Visakhapatnam- YCP: సాగర నగరం విశాఖ పై వైసీపీ ప్రభుత్వం కత్తి కట్టిందా? ప్రాభవాన్ని మసకబార్చడానికి ప్రయత్నిస్తోందా? ఇప్పటికే అన్నివిధాలా నాశనం చేసిందా? గత ఎన్నికల్లో నగరవాసులు ఆదరించలేదని రివేంజ్ తీర్చకుంటుందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరంతో పాటు జిల్లాది ప్రత్యేక స్థానం. ఆర్థక నగరంగా పేరుగాంచింది. పర్యాటక రంగంలో దేశంలో చెరగని ముద్ర వేసకుంది. సువిశాల తీర ప్రాంతంతో పాటు మన్యం మణిహారంగా ఉండేది. పర్యాటకులను ఆకర్షించేది. అటువంటిది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీన్ మారిపోయింది. పరిస్థితి తలకిందులైంది. మూడు రాజధానుల పేరిట వైసీపీ నేతలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ప్రకటన వచ్చి రెండేళ్లవుతున్నా పాలనా రాజధానికి అతీగతీ లేదు.
ఇటు సాగరం, అటు మన్యం, మధ్యలో మైదాన ప్రాంతాల సమాహారంగా 15 నియోజకవర్గాలతో రాజకీయ యవనికపై విశాఖ జిల్లాది ప్రత్యేక స్థానం. కానీ జిల్లాను మూడు ముక్కలు చేశారు. విశాఖ జిల్లాను ఏడు నియోజకవర్గాలకే పరిమితం చేశారు. నగరంతో మన్యం, మైదానాలకు దశాబ్దాలుగా ఉండే అనుబంధాన్ని తొలగించారు. ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా జిల్లాలకు మంత్రి పదవు కేటాయింపు హైలెట్ అవుతోంది. విశాఖపట్నం విషయంలో వైసీపీ సర్కారుకు అంత మంచి అభిప్రాయం ఉన్నట్టు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. చిన్న జిల్లాగా మర్చేయడం.. రాజధాని విషయమే ఎత్తకపోవడం.. ఇప్పుడు మంత్రి పదవి కూడా కేటాయించకపోవడం పై సొంత పార్టీలోనే విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతానికి బయటకు ఎవరూ నోరెత్తకపోయినా.. సీఎం జగన్ నిర్ణయం పై పెదవివిరుస్తున్నారు. దీనికి భవిష్యత్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
Also Read: KCR : కేసీఆర్ సార్.. ఎంత పనిచేస్తివి..!
నాటి వైభవమేదీ?
ఒకప్పుడు అతిపెద్ద జిల్లా విశాఖ. దాన్ని ఎలాగూ జిల్లాల ఏర్పాటులో అతి చిన్న జిల్లాగా మార్చేశారు. పోనీ అప్పుడైనా దానికి ప్రాధాన్యత దక్కుతుందని విశాఖ వాసులు సరిపెట్టుకున్నారు. కానీ.. విశాఖకి అసలు ఉనికే లేకుండా చేద్దామనే ప్రయత్నాలు ఇప్పుడు వైసీపీలో జరుగుతున్నాయనేది టాక్. వైసీపీ విశాఖ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు పెద్ద పొరపాటుగానే చూడాలంటారు రాజకీయ విశ్లేషకులు. విశాఖ విషయంలో ఇప్పటికే తప్పిదాలు జరిగాయని.. మళ్లీ మరిన్ని తప్పులు చేస్తూ పోతోందని.. పార్టీ పై బహిరంగంగానే కార్యకర్తలు ఆడిపోసుకుంటున్నారు. విశాల నగరం విశాఖ కుంచించుకుపోయింది. ఇప్పుడు కేవలం ఏడు నియోజకవర్గాల నగరం జిల్లా అయిపోయింది. మొదట్లో పదిహేను నియోజకవర్గాలు ఉన్న విశాఖ జిల్లా ఇప్పుడు కేవలం ఏడు నియోజకవర్గాల తీర ప్రాంత నగరం. గత టీడీపీ హయాంలో ఆర్ధిక రాజధాని అంటే నగరవాసులు పొంగిపోయారు. వైసీపీ వచ్చిన తర్వాత మూడు రాజధానులు.. పరిపాలనా రాజధాని అంటే మురిసిపోయారు. కానీ.. రాజధాని లేదు. జిల్లాను చిన్నగా మార్చేశారు. మొన్నటి కొత్త మంత్రివర్గం ఏర్పాటులో కనీసం ఈ జిల్లాకు ప్రాధాన్యత లేదు. ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యే ఉన్నారన్న సోయ లేదు. కనీసం ఈ నగరాన్ని తర్వాత గెలుచుకుంటామన్న ఆలోచన కూడా లేదా.. అంటూ కార్యకర్తల ప్రశ్న.
