
బలమైన ప్రభుత్వం.. బలమైన ప్రతిపక్షం అంటే అది ఏపీలోనే చూస్తుంటాం. అది మొన్నటి వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడైనా.. ఇప్పుడు జగన్ సీఎం అయినా.. సేమ్ సీన్. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. టీడీపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు లేకున్నా.. వారి విమర్శలు ప్రతివిమర్శలు అన్నీఇన్నీ కావు. వైసీపీ, టీడీపీ నేతల మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది.
Also Read: జగన్ న్యాయవ్యవస్థను బెదిరిస్తున్నారా?
ఏ అవకాశం దొరికినా టీడీపీ వైసీపీ ప్రభుత్వంపై రెచ్చిపోతూనే ఉంటుంది. అయితే.. ఇప్పుడు తాజాగా ఏపీని వరదలు ముంచెత్తాయి. నాలుగు రోజులుగా ఏపీని వరదలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వరదలతో ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల పంటలు మునిగిపోయాయి. రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇళ్లలో నదులు ప్రవహిస్తున్నట్లు పరిస్థితి ఉంది. పలుచోట్ల పేదల ఇళ్లు కుప్పకూలి, పలువురు మృతి చెందారు.
ఓ వైపు ప్రజలు వరదలో మునుగుతుంటే.. ఇప్పుడు ఏపీలో బురద రాజకీయాలు మొదలయ్యాయి. వైసీపీ నేతలైతే ఏకంగా అమరావతి మీద ఫోకస్ పెట్టి రాజకీయం చేస్తున్నారు. అబ్బో అమరావతి మునిగిపోయిందని, రోడ్ల మీద చేపలు పట్టుకోవచ్చు అన్నట్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. అటు కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు కూడా మునిగిపోతుందని సెటైర్లు వేస్తున్నారు.
అయితే.. ఏమీ అవగాహన లేక పలువురు వైసీపీ కార్యకర్తలు ఈ రాజకీయం చేస్తే.. మరికొందరు ముఖ్యనేతలు దీనిపై పోస్టులు పెడుతూ ఉన్న పరువును పోగొట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితిని ఒకసారి చూస్తే.. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే అమరావతిలో పెద్దగా వరద ముంపు లేదు. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ.. వైసీపీ నేతలే ఫేక్ ఫొటోలు పెట్టి ప్రచారానికి దిగారు. ఇటు టీడీపీ వారు కూడా తగ్గకుండా రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు మునిగిపోయాయని చెబుతూ,వాటిల్లోకి వెళ్లి మునగడం, అలాగే రోడ్లు మీద గుంటల్లో చేపలు పట్టడం చేస్తున్నారు.
Also Read: జగన్ లేఖ: అమెరికాలోనూ ప్రకంపనలు.. ప్రవాసాంధ్రులు ఏమనుకుంటున్నారు?
ఇక ప్రతిపక్ష నేత బాబు మాత్రం హైదరాబాద్‌లో కూర్చుని ఏపీ వరదలపై జగన్‌కు లేఖలు రాస్తున్నారు. ప్రతిపక్ష నేత అయి ఉండి ఫీల్డ్‌లో దిగి ప్రజలకు అండగా ఉండాలి. కానీ.. ఇంట్లో కూర్చుని ప్రేమ లేఖలు రాస్తున్నట్లుగా చేస్తున్నారు. మొత్తానికి రెండు పార్టీలు వరద రాజకీయాలు చేస్తున్నట్లే కనిపిస్తోంది.
Comments are closed.