https://oktelugu.com/

వైసీపీ, టీడీపీల టార్గెట్‌ బీసీలేనా..?

కుల రాజకీయాలకు కేరాఫ్‌ ఆంధ్రప్రదేశ్‌. ఏపీలో ప్రధానంగా కులాల ప్రాతిపదికనే రాజకీయాలు నడుస్తుంటాయి. ఏ పార్టీలో చూసినా కులాలనే తెరమీదకు తెస్తుంటారు. బలమైన అధికార పక్షంగా ఉన్న వైసీపీలో.. అటు ప్రతిపక్ష టీడీపీలోనూ ఈ రాజకీయాలకు కొదువేం లేదు. ఇన్నాళ్లు కాపు రాజకీయాలు నడిచిన ఏపీలో.. ఇప్పుడు ఇరు పార్టీలు బీసీలను టార్గెట్‌ చేసినట్లుగా కనిపిస్తోంది. Also Read: మరో దుమారం: ఏపీలో ఇసుక తుఫాన్‌.. ఏపీలో దాదాపు 50 శాతం మంది బీసీలే ఉన్నారు. వీరి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 20, 2020 / 02:01 PM IST
    Follow us on


    కుల రాజకీయాలకు కేరాఫ్‌ ఆంధ్రప్రదేశ్‌. ఏపీలో ప్రధానంగా కులాల ప్రాతిపదికనే రాజకీయాలు నడుస్తుంటాయి. ఏ పార్టీలో చూసినా కులాలనే తెరమీదకు తెస్తుంటారు. బలమైన అధికార పక్షంగా ఉన్న వైసీపీలో.. అటు ప్రతిపక్ష టీడీపీలోనూ ఈ రాజకీయాలకు కొదువేం లేదు. ఇన్నాళ్లు కాపు రాజకీయాలు నడిచిన ఏపీలో.. ఇప్పుడు ఇరు పార్టీలు బీసీలను టార్గెట్‌ చేసినట్లుగా కనిపిస్తోంది.

    Also Read: మరో దుమారం: ఏపీలో ఇసుక తుఫాన్‌..

    ఏపీలో దాదాపు 50 శాతం మంది బీసీలే ఉన్నారు. వీరి అండగా ఆవిర్భవించిన పార్టీ టీడీపీ. నాలుగు దశాబ్దాలుగా వారిని నమ్ముకుని రాజకీయాలు నడిపిస్తోంది. అటు కాపులకు కూడా అదే స్థాయిలో ఇంపార్టెన్స్‌ ఉంది. ఆది నుంచి టీడీపీ వైపే మొగ్గుచూపిన బీసీలు.. పోయిన ఎలక్షన్లలో మాత్రం వైసీపీకి అండగా నిలిచారు. బీసీలకు వైసీపీ ప్రకటించిన తాయిలాలు అలాంటివి మరి. అప్పటివరకూ బీసీలకు అరకొర పదవులు, కుల వృత్తులు చేసుకునేందుకు పనిముట్లకే పరిమితమైన వ్యవహారం నుంచి ఎన్నికల్లో అత్యధిక శాతం సీట్లను ఇచ్చింది వైసీపీ. ప్రతీ కులానికీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామనే హామీ ఇచ్చింది ఇప్పుడు అమలు కూడా చేసింది. దీంతో ఇప్పుడు టీడీపీ మరోసారి ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. దీని ప్రభావంతో కాపుల చేతిలో ఉన్న టీడీపీ అధ్యక్ష పగ్గాలను అచ్చెన్నాయుడు రూపంలో బీసీలకు కట్టబెట్టింది. అయితే వైసీపీ, టీడీపీ తాయిలాల ప్రకటన బీసీలను ఎటువైపు మొగ్గేలా చేస్తాయన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