దక్కని అమాత్య పదవి
2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ ప్రభంజనం వీచినా.. విశాఖ నగరంలోకి కీలకమైన తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర నియోజకవర్గాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. తూర్పు నియోజకవర్గం నుంచి వెలగపూడి రామక్రిష్ణబాబు ఏకంగా 27,000 ఓట్లతో గెలుపొందారు. పశ్చిమ నుంచి పెతకంశెట్టి గణబాబు, ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావు, దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. టీడీపీ విజయాన్ని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను తమ వైపునకు తిప్పుకుంది. ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును రాజకీయంగా సైలెంట్ చేసింది. మిగతా ఇద్దరు మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఇంత చేసినా నగరవాసులు తమవైపు తిరగలేదన్న ఆందోళన వైసీపీకి వెంటాడుతోంది. జీవిఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఏ ప్రయత్నం చేయకుండా ముప్పై వార్డులు గెలుచుకుంది.
ఇక్కడ ముప్పై కీలక వార్డుల్లో టీడీపీ కార్పొరేటర్లు గెలిచి టీడీపీ పనైపోలేదని నిరూపించారు. నిజానికి టీడీపీ కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే.. మరో ఇరవై వార్డులు గెలుచుకునేది. అయితే అప్పటి రాజకీయ పరిణామాల నేపధ్యంలో టీడీపి వెనక్కి తగ్గిందని టాక్ కూడా నడిచింది. ప్రస్తుతం టీడీపీ నగరంలో బలోపేతంగా ఉంది. వైసీపీ ఎంత ప్రయత్నిస్తున్నా పుంజుకోవడం లేదు. ఇక కొత్త విశాఖ జిల్లా నగరాన్ని టీడీపీ తన వైపు తిప్పుకోవడానికి ఎంతో సమయం పట్టే పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లో ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ నగరంపై ఫోకస్ పెంచారు. పంచాయితీ.. జీవిఎంసీ ఎన్నికల్లో టీడీపి ప్రభావాన్ని తగ్గించాలని చూశారు. దానికి తగ్గట్టు లోకల్ రాజకీయాల్లో తన మార్క్ ను ప్రదర్శించారు. దీంతో పంచాయితీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీని సంపాదించి పెట్టారు.
కానీ.. . జీవిఎంసీ ఎన్నికల్లో మాత్రం ఏకపక్ష విజయాన్ని సాధించలేకపోయారు. అందుకే అధిష్టానం కొన్నాళ్లు విజయసాయిరెడ్డిని పక్కన పెట్టిందన్న గుసగుసలు వినిపించాయి. అటు తరువాత మళ్లీ ఆయనకు రాష్ట్రంలో కీలక బాధ్యతలు ఇవ్వగానే విశాఖ వైపు విజయసాయి ఫోకస్ ప్రారంభించారు. కానీ.. మంత్రి వర్గం విస్తరణలో మొత్తం గాలి తీసేసింది వైసీపీ అధిష్టానం. మంత్రి వర్గ కూర్పులో ఉత్తరాంధ్ర బాధ్యుడు విజయసాయిరెడ్డికి ఎలాంటి సమాచారం.. ప్రాధాన్యత లేదని చెప్పుకుంటున్నారు. అలాగే విశాఖకి కూడా ఎలాంటి మంత్రి పదవి కేటాయించకుండా వదిలేశారు. మొన్నటిదాకా కొనసాగిన మంత్రి అవంతిని కూడా ఇప్పుడు మాజీ మంత్రిగా కూర్చోబెట్టారు. ఇంతకీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో.. అర్థం కాక వైసీపీ నేతలు బుర్రలు గోక్కుంటున్నారు. విశాఖను ఏం చేద్దామని వీళ్లు నిర్ణయించుకున్నారో తెలియడం లేదని గింజుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ ప్రభావం గ్రౌండ్ లెవెల్లో స్పష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో వైసీపీ క్యాడర్ కి ఊతమిచ్చే పని చేయకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Also Read:BJP: బీజేపీలో నేతల మధ్య పెరుగుతున్న గ్యాప్.. అధిష్టానం వైఖరెంటీ?