ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. రాజధాని లేని రాష్ట్రానికి కేంద్రం అండ అవసరం.. పైగా సీఎం జగన్ పై పాత కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అందుకే ఏపీలో బీజేపీ దూకుడుగా వెళుతున్నప్పటికీ వైసీపీ మాత్రం కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్.డీ.ఏ ప్రభుత్వానికి దగ్గరవుతుండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కారాలు మిరియాలు నూరుతున్నా బీజేపీకే మద్దతు ఇవ్వడం విశేషం.
Also Read : బాబుకు వయసు బెంగ పట్టుకుందట..?
తాజాగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్.డీ.ఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు వైసీపీ అధికారికంగా మద్దతు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. “రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ కు మద్దతు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము” అని సాయి రెడ్డి తెలిపారు.
అదే సమయంలో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఎన్టీఆర్ అభ్యర్థికి ఓటు వేయకుండా దూరంగా జరిగి మోడీషా బెదిరింపులకు లొంగమని కేసీఆర్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. అదే సమయంలో సహకరించారని కూడా అంటున్నారు. గతంలో కూడా వైసీపీ అనేక సందర్భాల్లో ఎన్డీఏకు మద్దతు ఇచ్చింది. రాష్ట్రాలకు ఇవ్వవలసిన జీఎస్టీ పరిహారంలో నష్టాన్ని పూడ్చడానికి ఎక్కువ రుణాలు తీసుకోవడానికి రాష్ట్రాలను అనుమతించే మోడీ ప్రభుత్వ సూత్రాన్ని పలు బిజెపియేతర రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, జగన్ ప్రభుత్వం మాత్రం బహిరంగంగా మద్దతు ఇచ్చింది. ఆత్మ నిర్భర్ భారత్ కింద సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయాలన్న ఎన్డీఏ ప్రభుత్వ షరతులకు జగన్ ప్రభుత్వం అంగీకరించింది.
ప్రతిగా ఎన్డీఏ ప్రభుత్వం పరోక్షంగా జగన్ మూడు రాజధానుల సూత్రానికి హైకోర్టులో అఫిడవిట్ సమర్పించడం ద్వారా మద్దతు ఇచ్చింది. మూడు రాజధానుల కోసం ఏపి ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి అడ్డుచెప్పకుండా ఓకే చెప్పింది. ఇలా బీజేపీకి వైసీపీ పాహిమాం అని లొంగిపోయిందని.. అదే సమయంలో బీజేపీ తన శక్తియుక్తులతో వైసీపీని ఆడిస్తోందన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది.