
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్లో ఫ్యాన్ హోరుగాలి కొనసాగింది. పెండింగ్ లో ఉన్న ఈ మునిసిపాలిటీకి సంబంధించిన ఫలితాలను ఆదివారం ప్రకటించారు. మొత్తం 50 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో వైసీపీ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. సైకిల్ పూర్తిగా పంక్చర్ అయిపోయింది.
ఏలూరు కార్పొరేషన్లో ఉన్న మొత్తం 50 డివిజన్లలో ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం అధికార వైసీపీ పార్టీ ఏకంగా 30 స్థానాల్లో విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమై చిత్తుగా ఓడిపోయింది. మరో ఎనిమిది స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. మరో ఏడు స్థానాల్లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. మిగిలిన మూడు స్థానాల్లో ఎన్నిక ముందుగానే ఏకగ్రీవమైపోయింది. అవి మూడూ వైసీపీ ఖాతాలోనే పడ్డాయి.
ఈ ఫలితాలతో టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో కూరుకుపోయాయి. కనీస పోటీ ఇవ్వలేక కేవలం రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి రావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే.. వెల్లడైన మునిసిపల్ ఫలితాల్లో అధికార వైసీపీ తిరుగులేని విజయం నమోదు చేసింది. తొంభై శాతానికిపైగా మునిసిపాలిటీల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఏలూరులోనూ అదే ఫలితం పునరావృతం కావడం విశేషం.
ఈ విజయంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ప్రజలు తమవైపే ఉన్నారనే విషయం ఎప్పటికప్పుడు నిరూపణ అవుతూనే ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తోంది కాబట్టే.. జరిగిన ప్రతి ఎన్నికలోనూ అద్భుతమైన విజయాన్ని అందిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాగా.. మిగిలిన డివిజన్లకు సంబంధించిన ఫలితాలతోపాటు పూర్తిస్థాయి రిజల్ట్ ను మరికొద్ది సేపట్లో అధికారులు విడుదల చేయనున్నారు.