Tirupati: ఏపీలో రాజకీయ దాడులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఎక్కడికక్కడే అధికార పార్టీ నేతలు విధ్వంసాలకు దిగుతున్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకులపై భౌతిక దాడులకు దిగుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. పార్టీ కార్యాలయాలు, ఇళ్లపై దాడులు చేస్తున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులను అని చూడకుండా చేయిచేసుకుంటున్నారు. విజయవాడలో ఇటీవల టీడీపీ నాయకుడి కంటినే పొడిచేశారు. రాష్ట్రంలో ఏదో మూలన ఈ దాడుల పరంపర వెలుగుచూస్తునే ఉంది. తమను ప్రశ్నిస్తున్నారో…లేక తమ ఆధిపత్యాన్ని గండికొడుతున్నారనో అధికార వైసీపీ నేతలు ఆరచకాలకు దిగుతున్నారు. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారు. ప్రశాంతనగరం తిరుపతిలో ఇటీవల జనసేన నేతలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

మహిళలని చూడకుండా….
తిరుపతిలోని వెంకటరెడ్డి కాలనీలో ఓ జనసేన నేత ఇంట్లోకి వైసీపీ అల్లరిమూకలు ప్రవేశించాయి. మాకే అడ్డుగా నిలుస్తారా అంటూ మహిళలపై రుసరుసలాడుతూ చేయి చేసుకున్నారు. జనసేననేతపై దాడిచేశారు. ఈ ఏరియాలో ఉంటే గింటే వైసీపీ ఉండాలి కానీ.. జనసేన అని మాట ఎత్తితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ఇంట్లో ఉన్న ఫర్నీచర్, సామాన్లను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా మహిళలని కూడా చూడకుండా నానా దుర్భాషలాడారు. ఈ ఘటనతో సదరు జనసేన నాయకుడి కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. మహిళలు గాయాలతో విలవిలలాడిపోయారు. ఇంట్లో చిన్నారులైతే వణికిపోయారు. ఒక గ్యాంగ్ వచ్చి విధ్వంసం సృష్టించడంతో కాలనీవాసులు కూడా హడలెత్తిపోయారు. సినిమా ఫక్కీలో ఘటన చోటుచేసుకున్నా అటువైపుగా పోలీసులు కూడా రాలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. తిరుపతిలోని ఎస్కే బాబు వర్గీయులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.

జనసేన నేతల సంఘీభావం…
ఈ ఘటనతో జనసేన వర్గీయులు వెంకటరెడ్డి కాలనీకి చేరుకున్నారు. బాధితులకు సంఘీభావం తెలిపారు. జనసేన ముఖ్య నాయకులు కిరణ్ రాయల్, సుభాషిణి బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. రాష్ట్ర నేతలకు సమాచారమిచ్చారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా జన సైనికులు స్పందిస్తున్నారు. అధికార పార్టీ దురాఘతాలను ఎండగడుతున్నారు. తక్షణం నిందితులనుఅరెస్ట్ చేయకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో జనసేనకు పెరుగుతున్న ఆదరణను చూసి సహించలేక ఇటువంటి దాడులకు దిగుతున్నారని మండిపడుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై బాధితులతో కలిసి స్థానిక నాయకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.