ఆ రోజు మోడీ నిర్ణయం తప్పని అనుకున్న వాళ్ళలో ఈ వ్యాసకర్త కూడా ఒకరు. అదే అభిప్రాయాన్ని వ్యాసంలో కూడా వ్యక్తపరచటం జరిగింది. కానీ మా అంచనాలు తప్పని తర్వాత తేలింది. అంతకుముందు పరిపాలన చేసిన చాలామంది ముఖ్యమంత్రులతో పోలిస్తే యోగీ పరిపాలన మెరుగ్గా వుందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. యుపిలో వున్న కుల కొట్లాటల్లో ఓ స్వామీజీ ముఖ్యమంత్రి కావటం, తనకు స్వంతగా వెనకేసుకోవాలనే ఆలోచన లేకపోవటం సానుకూలపరిణామం గా పనిచేసింది. అయితే అది ఒక్కటే ముఖ్యమంత్రి పరిపాలనకు పాపులారిటీ కాజాలదు. పరిపాలన చేసే సామర్ధ్యం ఉన్నప్పుడే ఈ లక్షణాలు అదనపు విలువను జోడిస్తాయి. లేకపోతే నిజాయితీ ఒక్కటే పాపులారిటీ ని తెచ్చిపెట్టదు. యోగీ విషయం లో జరిగింది ఇదే. నిర్ణయాలు తీసుకోవటంలో వేగం, నిస్పక్షపాతంగా పనిచేయటం, పరిపాలనలో సమర్ధత ఇవన్నీ కలిసి తనని పాపులర్ ముఖ్యమంత్రిగా ప్రజల్లో నిలబెట్టాయి.
యోగీ ఆదిత్యనాథ్ పరిపాలనలో ముఖ్యమైనది శాంతి భద్రతలను మెరుగుపరచటం. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ పరిపాలనలో శాంతి భద్రతలు ఘోరంగా విఫలమయ్యాయి. అదే ఆ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసింది. అందుకనే యోగీ ఆదిత్యనాథ్ శాంతి భద్రతల అంశానికి అత్యధిక ప్రాధాన్యతని ఇచ్చాడు. ఎంతోమంది రౌడీ షీటర్లను ఎన్ కౌంటర్ చేయటమో, అరెస్టు చేసి లోపలవేయటమో చేసే సరికి మిగతా రౌడీ షీటర్లు రాష్ట్రం నుంచి పారిపోవటమో, స్వచ్చందంగా లొంగి పోవటమో జరిగింది. ఎన్ కౌంటర్లు ఎక్కువభాగం బూటకమైనా ప్రజలు వాటిని ఆహ్వానించారు. గత రెండు సంవత్సరాల్లో ఉత్తర ప్రదేశ్ శాంతి భద్రతల పరిస్థితి ఎంతో మెరుగుపడింది. ఇది సామాన్య జననాడి. దానితోపాటు యోగీ ఆదిత్యనాథ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నాందిపలికాడు. ఎప్పుడూలేనిది ఉత్తర ప్రదేశ్ లో మెల్లి మెల్లిగా పెట్టుబడులు పెట్టే వాతావరణం వచ్చింది. కరోనా మహమ్మారి రాకుండా వుంటే ఇప్పటికే దీనికి సంబంధించిన ఫలితాలు కనబడేవి. ఇంకా మిగిలిన రెండు సంవత్సరాల్లో గుణాత్మక మార్పులు వస్తాయని వూహిస్తున్నారు. ఈ నేపధ్యంలో నిన్న జరిగిన సంఘటనను ఒక్కసారి పరిశీలిద్దాం.
