ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఎంత హాట్ హాట్ గా సాగిందో అందరికీ తెలిసిందే. ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ప్రభుత్వం మొదటగా నిర్ణయిస్తే.. కరోనా ఉందంటూ అడ్డుకున్నారు ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఆ తర్వాత నిమ్మగడ్డ సిద్ధమైతే.. ప్రభుత్వం మోకాలొడ్డింది. ఈ క్రమంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. కొన్నాళ్లు లేఖల యుద్ధం సాగింది. చిట్ట చివరకు సుప్రీం నిర్ణయం ద్వారా ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది.
Also Read: బుద్దా వారి బూతు పురాణం…ఆడియో లీక్
ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. ఆ తర్వాత మునిసిపల్ ఎన్నికల విషయంలోనూ కాస్త రాద్ధాంతం జరిగింది. మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ.. వైసీపీ నేతలు కొందరు కోర్టుకెక్కారు. చివరకు ఈ ఎన్నికలు కూడా జరగడం.. వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించడం జరిగిపోయాయి.
ఇక, స్థానిక సంస్థల్లో మిగిలింది పరిషత్ ఎన్నికలు. ఈ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలూ నిమ్మగడ్డ చేతనే నిర్వహించాలని వైసీపీ ఉబలాటపడుతుండడం విశేషం. ఈ నెలాఖరుతో నిమ్మగడ్డ పదవీకాలం ముగుస్తుంది. కాబట్టి.. ఈ లోగానే ఎన్నికలు నిర్వహించాలని తాపత్రయ పడుతోంది అధికార పార్టీ. కేవలం ఆరు రోజుల్లో ఎన్నికలు పూర్తవుతాయని మంగళవారం కలెక్టర్ల సమావేంలో అన్నారు జగన్. మొన్నటి వరకూ నిమ్మగడ్డను దునుమాడిన మంత్రి పెద్దిరెడ్డి వంటి వాళ్లు కూడా నిమ్మగడ్డే ఈ ఎన్నికలు నిర్వహించాలని వ్యాఖ్యానించడం గమనార్హం.
Also Read: పోతిన మహేష్ తో ఉన్న గొడవ గురించి క్లారటీ…
కాగా.. ఈ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన వేసిన పిటిషన్ కోర్టులో పెండింగ్ లో ఉంది. మరోవైపు నిమ్మగడ్డ 22 నుంచి 25 వరకు సెలవు పెడుతున్నారు. ఆ తర్వాత మరో ఆరు రోజులు మాత్రమే నిమ్మగడ్డ పదవీ కాలం ఉంటుంది. మరి, ఈ గ్యాప్ లో ఎన్నికలు జరుగుతాయా? లేదా? నిమ్మగడ్డ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది ఉత్కంఠగా మారింది. ఇదంతా ఒకెత్తయితే.. నిమ్మగడ్డతోనే ఎన్నికలు నిర్వహింపజేయాలని వైసీపీ నేతలు ఎందుకు ఆరాటపడుతున్నట్టు..? తెరవెనుక ఏదైనా జరిగి ఉంటుందా? అని పలువురు అనుమానాలు కూడా వ్యక్తంచేస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్