
పార్లమెంటు సమావేశాల్లో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వేడీ రాజుకుంటోంది. రాష్ట్రానికే అతమానికంగా కొనసాగుతోన్న.. ప్రతిష్టాత్మక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించడానికి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు నిరసనలు పెల్లుబికుతున్నాయి. పార్లమెంటు సమావేశాలు వేదికగా.. అధికార వైఎస్సార్ సీపీ పార్టీ తన పోరాటాన్ని ఉధృతం చేసింది. విశాఖ పట్నంలో క్షేత్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు.. ఆందోళనల కార్యక్రమాలు నిర్వహించిన వైఎస్సార్ సీపీ పార్లమెంటు సభ్యులు.. ఇక హస్తినా వేదికగా.. తమ పోరాటాన్ని వేగవంతం చేశారు. పార్లమెంటులో నిరసన జ్వాలలు రగిలిస్తున్నారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటీకరించాలనే ప్రతిపాదనను నిరసిస్తూ.. సోమవారం రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ ఎంపీలు.. ఆ నిరసనలను కొనసాగిస్తున్నారు. ప్రయివేటీకరణ నిర్ణయాన్ని పున సమీక్షించాలనే డిమాండ్ చేస్తూ.. రాజ్యసభలో మంగళవారం కూడా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు వైసీపీ సభాపక్ష నాయకుడు విజయసాయి రెడ్డి జీరో అవర్ నోటీసు ఇచ్చారు. చైర్మన్ వెంకయ్య నాయుడు కార్యాలయానికి నోటీసులను పంచించారు.
రాష్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్( ఆర్ఐఎన్ఎల్) ను లాభాల్లోకి తీసుకుని రావడం.. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రయివేటీకరించకుండా ఉండడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఆయన జీరో అవర్ నోటీసులు ఇచ్చారు. అయితే కోట్ల మంది ఏపీ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్నందున ప్రయివేటీకరణ విషయాన్ని, ప్రతిపాదనలను పునర్ సమీక్షించాలని కోరారు. వైజాగ్ స్టీల్ ప్లాంటును లాభాల్లోకి తీసుకురావడానికి ఇదివరకే ముఖ్యమంత్రి వైఎస్. జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారని గుర్తు చేశారు.
తాము ఎట్టి పరిస్థితుల్లోనూ.. స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణను అంగీకరించబోమని తేల్చి చెప్పేశారు. ఎవరి అభిప్రయాన్ని కూడా తీసుకోకుండా ప్రయివేటీకరణపై ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని.. కోట్లాది మంది ప్రజల జీవనంలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఓ భాగంగా మారిందని సాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు గనులు కేటాయించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రధాన్యత క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలకు తొలుత గనులను కేటాయించేలా నిబంధనలు పునర్ సమీక్షించాలని డిమాండ్ చేశారు.