    రాష్ట్ర జనాభాలో కేవలం నాలుగైదు శాతం ఉన్న తమ సామాజిక వర్గం కోసం పార్టీ పెట్టినా అంతిమంగా దానికి కాపు కాయాల్సింది మిగతా కులాలే. ఈ సూత్రం వైసీపీ, టీడీపీ ఇద్దరికీ వర్తిస్తుంది. సరిగ్గా ఇదే కోణంలో 1983లో బీసీల అండతో కమ్మ సామాజిక వర్గ నాయకత్వంలో టీడీపీ ఆవిర్భవించింది. అప్పటి నుంచి కమ్మ సామాజిక వర్గ నేతలే, ఇంకా చెప్పాలంటే ఓ కుటుంబమే టీడీపీకి నాయకత్వం వహిస్తూ వచ్చింది. అయినా పార్టీకి అండగా నిలిచిన బీసీలు మాత్రం ఎటూ పోలేదు. దీంతో బీసీల అండతోనే పలుమార్లు అధికారం అందుకున్న టీడీపీ రాష్ట్ర విభజన తర్వాత మాత్రం బీసీలను నిర్లక్ష్యం చేసిందన్న అపవాదు మూటగట్టుకుంది. దీంతో గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి బీసీలు దూరమయ్యారు. దీని ప్రభావం ఏ స్ధాయిలో పడిందంటే టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది.

    ఏపీలో ప్రధానంగా బీసీల ఓటు బ్యాంకు అనంతపురంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉంది. వీరు ఎటువైపు మొగ్గు చూపితే దాదాపుగా ఆ పార్టీకే అధికార పీఠం దక్కుతుంది. దీంతో అనంతపురంలోని రెండు పార్లమెంటు సీట్లతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల బీసీ సమీకరణాలను వైసీపీ గత ఎన్నికల్లో సమర్థవంతంగా వర్కవుట్‌ చేసింది. దీంతో ఆయా స్థానాల్లో బీసీలు వర్సెస్‌ కమ్మ సామాజికవర్గంగా సైతం మారిపోయింది. గత ప్రభుత్వంలో బీసీలను టీడీపీ నాయకత్వం చిన్నచూపు చూసిందంటూ వైసీపీ చేసిన ప్రచారం వారిలో పెను ప్రభావం చూపింది. ఫలితంగా బీసీలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ వైపు మొగ్గారు. దీంతో వైసీపీ కూడా రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని మెజారిటీతో అధికార పీఠం అందుకుంది.

    Also Read: మీడియా వర్సెస్ బాలీవుడ్.. చివరికీ ఏం కానుంది?

    వైసీపీ ఎన్నికల సమయంలో బీసీల్లోని 135 కులాలకు 56 కార్పొరేషన్లను ప్రకటించింది. వీటి ద్వారా బీసీల్లోని అన్ని కులాలకు ఏదో ఒక కార్పొరేషన్‌లో ప్రాతినిధ్యం ఇస్తోంది. అయితే.. భవిష్యత్తులో వాటికి నిధులు ఎలా ఇస్తారు.. అవి ఎలా పనిచేస్తాయి.. బీసీలకు పనికొస్తాయా లేదా అన్న చర్చను పక్కబెడితే ఇచ్చిన హామీని మాత్రం జగన్‌ నెరవేర్చారు. వైసీపీ నిర్ణయంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఆది నుంచి తమ పార్టీ అనుకున్న బీసీలను ఇలా వైసీపీ టార్గెట్‌ చేయడాన్ని తట్టుకోలేకపోతోంది.

    అందుకే.. టీడీపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఏకంగా పార్టీ అధ్యక్ష పదవిని బీసీ నేతకు కట్టబెట్టి.. బీసీల మీద తమకున్న ప్రేమను చాటాలని చూసింది. వైసీపీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న టైంలోనే.. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చూస్తుంటే.. ఇరు పార్టీల్లోనూ బీసీల రాజకీయమే ప్రధానంగా నడుస్తున్నట్లు అర్థమవుతోంది.