కరుడుగట్టిన నేరస్థుడు వికాస్ దూబే
వికాస్ దూబే కరుడుగట్టిన రౌడీ. ఇప్పటికి తనమీద 60 నేరపూరిత కేసులున్నాయి. రాజ్ నాథ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు బిజెపి నాయకుడొకరిని పోలీసు స్టేషన్ లోనే హత్యచేసాడు. ఇప్పటికి డజను సార్లు అరెస్టు అయినా కేసులు నమోదు చేసినా ప్రతిసారి చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకొని బయటకు వచ్చాడు. చాలా సందర్భాల్లో సరైన సాక్ష్యం చెప్పటానికి ఎవరూ ముందుకు రాకపోవటం కూడా జరిగింది. దానితోపాటు పోలీసు వ్యవస్థలో , రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు వుండి ఎప్పటికప్పుడు రక్షణ పొందుతూ వచ్చాడు. ప్రస్తుత అధికార వ్యవస్థలోని డొల్లతనం వికాస్ దూబే తెలివిగా ఉపయోగించుకొని బయటపడటానికి ఉపయోగపడింది. మనం క్రైం సినిమాల్లో చూసే వర్ణనలకు ఏ మాత్రం తీసిపోని విధంగా వికాస్ దూబే చరిత్ర వుంది. ప్రజలకి ఇటువంటి పరిస్థితుల్లో వున్న వ్యవస్థల మీద నమ్మకం పోవటం సహజం. ఆ ఆలోచనే ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజలు మళ్లేటట్లు చేస్తుంది. ఈ రోజుకీ చాలామంది న్యాయం కోసం పోలీసుల దగ్గరికీ , కోర్టుల దగ్గరికీ కాకుండా స్థానిక చోటా మోటా నాయకుల్ని ఆశ్రయిస్తూ వుంటారు. ముఖ్యంగా పేద ప్రజలు. ఆ సైకాలిజీ నే ప్రజలు ఎన్ కౌంటర్లకు మద్దతిచ్చేదాకా తీసుకెళ్ళింది. అంతెందుకు ఇటీవల హైదరాబాద్ లో ఓ అమ్మాయి రేప్ కేసులో నిందితుల్ని ఎన్ కౌంటర్ చేయాలని బహిరంగంగా ప్రదర్శనలు చేసి డిమాండ్ చేయటం ప్రజాభిష్టానికి అనుగుణంగా పోలీసులు ఎన్ కౌంటర్ చేయటం ( ఇది జనం అనుకుంటున్నది) మనకు తెలిసిందే. ఇదే ఉత్తర ప్రదేశ్ లో మొత్తం రౌడీ షీటర్ల విషయం లోనూ ప్రజాభిష్టానికి అనుగుణంగానే యోగీ ఆదిత్యనాథ్ ఈ ఎన్ కౌంటర్లు చేయించాడని అనుకుంటున్నారు. అయితే ఇటీవల ఈ విషయంలో యోగీ దూకుడు తగ్గింది. ఎందుకంటే మానవ హక్కుల సంఘాలు, మేధావులు వీటిని తీవ్రంగా తప్పు పట్టటంతో కొంతమేర తగ్గాడని చెప్పొచ్చు. అదీగాక ఏ ఉద్దేశంతో మొదలయ్యాయో అది నెరవేరింది కూడా. అదివరకటిలాగా కాకుండా శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయి.
ఈ పరిస్థితుల్లో వికాస్ దూబే 8 మంది పోలీసులను ( ఒక డిఎస్పి తో సహా) చంపటం యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బతగిలింది. అందుకే ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అనేక స్పెషల్ టీములు తనకోసం గాలించ సాగాయి. ఇంతలో కాంగ్రెస్ నాయకుడు జితిన్ ప్రసాద దీన్ని బ్రాహ్మణులకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడిగా ప్రచారం చేసాడు. బ్రాహ్మణులలో పోయిన మద్దత్తు ని తిరిగి సంపాదించుకొనే పనిని భుజాన కెత్తుకున్నాడు. యోగీ కి వ్యతిరేకంగా వున్న జర్నలిస్టులు , మేధావులు ఇప్పటికే వికాస్ దూబే ని రక్షించటం కోసం బిజెపి నాయకులే తనని నేపాల్ బోర్డర్ కి పంపించారని ప్రచారం చేశారు. అందులో ప్రముఖ జర్నలిస్టు రాజదీప్ దేశాయ్ కూడా చేరాడు. ఆశ్చర్యంగా నిన్న ఉజ్జయినీలో పట్టుబడటం తో ఆ ప్రచారానికి తెరపడింది. అక్కడనుండి కాన్పూర్ తరలించే క్రమంలో వికాస్ దూబే ‘ఎన్ కౌంటర్లో’ మరణించటం పెద్ద వివాదాస్పదమయ్యింది. ఇది ఖచ్చితంగా బూటకపు ఎన్ కౌంటరేనని ఎక్కువమంది భావించటం జరిగింది. ఖచ్చితంగా ఇది బూటకపు ఎన్ కౌంటరేననే దాంట్లో ఎటువంటి సందేహంలేదు. హైదరాబాద్ లో జరిగింది బూటకపు ఎన్ కౌంటరేనని అందరికీ తెలుసు. అయినా ప్రజల మద్దత్తు వుంది. ఇది సూత్రపరంగా తప్పని తెలుసు. అయినా ప్రజాభీష్టం భిన్నంగా వుంది. ఇక ఈ సంఘటన పై యోగ్యతా యోగ్యతలు పరిశీలిద్దాం.
కులపైత్యం పరాకాష్టకు చేరింది
వికాస్ దూబే పారిపోయిన దగ్గరనుంచీ ఓ విచిత్ర ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకుడు జితిన్ ప్రసాద మొదలుపెట్టిన కుల కుంపటి పెరిగి పెద్దదయి వెర్రి తలలు వేస్తుంది. వికాస్ దూబే ని విష్ణు మూర్తి ఆరో అవతారం పరశురాముడు తో పోలుస్తూ సాంఘిక మాధ్యమాల్లో పోస్టులు కోకొల్లలుగా వస్తున్నాయి. వికాస దూబే బ్రాహ్మణుడు కావటం తో ఎంతోమందిని హత్య చేసిన కిరాతకుడైనా మనవాడు అనేభావనతో సాంఘిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే చదువు వీళ్ళకు నేర్పిన సంస్కృతి ఇదేనా అని నోటిమీద వేలేసుకోవటం మనవంతయ్యింది. వీళ్ళే ఇంతకుముందు యోగీ ఆదిత్యనాథ్ రౌడీలను ఎన్ కౌంటర్ చేసినందుకు విపరీతంగా పొగిడారు. అదే తమకులంవాడు ఎన్ కౌంటర్ అయ్యేసరికి యోగీ ఠాకూర్ కాబట్టి బ్రాహ్మణులకు అన్యాయం చేస్తున్నాడని ప్రచారం చేస్తున్నారు. అతను పొట్టనపెట్టుకున్న వాళ్ళలో బ్రాహ్మణులు కూడా వున్నారని మరిచిపోయారు. వికాస్ దూబే హత్యచేసిన బిజెపి నాయకుడు శుక్లా బ్రాహ్మణుడే. దీర్ఘకాలంలో ఈ ప్రచారం పెద్దగా నిలబడకపోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఎన్ కౌంటర్ కాబడ్డ వారు వెనకబడిన కులాల వాళ్ళు, ముస్లింలు వున్నారు. అప్పుడు గుర్తుకు రాని కులం ఇప్పుడు ఎలా గుర్తుకొస్తుంది? నేరస్తుడు ఏ కులం వాడైనా , ఏ మతస్తుడైనా నేరం నేరమే. అప్పుడు ఎన్ కౌంటర్ కరెక్టయితే ఇప్పుడూ కరెక్టే. ఇప్పుడు తప్పయితే అప్పుడూ తప్పే. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అసలు ఈ ఎన్ కౌంటర్లు సమర్ధనీయమా?
ఎన్ కౌంటర్ సమర్ధనీయమా?
ఎటువంటి పరిస్థితుల్లో సమర్ధనీయం కాదు. ప్రజాభీష్టం ఎన్ కౌంటర్లకు అనుకూలంగా ఉండటానికి కారణం ఇప్పుడున్న న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకపోవటమే. మన దేశంలో అత్యవసరంగా సంస్కరణలు రావాల్సింది న్యాయ వ్యవస్థలో. మనం అరువు తీసుకున్న బ్రిటీష్ న్యాయ వ్యవస్థ ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోకల్లా అధ్వానపు వ్యవస్థ. న్యాయం జరగదనుకున్నప్పుడు విచారణకే రాకుండా వాయిదా వేయించుకో గలగటం ఈ వ్యవస్థలో ప్రత్యేకత. అందుకే ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది. అంతమాత్రాన ప్రత్యామ్నాయ పద్దతులు ఎటువంటి పరిస్థితుల్లోనూ సమర్ధనీయం కాదు. అది హైదరాబాద్ ఎన్ కౌంటర్ అయినా, కాన్పూర్ ఎన్ కౌంటర్ అయినా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొనే అధికారం పోలీసులకు లేదు. ఈ కేసులో 8 మంది పోలీసులు చనిపోయివుండోచ్చు. అంతమాత్రాన పోలీసులే న్యాయనిర్ణేతలు అయితే ఎలా? దీన్ని వెనకుండి నడిపించిన రాజకీయ నాయకత్వంది కూడా ముమ్మాటికీ తప్పే. మిగతా ఎన్ కౌంటర్లకీ దీనికి తేడా వుంది. ఈ సంఘటన లో ముద్దాయిని అరెస్టు చేయటం జరిగింది. దేశవ్యాప్త ప్రచారం జరిగింది. అప్పటికే దీనిపై ఎంతో చర్చోపచర్చలు జరిగాయి. ఇది బూటకపు ఎన్ కౌంటర్ కాదనటానికి బెనిఫిట్ అఫ్ డౌట్ ఏ మాత్రం లేదు. అటువంటప్పుడు ఈ చర్య ని ఎవరూ సమర్ధించలేరు.
