Vizag steel : విశాఖ ఉక్కు.. వైసీపీ హక్కు ఎందుకు కాదు?

Vizag steel vs YCP: తెలంగాణ కోసం ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ కదిలివచ్చారు. రాజకీయ పార్టీలన్నీ ఏకమయ్యాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తృణప్రాయంగా తమ పదవులకు రాజీనామా చేసి పడేశారు. అఫ్ కోర్స్ వారి త్యాగనిరతికి ప్రజలు కూడా ఓట్లేసి మళ్లీ గెలిపించారు. తమ సమస్యల సాధనకు ఆ ప్రజాప్రతినిధులు చేసిన రాజీనామాలు చరిత్రలో నిలిచాయి..కానీ అది తెలంగాణ.. ఇది ఏపీ.. ఇక్కడ పదవులు బంగారం.. వాడిని వీడడానికి నేతలు ఇష్టపడరు. అదే సమయంలో సమస్యల సాధన […]

Written By: NARESH, Updated On : December 18, 2021 10:31 pm
Follow us on

Vizag steel vs YCP: తెలంగాణ కోసం ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ కదిలివచ్చారు. రాజకీయ పార్టీలన్నీ ఏకమయ్యాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తృణప్రాయంగా తమ పదవులకు రాజీనామా చేసి పడేశారు. అఫ్ కోర్స్ వారి త్యాగనిరతికి ప్రజలు కూడా ఓట్లేసి మళ్లీ గెలిపించారు. తమ సమస్యల సాధనకు ఆ ప్రజాప్రతినిధులు చేసిన రాజీనామాలు చరిత్రలో నిలిచాయి..కానీ అది తెలంగాణ.. ఇది ఏపీ.. ఇక్కడ పదవులు బంగారం.. వాడిని వీడడానికి నేతలు ఇష్టపడరు. అదే సమయంలో సమస్యల సాధన కోసం వాటిని త్యాగం చేయరు. ప్రజలు ఏమై పోయినా.. సమస్యలు పేరుకుపోయినా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తారు. అదే తెలంగాణ, ఏపీ నేతలకు మధ్యనున్న తేడా.

ycp vishaka steel

తెలంగాణ ఉద్యమం అంత స్ట్రాంగ్ కొనసాగడానికి.. ఏపీ ఉద్యమం తేలిపోవడానికి ప్రధాన కారణం కేవలం స్వార్థచిత్తంతో ఉండే ఏపీ నేతలే.. రాష్ట్రం విడిపోయినా వారి పదవీకాంక్ష ఇంకా తగ్గలేదని తేలింది.

ఏపీలో ఇప్పుడు ప్రధాన సమస్యగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ మారింది. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ ఎంతో మంది ప్రాణత్యాగాలతో ఇక్కడ నెలకొల్పిన ఈ పరిశ్రమను తెగనమ్మడానికి కేంద్రం రెడీ అయ్యింది. ప్రైవేటీకరణతో దీన్ని ఎవరికో కట్టబెట్టి కార్మికులను, ఉద్యోగులను వారి మానాన వదిలేయడానికి రెడీ అయ్యింది.

ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, ఉద్యోగులు, ఏపీలోని అధికార, ప్రతిపక్షాలు ఆందోళన చేశారు. ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మాత్రం మిన్నకుండిపోతోంది. మొదట్లో ఉత్తరాంధ్ర వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాస్త హడావుడి చేసి మేం కొట్లాడుతామన్నారు. కానీ ఇప్పుడు విశాఖలో వాళ్లు కనిపించడం లేదు. అసలు అధికార పార్టీలో విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలన్న సోయి లేదు. వారికి ఆధ్యాసే లేదు.

ఏపీ ప్రజలు వైసీపీకి 151మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇచ్చారు. ఇప్పుడు పార్లమెంట్ లో కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఎంపీలున్న పార్టీలలో వైసీపీ కీలకంగా ఉంది. మొదట్లో వైసీపీ మద్దతుతోనే బీజేపీ పలు బిల్లులు ఆమోదించుకుంది. అంతటి కీలకమైన స్థానంలో ఉండి సీఎం జగన్, వైసీపీ ఎంపీలు విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్న కేంద్రంపై పల్లెత్తు మాట అనడం లేదు. జగన్ కు కేసుల భయమో.. ఎంపీల వ్యాపార అవసరాలో కానీ బీజేపీని కనీసం పార్లమెంట్ లో ప్రశ్నించిన పాపాన పోవడం లేదు.

అందరు ఎంపీలు ఒక్కటై పార్లమెంట్ ను విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై స్తంభింపచేసేంత బలం ఉంది. రోజూ ఆందోళన చేసి బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేయొచ్చు. బీజేపీని షేక్ చేయవచ్చు. పోనీ ఏపీ ప్రజల కోసం రాజీనామాలు చేయవచ్చు. కానీ కడుపులో చల్ల కదలకుండా వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో విశాఖ ఉక్కు పై ప్రశ్నించకుండా చేష్టలుడిగి చూస్తున్నారన్న విమర్శలున్నాయి. బీజేపీని అనడానికి వైసీపీ ఎంపీలకు నోరు లేదా? వారి నోటికి ఎందుకు తాళం పడింది. జగన్ ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నాడు? ఏపీ ప్రజల చిరకాల డిమాండ్ ను నెరవేర్చడంలో అధికార వైసీపీ ఎందుకు ఇలా మీనామేషాలు లెక్కిస్తోందని సగటు ఏపీ వాసి మథనపడుతున్నాడు. గెలిపించింది సమస్యలు పరిష్కరించడానికి కానీ.. అధికార వైసీపీ ఎందుకు ప్రజల పక్షాన కాకుండా బీజేపీ పంచన గమ్మున ఉందని నిలదీస్తున్నారు. ప్రజా సమస్యలు తీర్చని పాలకులు ఉండి వేస్ట్ అని అంటున్నారు. మరి దీనికి వైసీపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.