
Pawan Kalyan- Yellow Media: అవసరాలు ఎంత పనైనా చేయిస్తాయి. అందునా రాజకీయ అవసరాల విషయంలో చెప్పనక్కర్లేదు. అక్కడ అవసరంకు ఉన్న ప్రాధాన్యం మరి దేనికీ లేదు. అవసరం అనుకుంటే శత్రువు మిత్రుడుగా మారిపోతాడు.. ప్రత్యర్థి సైతం అనుకూలంగా మారిపోతాడు. నాలుగు దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న కన్నా, చంద్రబాబులు ఇట్టే కలిసిపోయారు. తనను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కన్నా హుందా గల నాయకుడిగా చంద్రబాబు వర్ణించారు. తనను చంపడానికి ప్రయత్నించాడన్న చంద్రబాబు కన్నాకు ఇప్పుడు ఇంద్రుడు, చంద్రుడు అయిపోయారు. అయితే పరస్పర అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఇద్దరు నాయకులు గతాన్ని మరిచిపోయి అపరిచితులుగా మారిపోయారు. అయితే పవన్ విషయంలో చంద్రబాబు సైతం అదే స్ట్రాటజీతో వెళుతున్నారు. అవసరం, సందర్భం బట్టి పవన్ కోసం పడిగాపులు కాస్తున్నట్టు నటిస్తునే అతడి బలాన్ని తక్కువ చూపే ప్రయత్నం చేస్తున్నారు.
మొన్న ఆ మధ్య ఏబీఎన్ రాధాక్రిష్ణ పవన్ కు కేసీఆర్ నుంచి భారీ ప్యాకేజీ ఆఫర్ వచ్చినట్టు తన కొత్త పలుకులో కొత్తగా చెప్పాడు. చంద్రబాబుకు తెలియక ఇది జరగక ఉండకపోవచ్చు. ఆ విషయానికి వస్తే టీడీపీకి లాభం లేనిదే రాధాక్రిష్ణ పెన్ను ముందుకు కదలదన్నది జగమెరిగిన సత్యం. సరైన సమయంలో పవన్ ను డిఫెన్స్ లో పెట్టాలన్నదే వ్యూహం. ఆపై గత ఎన్నికల మాదిరిగా రాజకీయ కుట్రలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా చంద్రబాబే రాధాక్రిష్ణతో ఇటువంటి రాతలు రాయించి ఉంటారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ ను వాడుకుంటూనే.. పవన్ బలం పెరగకుండా చూడాలన్నదే ఇప్పుడు ఎల్లో మీడియా టాస్క్. అందుకు ఎన్నిరకాలుగా ప్రచారం చేయాలో అన్నిరకాలుగా చేస్తారు.
పవన్ అవసరం టీడీపీకి, చంద్రబాబుకే ఎక్కువ. అలాగని కాళ్లబేరానికి దిగితే నష్టపోయేది తానే అని తెలిసి చంద్రబాబు జాగ్రత్తపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుచీలినివ్వనని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దెదించుతానని ప్రకటించడం ద్వారా పవన్ పొత్తులకు తెరతీశారు. కానీ ఆ పొత్తులు చంద్రబాబుకే కీలకం. అలాగని ఎక్కువ సీట్లు వదులుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. సీట్లు ఇవ్వకుండా, గౌరవం ఇవ్వకుంటే పొత్తు కుదిరే పనికాదని పవన్ తేల్చేస్తున్నారు. అందుకే చంద్రబాబు వ్యూహం మార్చారు. అటు ఎల్లో మీడియాకు పవన్ బలాన్ని చూపించే ప్రయత్నం చేయాలని పురమాయిస్తునే.. ఇతర పార్టీల నాయకులు జనసేనలోకి వెళ్లకుండా టీడీపీలో చేర్చుకుంటున్నారు.

వాస్తవానికి పవన్ ఎప్పుడు అధికారం కోసం దేబిరించలేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోతానని ఆశగా ప్రకటించలేదు. కేవలం ప్రజల దయతోనే అవుతానని.. వారు బలమైన సంకల్పం చేస్తే మాత్రం కచ్చితంగా అవుతానని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లోతన వల్లే వైసీపీ అధికారంలోకి వచ్చిందని.. నాటు చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని ఉంటే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ప్రకటించారు. అయితే ఈ చిన్న కంటెంట్ తీసుకునే చంద్రబాబు, ఎల్లో మీడియా సరికొత్త ప్లాన్లు వేస్తోంది. పవన్ ను బలాన్ని తక్కువ చేసి టీడీపీ గూటికి చేరేలా ఒత్తిడి చేస్తోంది. అందులో భాగంగానే ఏవేవో కట్టుకథలు, రాతలతో ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇప్పటికే పవన్ చుట్టూ ఒక బలమైన శక్తి ఉంది. పొత్తు కోరుకుంటూనే పవన్ కు పవర్ షేరింగ్ ఇవ్వాలన్న నినాదం విస్తరిస్తోంది. దీనిని కట్టడి చేయడానికి ఎల్లోమీడియా పడరాని పాట్లు పడుతోంది.