యోగీ ఆదిత్యనాథ్ కి ముందుగా ఈ విషయంలో కోర్టు గండం వుంది. ఇంతవరకు జరిగిన ఎన్ కౌంటర్లకు దీనికి తేడావుంది. దీన్ని ఏ కోణంలోనూ సమర్ధించే ఆధారాలు లేవు. రెండోది, ముఖ్యమైనది ప్రజాభిప్రాయం మిగతా ఎన్ కౌంటర్లలో లాగా విస్తృత జనామోదంగా లేదు. మూడోది, మొట్టమొదటసారి ప్రతిపక్షాలకు ఒక ఆయుధం దొరికింది. అయితే ప్రతిపక్షాలు విమర్శించినట్లు బిజెపి నాయకులతో వికాస్ దూబే కి సన్నిహిత సంబంధాలున్నాయి కాబట్టి బూటకపు ఎన్ కౌంటర్ చేసారనేది నిజం కాకపోవచ్చు. అదే నిజమయితే ఇంతకుముందు జరిగిన ఎన్ కౌంటర్లలో బిజెపి తోటి సంబంధాలు వున్నాయి కాబట్టి చేయలేదుకదా. ఎంతోమంది రౌడీ షీటర్లు సమాజ్ వాది నాయకులతోనే ఉండేవి. అయినా ఎన్ కౌంటర్ చేశారు. కారణం అదో పాలసీ గా పెట్టుకున్నట్లు అనిపిస్తుంది. వికాస్ దూబే కి బిజెపి నాయకులతో సంబంధాలు లేవని చెప్పలేము. అదేసమయంలో బిజెపి నాయకులొక్కరితోనే సంబందాలున్నయనేది కూడా నిజం కాదు. సమాజ్ వాది పార్టీ నాయకులు మిగతా రాజకీయ పార్టీ నాయకులతో కూడా సంబంధాలు వున్నాయి. వాళ్ళు అధికారం లో ఎవరుంటే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. నేరస్తులందరూ చేసే పనే ఇది. ఉదాహరణకు ఇప్పుడు దొంగ బంగారం కేసులో కేరళ లో సిపిఎం నాయకులతోనూ సంబంధాలు పెట్టుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి ఎటువంటి లెటర్ రాసినా కింద సిపిఎం నాయకులకు సంబంధం లేదని తనుకూడా సర్టిఫికేట్ ఇవ్వలేడు. ఇదీ అంతే . కాకపోతే అసలు ఈ ఎన్ కౌంటర్ పాలసీనే సమర్ధనీయం కాదు. తాత్కాలికంగా ప్రజలకి ఇది మంచిగా అనిపించినా దీర్ఘ కాలంలో అది ప్రజలకు చేటు చేస్తుందని మరిచిపోవద్దు. పూర్తి అవినీతిమయమైన పోలీసు వ్యవస్థ ప్రజలకు న్యాయం చేస్తుందని ఎవరైనా భావిస్తే అది తెలివితక్కువతనమే. యోగీ ఆదిత్యనాథ్ తీసుకున్న ఈ విధానం పులి మీద స్వారి చేస్తున్నట్లే. స్వారి మొదలుపెట్టిన తర్వాత దిగనూ లేడు, అదేసమయం లో ఎల్లకాలం స్వారీ చేయనూ లేడు. ప్రస్తుతానికి యోగీ ఆదిత్యనాథ్ కి గండం లేకపోయినా ఈ విధానం ఎప్పటికైనా తనకి గుదిబండే. ఈ విషవలయం నుంచి బయటపడకపోతే ఎప్పటికైనా యోగికి ప్రమాదమే. ఏమవుతుందో చూద్దాం.